*🌻1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము🌻*
*🌻సర్వదర్శనము🌻*
🍃🌹అనాలోచిత విశేషాశేషలో కశరణ్యుడగు శ్రీ స్వామివారు సర్వదర్శనము అను పేరుతో విశేష విచారములేకనే సర్వమానవులకు క్రమముగా (క్యూలో) తమ దర్శనమును ఇచ్చుచూ తీర్థమును, శఠారిని, ప్రసాదములను ఇప్పించుచూ వారి కష్టసుఖములను ప్రార్థనలను తెలుసుకొనుచూ తెలియనివానివలె నటించుచూ వేంచేసియుందురు. ఇదియే సర్వదర్శనము.
*🌻శుద్ధి🌻*
🍃🌹శ్రీస్వామివారికి మాధ్యాహ్నిక కాలారాధన సమయముకాగానే సర్వదర్శనము ఆపివేయబడి శుద్ధి జరుగును.
*🌻మాధ్యాహ్నికారాధనము🌻*
🍃🌹అర్చక స్వాములు విధ్యుక్తకర్మానుష్ఠానము పూర్తి యొనరించుకుని శ్రీస్వామివారికి మాధ్యాహ్నికారాధన కైంకర్యమును చేయుటకై శ్రీవారి సన్నిధానమునకు వచ్చి చేరెదరు.
🍃🌹అర్చకుడు శ్రీవారి సన్నిధానములో కూర్మాసనము మీద కూర్చుని ఘంటానాదము చేయుచూ మాధ్యాహ్నికారాధనమునకు సంకల్పము చేసి ఆరాధనము ప్రారంభించును. శ్రీవారికి మాధ్యాహ్నికారాధనోపయుక్తములగు ఉపచారములు సమర్పించును. ఇతర మూర్తులకు, ఇతర దేవతలకు అట్లే ఉపచారములు సమర్పించును.
*🌻అష్టోత్తర శతనామార్చనము🌻*
🍃🌹అర్చకుడు శ్రీస్వామివారికి అష్టోత్తర శతనామార్చనమును సంకల్పించి " ఓం వేంకటేశాయ నమః " అని వరాహ పురాణాన్తర్గతములగు శ్రీ వేంకటేశ్వరాష్టోత్తర శతనామములను ప్రారంభించగానే, మిరాశీదారగు విద్యారి ఆ నామమును అనువదించుచు, అతి మధురముగా “ ఓమ్ శ్రీ శేషాద్రినిలయాయ శ్రీ వేంకటేశాయ నమః " అని నూట యెనిమిది నామములను శ్రోతల జన్మపావనమగునట్లు పఠించు చుండును.
🍃🌹అర్చకుడు ప్రతినామాన్తమునందును తులసీ పుష్పములను శ్రీవారి పాదములయందు పరమభక్తితో సమర్పించుచుండును. ఇలాగ శ్రీవారికి అష్టోత్తర శతనామార్చనము పూర్తి అయిన వెంటనే అర్చకుడు శ్రీవారి పాదములయందు పూజించిన తులసీ పుష్పములను తీసుకుని శ్రీవారి నిత్యాన పాయినులగు శ్రీ భూదేవులను పూజింప “ ఓమ్ శ్రీం శ్రియైన మః " అని శ్రీ లక్ష్మీనామమును ప్రారంభించగానే మిరాశివారు అతిమధురముగా వరాహపురాణాంతర్గతములగు లక్ష్మీనామములను పఠించుచుండును.
🍃🌹అర్చకుడు జగన్మాతలగు శ్రీ భూదేవుల యొక్క పాదములయందు 'తులసీ పుష్పముల నర్పించుచుండును. నామార్చనము పూర్తి అయినతోడనే నక్షత్ర హారతి అయి కర్పూరహారతి జరుగును. జియ్యంగారికి నామపాఠకునకు శఠారి జరుగును.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*