*శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 28*

P Madhav Kumar


*రక్తబీజ వధ - 3*


ఆ మహాసురులు శివునిచేత తెలుపబడిన దేవీ వాక్యాలు విని రోషపూరితులై కాత్యాయని* ఉన్న చోటికి వెళ్ళారు.


అంతట గర్వకోపపూర్ణులైన ఆ సురవైరులు మొదటనే దేవిపై బాణాలను, బల్లాలను, ఈటెలను కురిపించారు.


ఆ ప్రయోగింపబడిన బాణాలను, శూలాలను, బల్లాలను, గండ్రగొడ్డండ్లను ఆమె పూర్తిగా లాగబడిన తన వింటి నుండి వెడలేమహాబాణాలతో అవలీలగా ఛేదించివేసింది.


అంతట అతని (శుంభుని) ఎదుటే శత్రువులను శూలపుపోట్లతో చీల్చివేస్తూ, పుట్టైపిడి గల బెత్తంతో మర్దిస్తూ, కాళి చరించింది.


బ్రహ్మాణి తాను ఎచటికి పోయినా తన కమండలూదకాలను శత్రువులపై చల్లి వారిని ధైర్య, శౌర్య విహీనులనుగా చేస్తోంది.


మాహేశ్వరి త్రిశూలంతో, వైష్ణవి చక్రంతో, కౌమారి బల్లెంతో కోపంగా దైత్యులను పరిమార్చారు.


ఐంద్రి ప్రయోగించిన వజ్రాయుధంతో చీల్చబడి దైత్యులు దానవులు నూర్లకొలద్దీ నేలకూలారు. వారి నుండి రక్తపునదులు పారాయి.


వారాహియొక్క ముట్టెదెబ్బలవలన ధ్వంసము చేయబడి,

కోరలమొనపోటులవలన గుండెలో గాయపడి, చక్రపు తాకుడువలన చీల్చివేయబడి (అసురులు) పడిపోయిరి.


నారసింహి ఆకసమును, దిక్కులను తననాదములతో నిండించుచు, తన గోళ్లతో చీల్పబడిన ఇతర మహాసురులను భక్షించుచు యుద్ధములో సంచరించెను.


శివదూతి యొక్క భయంకరములగు అట్టహాసముల (పెద్దనవ్వు) వలన ధైర్యముసడలి అసురులు నేలపై కూలిపడుచుండిరి. ఆ కూలినవారిని ఆమె భక్షించుచుండెను.


రోషపూరితలైన మాతృకలు - వివిధోపాయాలతో మహాసురులను ఇలా మర్దించడం చూసి సురవైరి సైనికులు పారిపోయారు.


మాతృగణం వల్ల పీడింపబడి దైత్యులు పారిపోవడాన్ని చూసి రక్తబీజమహాసురుడు కుపితుడై యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడు.


అతని శరీరం నుండి రక్తబిందువు భూమిపై పడినప్పుడల్లా అతనిలాంటి అసురుడొకడు భూమి నుండి లేస్తున్నాడు.


ఆ మహాసురుడు గదాహస్తుడై ఇంద్రాణితో పోరాడాడు. ఆమె అంతట తన వజ్రాయుధంతో అతనిని కొట్టింది. 


వజ్రాయుధపు దెబ్బవల్ల అతని నుండి వెంటనే రక్తం అతిశయంగా కారింది. ఆ రక్తం నుండి అతని రూపంతో, అతని పరాక్రములైన యుద్ధవీరులు ఉత్పత్తి అవసాగారు.


 *సశేషం.........*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat