శ్రీదేవీభాగవతము - 29

P Madhav Kumar


*తృతీయ స్కంధము - 08*

              

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 29*


*భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందితా!*

*మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషితా!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 


*దేవీయజ్ఞ భేదాలు* చదువుకున్నాము.


*అమ్మ దయతో......*

ఈ రోజు  తృతీయ స్కంధములోని

*విష్ణుకృత దేవీయజ్ఞం*

 చదువుకుందాం......

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🙏 *విష్ణుకృత దేవీ యజ్ఞం* 💐


*వ్యాసమహర్షీ!* దేవీ యజ్ఞాన్ని లోగడ సృష్టి ఆదిలో విష్ణుమూర్తి చేశాడు అన్నావు. సమర్థుడూ జగత్కారణుడూ అయిన విష్ణువు ఈ యజ్ఞం ఎందుకు చెయ్యవలసి వచ్చింది ? అప్పుడు అతనికి సహాయం చేసిన వారెవరు ? బ్రాహ్మణులెవరు, ఎంతమంది ? వేదవిదులైన ఋత్విక్కులు ఎవరు ? ఈ వివరాలన్నీ తెలియజెప్పు. విష్ణుమూర్తి చేశాడంటే గొప్పమాట కదా ! ఇది విన్నాక యజ్ఞం ప్రారంభిద్దాం - అన్నాడు జనమేజయుడు.


అలాగే చెబుతానంటూ వ్యాసుడు గొంతు సవరించాడు.


*జనమేజయా !* శ్వేతద్వీపంలో త్రిమూర్తులు స్త్రీ మూర్తులై జగదీశ్వరిని అర్చించారు. మళ్ళీ తమ పురుషరూపాలను తిరిగి పొందారు. మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి శక్తులను పొందారు. దివ్య విమానంలో మహార్ణవానికి తిరిగి వచ్చారు. ధరామండలాన్ని సృష్టించారు.  దానికి ఆధారంగా జగదీశ్వరీశక్తి నిలిచింది. అందుకే దీనికి *'ధర'* అనే పేరు వచ్చింది. ఇందులో మధుకైటభుల మేదస్సు (కొవ్వు) కలిసింది. కనక *'మేదిని'* అనే పేరు ఏర్పడింది. విశాలంగా విస్తృతంగా ఉంది కాబట్టి *పృధ్వి* అనే పేరు సిద్ధించింది. *మహి* అనే పేరుకూడా అందువల్లనే. దీన్ని శేషుడు తన మస్తకం మీద ధరించాడు. అటూ ఇటూ ఒరిగిపోకుండా నిలబెట్టడానికి ఇనపగుండుల్లా పర్వతాలు ఆవిర్భవించాయి. అందుకే వాటికి *మహీధరాలు* అని పేరు. మణిమయ రత్నశృంగాలతో బహుయోజన విస్తారంగా బంగారుకొండను కల్పించింది జగదంబిక. దాన్ని *మేరుపర్వతం* అంటారు.


మరీచి, నారదుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతుడు, దక్షుడు, వశిష్ఠుడు అనేవారు బ్రహ్మదేవుడికి పుత్రులు. మరీచికి కశ్యపుడు అనే సుతుడు జన్మించాడు. దక్షుడికి పదమూడుమంది పుత్రికలు కలిగారు. వారికి బహువిధాలుగా దేవతలూ దైత్యులూ జన్మించారు. అతి విస్తృతమైన కాశ్యపీసృష్టి జరిగింది. అది మనుష్య పశు సర్పాదిభేదాలతో విస్తరిల్లింది.


బ్రహ్మదేవుడి శరీరంలో కుడి భాగం నుంచి *స్వయంభూ మనువు* ఆవిర్భవించాడు. వామ భాగం నుంచి *శతరూప* ఆనే స్త్రీ జన్మించింది. ఆవిడకు *ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు* అనే కొడుకులు కలిగారు. మరో ముగ్గురు అత్యంత సుందరాంగులు పుత్రికలుగా జన్మించారు.


ఇలా బ్రహ్మదేవుడు సృష్టి జరిపి తన కోసం మేరు శృంగం మీద అతి మనోహరమైన సత్యలోకాన్ని నిర్మించుకున్నాడు. లక్ష్మీదేవితో కలిసి నివసించడానికీ క్రీడించడానికి అనువుగా విష్ణుమూర్తి అన్ని లోకాలకన్నా పైని వైకుంఠం నిర్మించుకున్నాడు. శివుడేమో కైలాసాన్ని ఏర్పరుచుకున్నాడు. భూతగణాన్ని సిద్ధం చేసుకుని పార్వతీ సహితుడై కైలాస పర్వత శిఖరంమీద విహరిస్తుంటాడు. *త్రివిష్టపము* అనే స్వర్గాన్ని మేరు శిఖరాలలో ఒకదానిపై నిర్మించి సురేంద్రుడికి నివాసంగా అందించారు. సముద్రమథనంలో పుట్టిన పారిజాతాన్నీ, కామధేనువునీ, నాలుగు దంతాల ఐరావతాన్నీ, ఉచ్చైఃశ్రవమనే గుర్రాన్ని రంభాద్యప్సరసలనూ దేవేంద్రుడికి బహూకరించారు. ధన్వంతరి, చంద్రుడు కూడా క్షీరసముద్రం నుంచే ఆవిర్భవించారు. వీరు కూడా తమ తమ దేవగణాలతో కలిసి స్వర్గంలోనే నివాసం ఏర్పరచుకున్నారు. వీరంతా స్వర్గానికి ఆభరణాలు.


దేవ తిర్యక్ మనుష్యభేదాలతో ఇలా ఈ సృష్టి ముప్పేటగా సాగింది. *అండజములు, స్వేదజములు, ఉద్భిజములు, జరాయుజములు అనే నాలుగుభేదాలతో జీవరాశి కర్మానుసారంగా సముత్పన్నమయ్యింది.* 


సృష్టిని ఇలా జరిపి త్రిమూర్తులూ తమతమ భార్యలతో తమతమ నెలవులలో సుఖసంతోషాలు అనుభవిస్తూ విహరిస్తున్నారు.


ఇలా ఉండగా, ఒకరోజున విష్ణుమూర్తికి శ్వేతద్వీపమూ మణిమండపమూ జ్ఞాపకం వచ్చాయి. ఆదిపరాశక్తిని దర్శించి, స్త్రీభావం పొంది, అర్చించి, స్తుతించి, దివ్యమంత్రోపదేశంతో పాటు లక్ష్మీదేవిని అందుకొన్న అలనాటి సంఘటన స్మృతిపథంలో మెరిసింది. మహాదేవీ యజ్ఞం చెయ్యాలని కోరిక కలిగింది. బ్రహ్మ మహేశ్వరులనూ అష్టదిక్పాలకులనూ వశిష్ఠ కశ్యప దక్ష వామదేవ బృహస్పతులను ఆహ్వానించి తన సంకల్పం తెలియజేశాడు. యజ్ఞ సంబారాలను పుష్కలంగా కల్పించాడు. శిల్పులను పిలిపించి, మహావిభవం ఉట్టిపడేట్టు సుమనోహరంగా సాత్త్వికంగా విశాలంగా యజ్ఞ మండపం నిర్మింపజేశాడు. ఇరవైయేడుమంది వేదవిదులను ఋత్విక్కులుగా వరించాడు. వారు విస్తారమైన వేదికలలో (అగ్నికుండాలు) అగ్నులను రగిలించారు. దేవీ బీజసమన్వితాలైన మంత్రాలను పఠించారు, జపించారు. శాస్త్ర ప్రకారం హవిస్సుతో హోమాలు చేశారు. అప్పుడొక అశరీరవాణి మృదుమధురంగా వినిపించింది.


*హే ! విష్ణో !* నువ్వు ఈ రోజునుంచీ దేవతలలోకెల్లా ఉత్తమోత్తముడవు అవుతున్నావు. బ్రహ్మాది సకల దేవతలూ నిన్ను అర్చిస్తారు. మానవులంతా నీ భక్తులు అవుతారు. వారికి నువ్వే వరదుడవు. సర్వయజ్ఞాలలోనూ నువ్వు ముఖ్యుడివి. యాజ్ఞికులు ప్రథమార్చన నీకే చేస్తారు. దానవపీడలు సంభవించినప్పుడు సకలదేవతలూ నిన్నే ఆశ్రయిస్తారు. వేదపురాణాలు అన్నింటా నువ్వు పురుషోత్తముడవుగా కీర్తింపబడతావు. భూలోకంలో ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా నువ్వే అవతరించి ధర్మరక్షణ చెయ్యాలి.


*యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భూతలే |* 

*తదాంశేవావతీర్యాశు కర్తవ్యం ధర్మరక్షణమ్ |*


నీ అవతారాలకు భూలోకంలో విస్తృతమైన ప్రాచుర్యం లభిస్తుంది. అందరూ వాటిని అర్చిస్తారు. ఆవతారాలన్నింటా నా అంశ నీకు సహచారిణిగా ఉంటుంది. వారాహీ నారసింహీ భేదాలతో - నా శక్తి నీకు సర్వకార్య ప్రసాదిని అవుతుంది. ఆ శక్తి స్వరూపాలు సర్వాభరణభూషితలై సర్వాయుధధారిణులై నీకు సహకరిస్తాయి. నువ్వు గర్వపడి వారిని ఏనాడూ చిన్నచూపు చూడకూడదు సుమా ! వారంతా నీకు మాననీయులూ పూజనీయులూ. జాగ్రత్త వహించు. భరతఖండంలో సర్వార్థప్రదలైన శక్తి స్వరూపాలుగా వారు అందరి పూజలనూ అందుకుంటారు. వారికీ నీకూ అఖండకీర్తి లభిస్తుంది. సప్త ద్వీపాలలోనూ స్వర్గంలోనూ మా కీర్తి వ్యాపిస్తుంది. కోరికలున్న మానవులు అవి సిద్ధించడం కోసం రకరకాల ఉపహారాలతో వేదమంత్రాలతో విభిన్న మార్గాలలో మిమ్మల్ని పూజిస్తుంటారు. సంపదభివృద్ధులను పొందుతుంటారు. మధుసూదనా ! నువ్వు నేటినుంచీ దేవాధిదేవుడవు.


ఈ ఆశరీరవాణి పలుకులకు విష్ణుమూర్తి సంతోషించాడు. దేవతలంతా అభినందించారు. యజ్ఞం పరిసమాప్తి చేసి ఋత్విక్కులు సెలవు తీసుకున్నారు. బ్రహ్మ మహేశ్వరులు తమ నెలవులకు వెళ్ళిపోయారు. విష్ణుమూర్తి గరుడుణ్ణి ఆధిరోహించి యజ్ఞశాల నుంచి తన మందిరానికి చేరుకున్నాడు. మళ్ళీ యధాపూర్వంగా అందరూ తమ విధులను తాము చేసుకుంటున్నారు.


మునుల ఆశ్రమాలలో ఈ వార్త చర్చనీయాంశమయ్యింది. అందరికీ ప్రకృతిపట్ల (శక్తి) భక్తి భావము చిగురించింది. ఆగమోక్త ప్రకారంగా అందరూ శక్తిపూజలు ఆరంభించారు.


*(అధ్యాయం - 13, శ్లోకాలు - 59)*


జనమేజయుడికి గురి కుదిరింది. దేవీయజ్ఞం ఎలా చెయ్యాలో తెలిసింది. చెయ్యాలనే సంకల్పం బలపడింది. అయితే దేవీ మహిమ తెలుసుకోవాలి అనుకున్నాడు. అది చెప్పి నా జన్మ పావనం చెయ్యి అని వ్యాసుణ్ణి ఆభ్యర్ధించాడు. వ్యాసుడు అలాగే అని ప్రారంభించాడు.


*(రేపు "సుదర్శనుడి కథ" )*


*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*


               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏


🙏 శ్రీ మాత్రే నమః🙏

🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat