*శరణుకోటి మహాయజ్ఞము అనగా నేమి...?*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
నేడు రాష్ట్రములలో గురుస్వాముల సంఖ్య గణనీయంగా పెరిగియున్నది. గత కొన్ని సంవత్సరాలుగానే 18వ వత్సరం శబరియాత్ర చేసుకొచ్చిన గురుస్వాములనేకులు గలరు. ఈ ఏడాది గూడ 18వ సంవత్సరం పదునెట్టాంపడి తొక్కబోయే స్వాములనేకులు యున్నారు. వారి ప్రశ్నయెల్ల 18వ వత్సరం యాత్రవెళ్ళేవారు విశేషపూజలేమైనా నిర్వహించాలా ? కొబ్బరిచెట్టు నాటే విధానం ఏమిటి మాకు మీరు గురు ఉపదేశం ఇస్తారా ? ఏదోలాగ కష్టపడి ఏటేట శబరిమల యాత్ర చేసేస్తున్నాం ఈ వత్సరం పదునెట్టాంపడి శ్రీ స్వామివారికి ఎలా పూజ జరిపించాలో తెలియని తపన మాత్రమే వారిలో గోచరిస్తుంది.
కాని వారందరూ ఈ పదునెనిమిదివత్సరాలుగా యెడతెగక పాటించవలసిన , పూర్తిచేసి యుండవలసిన పునాది సూత్రాన్ని పాటిస్తున్నారా యను ప్రశ్నకు మాత్రం వారివద్ద నుండి మౌనమే సమాధానంగా లభిస్తున్నది. అదేమిటి వునాది సూత్రమని అడుగుతున్నారా ? శబరిమలయాత్రకు స్వామి శరణనామములే మార్గదర్శి మార్గానుచారి మార్గబంధువు కావున స్వామి మాలధరించిన ప్రతివారు క్షణకాలం గూడ వృథాచేయక శ్రీ స్వామిరణాలు పలుకుతూ , వ్రాస్తూ అనుక్షణం ఆస్వామివారి తలంపుతోనే గడపాలను విధియున్నది. అలా ప్రతి ఏటపలుకబడు - వ్రాయబడు శరణుఘోష 18వ వత్సరాన కోట్లసంఖ్యలు దాటి , శ్రీస్వామి వారికి మహదానందాన్ని కలిగించి , భక్తులకు ముముక్షుత్వాన్ని ప్రసాదిస్తుంది. అదియే *"శరణుకోటి మహా యజ్ఞము"* అదియే భక్తులు పాటించవలసిన పునాది సూత్రము. (ఈ సూత్రమెరుంగక ఇదివరకే 18వత్సరాల శబరియాత్రను పూర్తిచేసుకొన్న రాష్ట్రవ్యాపిత పూజ్య గురుస్వాములు ఈ పునాది సూత్రమును ఇకనైనా గమనింతురుగాక) *ఇవన్నియు కన్నిస్వామిగా ప్రప్రథమముగా మాలధరించు కొన్నప్పుడే గురుముఖతా తెలుసుకొని ఆచరణయోగ్యము గావించుకొని యుంటే 18 సంవత్సరముల శరణుకోటి మహాయజ్ఞము చేసినఫలితంగా మనస్సు సంశయము లన్నిటిని చేధించి , జ్ఞానమార్గమున మనిషిని పయనింపజేసి , ముముక్షుత్వానికి అర్హులుగావించియుండును. ముముక్షుత్వమంటే ఏమిటో అర్థంకావడంలేదంటున్నారా ? బాధపడకండి "శీత ఉష్ణ సుఖదుఃఖా లాభా లాబౌ జయాజమౌ" అని ముముక్షువులను వర్ణించియున్నారు. సీతోష్ణాదులను సుఖదుఃఖాదులను , లాభనష్టాలను , జయాపజయాలను సమముగా భావించిమెసలు కొనువాడే ముముక్షువు. "తుల్య నిందాస్తు తీర్మాని" అన్నట్లు పొగడినా నిందించినా పొంగిపోవడమో , ఆగ్రహించడమో తెలియనివాడే ముముక్షువు “వేడుకలోనూ వేదనలోను ఏకరీతి నీదిగీతియని" కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుని నామామృతములను గ్రోలుచుండువాడే ముముక్షువు.*
మొత్తంమీద అన్నిటిలోనూ తానున్నా తనలో దేన్ని అంటించు కోని ఉత్తమస్థితియే ముముక్షుత్వము యొక్క పరిపూర్ణత్వమని పెద్దలంటారు. అంతటి ఉత్తమ స్థానాన్ని పొందడానికి భగవన్నామ సంకీర్తన యొక్కటే చక్కని రాజబాటయని సమస్త గ్రంథములు తెలియజెప్పుచున్నవి. అంతటి మహిమాన్వితమును ప్రసాదించగల శరణుకోటి యజ్ఞాన్ని వర్ణ , వర్గ , వయోబేధము లేక లఘువుగా అందరూ పాటించి ముముక్షువులు కావచ్చును.
ఏదో దీక్షాకాలంలో రెండు పూటలా శరణుఘోష చెప్పవలయునన్న విదియున్నదనియో లేక గురువుగారు చెప్పియున్నారనియో , కుదురుగా పదినిమిషాల పాటు దైవసన్నిధిలో కూర్చొనక , ఒకవేళ అలాకూర్చున్నా మనస్సంతా పరిపరివిధాల ఆలోచనా నిలయమై , వ్యాపార వ్యవహారాలచుట్టూ తిరుగులాడిస్తూ సంవత్సరాలను మాత్రం లెక్కించిచూ 18 వత్సరాలయిపోయింది అంటే ముముక్షుత్వం లభించునా ? గతంగతః కాలం దీర్ఘమైనది. విధి వింతయైనది. ఎవరికి ఎన్నేళ్లువ్రాసి పెట్టి యున్నాడో ఆ భగవానునికే ఎరుక అయ్యో ఇది ముందే తెలియకపోయెనా ఎన్నిదినంబులు వ్యర్థంబాయెను అని చింతిస్తూ మిగిలియున్న కాలాన్ని గూడ వృథాచేసుకొనక ఇపుడే , ఈ క్షణము నుండియే లోక క్షేమార్థం అయ్యప్ప విజయం వారు మొదలిడిన శరణుకోటి మహాయజ్ఞంలో భాగస్వాములై శరణుకోటివ్రాసి , ముముక్షుత్వము పొంది తీరుతానను పట్టుదలతో *'ఓం స్వామియే శరణం అయ్యప్ప"* అంటూ వ్రాయడం మొదలుపెట్టిండి. పట్టుగా కృషి చేసేవారిని ఆపరమాత్ముడు పట్టిగా చూడడంటారు. కావున మీ శరణుకోటి మహాయజ్ఞం సఫలీకృతమై త్వరలోనే అందరికి ముముక్షుత్వం లభిస్తుంది.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏