అయ్యప్ప సర్వస్వం - 35

P Madhav Kumar


*శరణాగత వత్సలుడే శరణమయ్యప్ప  - 3*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*"శబరిమల యాత్ర యనునది కాలయాపనకో , ప్రకృతి సౌందర్య వీక్షణమునకొరకో వెడలి వచ్చేలా సాధారణ విహారయాత్రకాదు. భగవంతుని దర్శించుకొని మరలే ఆ సాధారణ స్థూలార్థము మాత్రము తీర్థ యాత్రయను పదం సూచించుటలేదు. ఇందులోని సూక్ష్మార్థమేమని అన్వేషించు వారికి ఇందులో గల పరమార్థ తత్వముగూడ గోచరించును. జీవాత్మ పరమాత్మలో ఐక్యము గావించుకొనేందుకు పరుగిడే జీవయాత్రయే ఇది. ఈ యాత్రామార్గములో జీవుడు పలుకష్ట నష్టములను ఎదుర్కొని , అహంకార మమకారములనేటి మాయ తొలగి అంచలంచలుగా పరిపక్వత చెంది , కర్తవ్యబోధ కల్గి , ఉన్నత స్థాయికి మానవాళిని కొనిపోగల మహిమలు నిండిన అద్భుత యాత్ర ఇది , అను నిత్యమును బోధించునదియే ఇందులోని పరమార్ధము. ఆ దివ్య సన్నిధిని చేరుకోగల్గిన ప్రతివారు మకరసంక్రాంతి దినము సాయంసంధ్యా వేళలో పరమాత్ముడైన భగవంతుని సాకారుడై అయ్యప్పగాను , నిరాకారుడై పరంజ్యోతిగాను దర్శించి మహదానందము చెందుతున్నారనిన మిన్నకాదు.*


ఆ దివ్య సన్నిధిలో , ఆ జ్యోతి స్వరూపంలో ఈ ఆత్మజ్యోతి లయించి తరించుచున్నది. ఇదియే జీవాత్మ పరమాత్మ సంగమం. అలా లయించి తరించి , సంస్కరింపబడిన జీవుడు. కల్మష మంతము తొలగినవాడై సత్వగుణశీలులై పునర్జన్మ నెత్తుతాడన్న మాట. అచ్చట శబరిమల నుండి ఓమారు జ్యోతిని దర్శించుకోకల్గిన ప్రతివారి ఏకోభిత అభిప్రాయముగూడ ఇదియే అగును. మహిమలు నిండిన శబరిమలయాత్రలోని స్థూలార్థ , సూక్ష్మార్థములను గ్రహించి , అందులకు అనుకూలించే శ్రీస్వామివారి అవతార మహిమలు గూర్చిన గాధలను శ్రవణించినచో , మనలో కలిగే అనేక ధర్మ సందేహములు వాటికవే తీరిపోవును. అందము చిందే కేరళ దేశమును , సముద్రమునుండి వెలుపలికి తెచ్చిన భార్గవ రాముడు ఆ ప్రదేశ రక్షణకై 108 శివక్షేత్రములను , 108 భగవతి అమ్మవారి ఆలయములను , 108 శాస్తా ఆలయములను నిర్మించి శాస్త్రోక్తముగా ప్రతిష్ఠలు సలిపి వెడలినారనియు , అందులో ప్రధాన రక్షణాకార్యము నిర్వహించే లెక్కలేని విష్ణు ఆలయములను పదునెనిమిది శ్రీధర్మశాస్తా వారి ఆలయములు అని చెప్పబడి ఉన్నది.


వాటిలో అతి ప్రఖ్యాతిగాంచినది  ఈ శబరిమలయని అందురు. శబరిమలపై సచ్చిదానందగురువై , చిన్ముద్రతో , పట్ట బంధాకారమున జ్ఞానపీఠము నధీష్ఠించియున్న తారక బ్రహ్మమును దర్శించి తరించి ముక్తి నొందదలచి ఏటేట లక్షల సంఖ్యలో భక్తులు ఇంకొకరి ప్రేరేపణయో ప్రోద్భలమో లేక , ప్రియమనస్సుతో ఈ యాత్రలో పాల్గొనుచున్నారు. యాత్ర గైకొనదలచిన వారుకొన్ని వ్రతానుష్ఠానములను ఆచరించవలసి యుండును.


తనను దర్శించదలచివారు ఎట్టి వ్రతమును అనుష్ఠించ వలెనని , శ్రీస్వామివారే స్వయాన పందళరాజు , రాజశేఖర పాండ్యునితో భూతనాధగీతమూలాన ఆదేశించి యున్నారు. *“నన్ను దర్శించుటకు నిశ్చయించిన భక్తుడు గురుముఖతా మంత్రో పదేశముపొంది , నాయొక్క ముద్రమాలను ధరించి , నైష్ఠిక బ్రహ్మచర్య వ్రతమును యొక మండలకాలము అనుష్ఠించవలెను. ఆ కాలములో , మధుమాంసాదులను విస్మరించి సత్యము , ధర్మము , అహింస యను సూత్రములను పాటించి , సదానన్నే ధ్యానిస్తూ సకల విధములైన సుఖదుఃఖాదులను నాయందు సమర్పించి , నాపేరున పిలువబడి అహంకార మమకార రహితులై నన్ను చూడకోరి శరణం శరణం అనుచూ ఇరుముడి మోసి , పదునెనిమిది తత్వములను బోధించు రీత్యా నా సన్నిది ముంగిట పరుండియున్న పదునెనిమిది దేవతామెట్లను అధిరోహించి , ఏడాది కో పర్వదినమైన మకరసంక్రాంతి దినము నన్ను శబరిగిరిపై యోగిగాను , కాంతమలపై జ్యోతిగాను దర్శించుకో కల్గినవాడు , సకల పాపముల నుండియు , జనన మరణబంధము నుండియు వేరు పడి జీవన్ముక్తుడగుతాడు"* యని శ్రీస్వామి వారే తన భక్తులకు భూతనాథ గీతలో ఆదేశించియున్నారు.


ఇంకే దేవాలయమునకు వెళ్ళుటకు ఇలాంటి కఠిన నియమ నిష్టలు విధించబడలేదే ? శబరిమల యాత్రకు మాత్రము ఇంతటి కఠోరదీక్ష ఆవశ్యమా ? యని అడిగినచో అవును అనియే సమాధానము లభించుచున్నది. శబరిమలయాత్ర యనునది మిగిలిన తీర్థయాత్రవలె తలచిన క్షణమే వెళ్ళివచ్చే సాధారణ దేవాలయ సందర్శనయాత్రకాదు. ఇది *'శబరి సంగమం'* అని వర్ణించబడియున్న ఉత్కృష్టమైన జీవనయాత్ర యగును. ఈ యాత్రగైకొనువారు కేవలం అయ్యప్ప దర్శనమునకు మాత్రము వెడలుటలేదు. జీవాత్మను పరమాత్మలో లయింపజేయుట యను దివ్యోద్దేశ్యముతోనే ఈ యాత్రను గైకొనుచున్నారనిన మిన్నకాదు. జీవితమన్నదే యొక ఎడతెగని సుదూర యాత్రయేగదా ? ఈ యాత్రలోని గమ్యము భగవంతునిలో లీనమగుటయే యనునది సత్పురుషుల అభిమతం. జనన మరణమను కాలచక్రములో పడి , చేసెడి పాపపుణ్యముల లెక్కాచార ప్రకారము మరలా మరలా జన్మించి బాధపడే సర్వసాధారణమైన జీవులకు గూడ ఈ జన్మయే చివరి జన్మయను ఆత్మ ప్రబోధ కలిగేలా మన వ్రతదీక్షయుండవలెను.


జీవాత్మ పరమాత్మలో లయించుటకు సూక్ష్మమార్గమే మైనా చెప్పబడియున్నదాయని అన్వేషించువారికి , మన పెద్దలు చూపించియున్న బాట. భక్తిమార్గము యొక్క అంతర్గత (ఆధ్యాత్మిక) విధివిధానములయొక్క ప్రతిపాదనే శబరిమల యాత్రయని గూడ అందురు. రాజయోగులు తమ యోగసాధనమూలాన మాత్రమే పొందగల సాయుజ్య పదమును సామాన్య పామరుడు గూడ పొందుటకు దోహదము చేస్తూంది ఈ శబరిమల యాత్ర యనుటలో భేదాభిప్రాయమే లేదని చెప్పవచ్చును.


ఈ సత్యమును శబరిమలయాత్ర చేయుటకు సంకల్పించిన ప్రతివారు తెలుసుకొని యాత్ర గావించినచో , అనుష్ఠించ వలసిన వ్రతము యొక్క ప్రాధాన్యత చక్కగా గోచరించును. ఈ మూలమెరింగి యాత్రగైకొనువాడు ఎంతవరకు ఇహమాయను అర్థం చేసుకొని , అందుండి తనను వేరుపరచు కొనుటకు తపన పడుచున్నాడో , ఎంతవరకు , నేను , నాయొక్క అను అహంకార మమకారములను వీడనాడుటలో గెలుపొందు తున్నాడను లెక్కాచారమునకు తగినట్లు శబరిమలయాత్రయొక్క ఫలితములు గూడ లభించును. క్రమబద్ధముగా శబరిమల యాత్ర వెడలివచ్చిన వారి జీవితాన మంగళ ప్రదాయకుడైన మణికంఠ స్వామివారు సలిపియున్న అద్భుత , లీలావినోదములే. వీరు కలిలో ప్రత్యక్షదైవం అనునందులకు తార్కారణము. *🌹శబరిమలకు ఆతని అనుగ్రహము కోరి యాత్రచేసి మరలిన ప్రతివారు తమ ఇంట్లో శ్రీస్వామివారి చిత్రపటమును యుంచి ప్రతినిత్యము శ్రీస్వామి వారిని పూజించ వచ్చును.🌹* ఈయాత్రకు దీక్షగైకొనిన వారికి మాత్రమే మండలకాల నియమనిష్ఠలు ఏర్పరచియున్నారు. కావుననే మండలకాల దీక్షను ఋతుచక్రం తీరని స్త్రీలు ఈ దీక్ష గైకొననవసరములేదు. ఇంట్లోనే మణికంఠస్వామిగా , కొలువుంచి , పూజించిన చాలును అన్నారే తప్ప , స్త్రీలు , అయ్యప్పను పూజించరాదు. వారు ఈయాత్రకు అనర్హులని త్రోసిపుచ్చరాదు. మనతో బాటే మనలాగే దీక్షపూని మాల ధరించకనే వ్రత మాచరించు స్త్రీలను , ఈపూజా భజనలలో పాలు పంచుకొనరాదని ఎక్కడ చెప్పబడలేదు. 10 ఏండ్లలోని పసి బాలికలు , ఋతుచక్రం తీరిన , యవ్వన దశలు దాటిన స్త్రీలు శబరిగిరియాత్ర చేయుచున్నారుగదా ! కావున స్త్రీలు శబరిదీక్షకో , స్వామిపూజకో అనర్హురాలు కాదను విషయము గుర్తుంచుకొని , వారు చేయగల స్వామిసేవను వారిచేతనే చేయిస్తూ వార్లను గూడ మనం చేయుతపములో భాగస్వాములు గావించు కొన వలెను.


వారి వారి స్వగృహములలో యుంచి ప్రతినిత్యం పూజించే శ్రీస్వామి అయ్యప్పకు మిగిలిన దేవతలకన్న ఎక్కువ ప్రాధాన్యతయో , విశేషప్రార్ధనలో, పూజాధికాలో సలుప నవసరములేదు. ఆకలి వేస్తే భుజించినట్లు , మానము కాపాడుటకు దుస్తులు ధరించినట్లు జీవనోపాధికై కృషిచేయునట్లు , ముక్తి నొందుటకొరకై జీవుడు తరించుటకొరకై ఏటేట ఎలాంటి ఆటంకములేక శబరిమలయాత్ర గైకొనే వరము పొందుటకు, సద్గతి బడయుటకు సర్వేశ్వరుడైన సత్యశబరినాథుని శరణము ప్రాప్తించి , మనసా , వాచా , కర్మణా శ్రీస్వామివారిని అనుదినం ప్రార్థించి తరిద్దాం.


*భగవంతుని పుణ్యచరిత్రములను చదివే వేళ భక్తులు ఒక ముఖ్యాంశమును గుర్తించుకొన వలెను. సర్వేశ్వరుడు సర్వవ్యాపి. దేశకాల వర్తమానాతీతుడు. కాలప్రవాహమునకు కట్టుబడనివాడు. కట్టుబడనవసరం లేనివాడు. ఏలనగా అతడే కర్త , అతడే కర్మ , అతడే క్రియ , అతడే సృష్టికర్త , అతడే పోషకుడు , అతడే హరించువాడు కావున అట్టి అద్భుత శక్తిని పరీక్షిస్తూ కాలము వృధా చేయక పెద్దలు ఏర్పరచి ఇచ్చి యన్న వ్రతానుష్టానములను తు.చ. తప్పక ఆచరించి శబరియాత్ర చేసి , ఇందులోని స్థూల , సూక్ష్మ పరమార్ధములను గ్రహించుకొని తమ జీవితమును సుఖశాంతి మయం చేసుకొనుటకు ప్రతి ఒక్కరు కృషి చేయవలెను. స్వామి శరణం. శరణాగత వత్సలుడే... శరణమయ్యప్ప.*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat