అయ్యప్ప సర్వస్వం - 38

P Madhav Kumar


*శరణము పలికే విధానము - 2*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*5. ధీ... ర్ఘ శరణము*


శబరిగిరి యాత్రలో ఈ దీర్ఘ శరణమునకు ఒక ప్రత్యేకమైన స్థానము గలదు. పూజలోను , భజనలోను మరియు ఇతర దేవాలయమునకు వెడలినపుడు , వనయాత్ర సమయము నందును , సన్నిధానము సమీపించు వేళయందును , తమ నేత్రములచే స్వామివారి కమనీయ రూపమును దర్శించకముందే స్వరముతో స్వామిపాదాలను సమీపించ వలయునను ఉద్రేకముతో శ్వాసను లోనికి పీల్చి ఉద్రిక్తస్థాయిలో వదలక వీలైనంత సేపు స్వామి శరణములను లాగి పిలిచేదే దీర్ఘ శరణమని అందురు. పట్టువదలక సుమారు ఒక నిమిషకాలము నుండి రెండు నిమిషముల వరకుగూడా పలుఅనుభవజ్ఞులైన గురుస్వాములు దీర్ఘముగా ఈ శరణములను పలికెదరు , శరణఘోష ప్రియుడైన శ్రీ అయ్యప్ప స్వామివారు ఈ శరణములను విని ఆనందించెదరని వారి విశ్వాసము.


ఉదా || స్వామియే..........................య్ శరణమయ్యప్పో


హరిహరసుతుడే........................య్ శరణమయ్యప్పో


శబరిగిరీశుడే........................య్ శరణమయ్యప్పో


మోహినీ సుతుడే.....................య్ శరణమయ్యప్పో


మోహన రూపుడే.........................య్ శరణమయ్యప్పో


కర్పూర పరిమళ ప్రియుడే........................య్ శరణమయ్యప్పో


*6. దీనార్థీ శరణము*


తమ బాధలన్నిటిని ఒక్కసారిగా స్వామివారికి వెల్లడింపజేసి , స్వామి వారి అనుగ్రహమును పొంది తీరుటయను తపనలో భక్తుడు పిలిచే శరణములనే దీనార్థి శరణములందురు. అన్యులవద్ద చెప్పలేని అంతరంగిక విషయములు , మరియు సహధర్మిణితో గూడా పంచుకోలేని ఎన్నోజీవిత రహస్యములను మరియు ఎన్నెన్నో మనో వ్యాకూలతను భగవంతుని వద్ద మొరలిడ వచ్చుగదా ! అలాంటి వారు రాత కందని రీత్యా పదజాలములో పొందుటకు వీలుగాని భావనలో , దీనార్థులై శ్రీ స్వామి వారి శరణములను పలికెదరు. వారి ప్రార్ధనను మన్నించి శ్రీ స్వామివారు ఈ క్షణమే ప్రత్యక్షమవ్వరా  యని అనిపించురీత్యా పిలిచే శరణాన్ని దీనార్థి శరణమని అందురు. 


ఉదా|| స్వామియే ... శరణమయ్యప్పా !


అనాధరక్షకుడే ... శరణమయ్యప్పా ! 


ఆపద్భాందవుడే ... శరణమయ్యప్పా ! 


శరణమయ్యప్ప ... స్వామి శరణం ! అని తమ మనసులోని బాధలన్నిటిని శరణములుగా జేసి స్వామి వారి పాదాక్రాంతమున సమర్పించుకొందురు.


*7. అవ్యవధిత శరణము*


మనసున ఒక కోరికతోను లేక సత్ సంకల్పముతోను లేక రోగ విముక్తి కోరియో లేక శబరిగిరి యాత్ర నిర్విఘ్నముగా కొనసాగవలెనని తలచి నిర్థిక్తమైన స్థలములో భక్తులు గుమిగూడి కొన్ని గంటలలో , కొన్ని దినములలో వ్యవధి లేక భయభక్తితో పిలిచే శరణాలను అవ్యవధి శరణము అందురు. దీనిని తానొక్కడి కోర్కెను తీర్చుకొనుటకు మాత్రము ఉద్దేశించి చేయక అనేక బృందముల వార్లను జతకలుపుకొని కూటమికూడి , లోకక్షేమమే ధ్యేయముగా సంకల్పించి పిలిచెడి శరణములను అవ్యవధిత శరణము అని అందురు.


ఉదా|| హరేరామ హరేకృష్ణ నామజప యజ్ఞము , విఠలనామము , రామనామ జప సంకీర్తనము మున్నగునవి. ఇది వరకే కూటమిగా గూడి పిలిచే శరణాల ఫలితముగూర్చి సమిష్టి శరణములో తెలియజేయడమైనది. అలాకూటమి ప్రార్థన అవ్యవధితముగాను యుండినచో భగవంతుడు సంతుష్ట చిత్తుడై తమ భక్తులను అనుగ్రహిస్తాడని ప్రత్యేకించి చెప్పనవసరము లేదు. ఇలా అచ్చటచ్చట స్వామి భక్తులు ఒకటిగా చేరి కొన్నిదినములు, మండలకాలము (41) దినములుగూడ రేయి , పగలు వదలక పారాయణముచేసి స్వామి అయ్యప్ప అనుగ్రహము పొందెదరు. ఇందులకు అందరు ఆహ్వానితులే ఇందులో సర్వులు భాగస్వాములే.


*8. మౌన శరణము*


దీనిని ధ్యాన శరణమని గూడా చెప్పుకొనవచ్చును. శబ్దము కంఠముదాటక , పెదవిగూడా కదల్చక , నిర్మలుడై , నిశ్చలుడై అమరి స్వామివారి శరణనామములను మననము చేయుటయే మౌనశరణము. ఇందువలన అంతః కరణశుద్ధియు , ఆత్మ స్థైర్యము కలుగును. శాంత చిత్తముతో సర్వకాల సర్వావస్థల యందు మానసికముగా ఈ శరణ నామజపములను ఉచ్చరించుచునే యుండవచ్చును. *'కలౌ నామ జప సంకీర్తనాత్ ముక్తి ,'* అన్నారు పెద్దలు. కనుక స్వామి నామముజపించి ముక్తిమార్గమునన్వేషించుటకు చక్కని ఉపకారి ఈ మౌన శరణము.


*9. క్షమాపణ శరణము*


ఎన్ని విధములుగా శరణాలుపలికినను చివరగా ఈ క్షమాపణ శరణము పలికి ముగించుటయే సాంప్రదాయము,


ఉదా || తెలిసి తెలియక జ్ఞాన , అజ్ఞానముతో మేము చేయు సకల విధములైన తప్పు ఒప్పులను మన్నించి కాపాడ వలెను. హరిహర సుతన్ ఆనందచిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే. శరణమయ్యప్పా


పై విధముగా శబరిమలశాస్తాను అనేక విధములైన శరణనామములతో పిలిచి , భక్తి చూపించి శబరిమల యాత్ర గావించెదరు.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat