అయ్యప్ప సర్వస్వం - 34*

P Madhav Kumar


*శరణాగత వత్సలుడే శరణమయ్యప్ప - 2*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


అంతటి అచంచలమైన శరణాగతినే మనవద్ద నుండి భగవంతుడు ఎదురు చూస్తాడు. మన సర్వశక్తులు కోల్పోయిన పిమ్మట ఇక భగవంతుడు తప్ప అన్యశరణములేదను సంపూర్ణ విశ్వాసముతో భగవంతుని ప్రార్థన చేయువారికి మాత్రమే ఆ భగవదనుగ్రహము లభ్యమగును. శరణాగతి నిండుగా ఆత్మార్పణగా , నిబంధనలు లేనిదిగా , పెదవి నుంచిగాక హృదయ పూర్వకము గానూ యుండవలెను. జీవితములోని జంటలగు మంచి - చెడు , సుఖము - దుఃఖము , జయము -  అపజయము , వేడుక - వేదన , మిట్ట -  పల్లములన్నియు మాయా లీలలు అని గ్రహించిన పిమ్మట , 'భగవంతుడా ! నావద్ద ఎట్టి శక్తియు లేదు. నేను నాయొక్క స్వప్రయత్నముతో ఏమియు చేయజాలను. చేయలేనుగూడ. ధర్మాధర్మ వివక్షత లేమియు తెలియని అజ్ఞానినినేను. మంచేది , చెడు ఏది , పాపమేది , పుణ్యమేది , శాశ్వతమైనదేది , అశాశ్వత మైనదేది యను విబేధము లేవియు తెలియని , తెలుసుకోలేని పరమశుంఠను నేను. నీ పదకమలములో పసిపాప వంటి వాడనునేను. నేను రోధిస్తున్నాను. అది ఆ కలివలన నా రోగము చేతనాయని తెలియకనే ఏడుస్తున్నాను. నన్ను ఓదార్చవలసిన బాధ్యతనీదే. నావద్ద ఏమియులేదు. నీవు ఆడించినట్లు ఆడే బొమ్మను నేను. నేను తెలిసి తెలియక ఎనలేని నేరములు చేసియున్నాను. వాటిని నీవు తప్ప ఇంకెవరు మన్నించగలరు ? నాతప్పు ఒప్పులను మన్నించి , నన్ను కడదేర్చువారు నీకన్న ఇంకెవరూలేరు యని అశ్రువులు నిండిన నయనములతో , నిండు మనసుతో , కరములను పైకి జోడ్చి , స్వామియేశరణం ! నీపదకమలములే శరణం ! అని ఆ దేవదేవుని ఆశ్రయించుటయే గదా పరిపూర్ణ శరణాగతి తత్వము !


భక్తులు పిలిచే *'స్వామియే శరణం అయ్యప్ప'* యను పిలుపుకు మారుపలుకుగా వెంటనే ప్రత్యక్షమై ఏలుకొనే శరణాగత వత్సలుడై కలియుగాన శ్రీస్వామి అయ్యప్ప వెలసియున్నారు. వారి దివ్య సన్నిధిలో స్వామిశరణ నామ జపము రేయి పగలు యెడ తెగక వినిపించుచునే యుండును. శ్రీముత్తుస్వామి దీక్షితుల సాహిత్యములో హరిహరపుత్రం శాస్తారం *'అనుకృతిలో శ్రీధర్మశాస్తా వారిని 'కలియుగ ప్రత్యక్షదైవం'* అనియే వర్ణించి యున్నారు. తన భక్తులను పరీక్షచేయుటకు ఇష్టపడని దేవుడు శ్రీఅయ్యప్ప


ఎవరైనాసరే కష్టపడుతున్నారనిన వెంటనే మనస్సు కరిగిపోయే పసిబాలుని హృదయము కలవారై పన్నెండెండ్లు నిండిన పసి బాలరూపాన శబరిగిరిపై వెలసిన దయామయుడాయన , మిద్దెమెట్లు ఎక్కలేక పరితపించు శిశసువు యొక్క రోదనము వినగానే పరుగిడవచ్చిన తల్లి బిడ్డను ఎత్తుకొని మెట్లు ఎక్కించేట్లు , మనము ఏమియు చేయలేని ఆసక్తులమను సత్యము పరిపూర్ణముగా గ్రహించి భగవంతుని శరణాగతినొంది , ఆర్తితో అతని నామములను పిలిచి సాయముకోరువారికి , లేగదూడ పిలుపు వినిన ఆవువలె పరుగిడివచ్చి మనలను చేరదీసే దయామయుడు ఆయన. అహంకార మమకారములను త్యజించి సర్వం కల్పితం బ్రహ్మ , భగవంతుడే సర్వము. అను సత్యమును భోధపరచగల ఏకైక సాధనము కదా ఈస్వామి శరణం !


*"స్వామియే శరణం అయ్యప్ప"* అను పదజాలమున అణువులో బ్రహ్మాండాన్ని దాచినట్లు ఎంతటి మహిమాన్విత మయిన తత్వార్థము దాగియున్నది. సరాసరి మానవుని కూడా తిన్నగా

మోక్షమునకుగొనిపోగల సూత్రము కదా ఈ తారక మంత్రము. కపట శిరోరోగముతో బాధపడుతున్నట్లు నటించి ఔషధముగా పులిపాలు కోరిన తల్లికి , అది కల్లరోగమని తెలిసినా , ఆమెకోర్కె మేరకు పులిపాలు తెచ్చి ఇచ్చిన దయార్ద్ర హృదయుడైన ఆ మహా ప్రభువు నిజంగానే బాధపడుతూ తనను వేడుకొన్న తన భక్తుల పాలిట కల్పతరువై యుండి వారి కోర్కెలను తీర్చుటకు , వారిమీద కరుణామృతమును కురిపించుటకు వెనుకాడుతాడా ? ప్రేమతో ఒక పూట ఆహారమిడి , ఉపచరించి ఆనందము కల్గించిన యొక్క కారణముచే *'కంబంకుడి'* వంశీయుల ప్రేమకు తాను బానిసనైనట్లు శాసనము వ్రాసియిచ్చిన ఔదార్య శిలుడైన స్వామి అయ్యప్ప అనుదినము స్వామిశరణములనే జపించుచూ పూజలు భజనలు సలిపి ఏటేటక్రమ బద్ధముగా శబరిగిరియాత్ర వెడలి ఆయనను దర్శించి మరలే భక్తుల సకల అభీష్టములను పూర్తి చేయరా ? 'ఆడియార్కుమడియేన్ (దాసోపదాసుడను) అన్నట్లు భక్తసేవ చేయుటకు వెనుకాడని మహనీయుడాయన.


తన అవతారకాలమున , తనకు పలురీత్యా అపకారము తలపెట్టి , చివర తనను చంపేందుకు గూడ ప్రయత్నించి విఫలమై , ప్రేమమయమైన తన తల్లి హృదయంలో దుర్బోధనలు చే విషబీజమును నాటి , తనను అడవికి పంపినాడే యొక దుర్మంత్రి ! ఆదుర్మార్గునిపై గూడ ఆగ్రహము చెందక ఆతడు గూడ కారణజన్ముడేయని దయతో వాడ్ని క్షమించి అనుగ్రహించిన దయార్ధ హృదయము కల్గియున్న శ్రీస్వామివారు మనము తెలిసి తెలియక చేయు తప్పులను మన్నించి , నేరము లెంచక మనలను కాపాడుతాడనుటలో సందేహములేదు. మనము చేసేటి సకల విధములైన తప్పులను పాపములను , నేరములను , మన్నించి మనలను కాపాడుటకు శబరిమల తప్ప ఇంకొకతావులేదనియే చెప్పవచ్చును. అచ్చటనే కలియుగ వరదుడగు శ్రీ అయ్యప్పస్వామి వారు. సమస్తాపరాధ రక్షకుడై శరణాగతవత్సలుడై నెలకొని యున్నారు. ఇలా కరుణా సాగరుడై వ్యాపించియున్న హరి హరాత్మజుని శరణమని వేడుట తప్ప అన్యమార్గము కలదా ? *'అన్యధా శరణం నాస్తి త్వమేవశరణం మమ'* అని అతని పాదర విందములపైబడి శరణము వేడుకొను వారికి అభయప్రదుడై వెలసిన తారక బ్రహ్మ స్వరూపమే స్వామి అయ్యప్ప అని అందురు.


చిత్తశుద్ధితో వారిని సగుణ సాకారునిగా పూజించినను , నిర్గుణ , నిరాకారునిగా ధ్యానించినను , వారి వారి ఊహానుసారము ప్రసన్నమై ఏలుకొంటాడనుటయే పెద్దల విశ్వాసము. అచంచలమైన దైవ విశ్వాసము , భక్తి ప్రపత్తులు , వైరాగ్య చిత్తముకలవారు స్వామి అయ్యప్ప కృపకు పాత్రులై అతి త్వరగా కడదేర్చబడుతారనుట తధ్యం. సగుణ సాకరుడై భగవంతుని శ్రీరామచంద్రమూర్తిగా భావించి పూజించిన శబరియను భక్తురాలికి తదుపరి జన్మలో నిర్గుణ నిరాకారుడై భగవంతుని కొలిచిన పిమ్మటే మోక్షము లభించెను. ఆవిడ తపము చేసిన గిరికి శబరిగిరి యను సార్థక నామము ఏ. రామాయణములో భక్తశబరికి పాత్రకలదు. కాని మోక్షము (కైవల్యము) అయ్యప్ప అవతారమునందే యని అందురు. వైరాగ్య చిత్తులు లఘువుగా ముక్తి పొందవచ్చుననుటకు శబరిగాధ చక్కని తార్కారణమగును. ఇలా కరుణాసాగరుడై వెలయు భగవానుడు ఘోరోరాడవి మధ్యమున , తదేకదీక్షపూని , పట్ట బంధాకారుడై , లయించిన ధ్యానములో , యోగాసనమూర్తియై తపజ్వాలోన్ముఖులై కనిపించు చున్నారు. అంతటి తపోధనుడైన స్వామివారిని దర్శంచదల్చినవారు , కఠిన నియమ నిష్టలను , వ్రతానుష్ఠానములను పాటించగల దీక్షాదక్షులై యుండుట ఎంతగానో ఆవశ్యకమగును.


రాళ్ళు ముళ్ళు నిండిన అడవిమార్గాన , వన్యమృగములు సహజముగా తిరుగులాడే ప్రదేశములో పలుమైళ్ళ దూరం నడిచి వెళ్ళవలసి యుండును. పాశబంధములను విడనాడి , సుఖభోగములను త్యజించి , సన్యాస మానసులై , బ్రహ్మచర్య నిష్టాగరిష్ఠులై , పలుకష్ట నష్టములను ఎదుర్కొనవలసియుండు యాత్ర ఇది యని ఈశబరిమల యాత్రను గూర్చి చెప్పబడిననూ , వ్రతానుష్టానము లను తూ.చ. తప్పక పాటిస్తూ , అచంచల భక్తి విశ్వాసాలతో కఠినమైన వనయాత్ర చేసి స్వామి అయ్యప్పను దర్శించుకొనుటకు తరలి వచ్చే భక్తుల సంఖ్య ఏటేట పెరుగుచున్నదే తప్ప తరగడంలేదు. ఇలా వలు కష్ట నష్టములకోర్చి శబరిగిరివెడలివచ్చే భక్తులకు అచ్చట ఏమి లభిస్తున్నదను ప్రశ్నకు వెంటనే క్రింది విధముగా సమాధానము లభిస్తున్నది.


*మరికొంత భాగం రేపు చదువుకుందాము*


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat