శ్రీ వేంకటేశ్వర వైభవం - 4 🌻ప్రాతర్నివేదనము (మొదటిఘంట)🌻

P Madhav Kumar


*🌻1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము🌻*

*🌻ప్రాతర్నివేదనము (మొదటిఘంట)🌻*


🍃🌹శ్రీవారి పరిచారకుడు సువర్ణద్వారమునందు నిలువంబడి పచ నాలయమందు పాకకైంకర్యపరతంత్రులైయున్న పాచకుల యొక్క శ్రవణ కుహరములయందు ప్రవేశించునటుల “ శ్రీవారికి ప్రసాదములు శ్రీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము సిద్ధము కావలెను” అను విచిత్ర శబ్దనాదము చేయును. వెంటనే కైంకర్యపరులు పాకశాల నుంచి శ్రీవారికి మామూలుగా నిత్యము జరుగుచున్న మాత్రా ప్రసాదము, ఇతర ప్రసాదములను, విశేష ప్రసాదములను, ప్రార్థనా ప్రసాదములను వహించి తెచ్చి శ్రీవారి దృష్టి ప్రసార స్థానమునందు ఉంచి ప్రతి కైంకర్యవరుడున్నూ “ధన్యోస్మి” అని “ ఆనందపడుచూ శ్రీవారిని దర్శించి వెళ్ళుదురు. 


🍃🌹పిమ్మట అర్చకస్వాములు ఆలయములో ప్రవేశించి తృతీయ ద్వారము తలుపులు వేయుదురు. భక్తాగ్రేసరుడగు పరిచారకుడు ఆస్థానమండపములో సువర్ణ ద్వారమునకు దక్షిణ భాగమునయున్న రెండుమహామంటల యొక్క మధ్యభాగమున కూర్చుని రెండు మంటలయొక్క అంతర్భాగమునగల ఆయసదండముల రెండు చేతులంబూని గర్భాలయమందు శ్రీస్వామివారు ఇతర మూర్తులు ఆరగించువరకు ప్రణవధ్వని పరంపరలు బయలుదేర మ్రోగించుచుండును.


🍃🌹ఇదియే ఘంటాకాలము శ్రీస్వామివారి సన్నిధానమునగల అర్చకుడు శ్రీవారికి ప్రతిపదార్థమును వివరముగా మంత్రపూర్వకముగా నివేదించి భోజ్యాసనోచితములగు ఉపచారములను సమర్పించును. ఏలాలవంగ తక్కోల జాజీ కర్పూర క్రముకాది చూర్ణమిశ్రితమగు ముఖవాసమును (తాంబూలము) సమర్పించును. కర్పూరహారతి జరుగును. 


🍃🌹పిమ్మట అర్చకుడు శ్రీవారికి నివేదితములైన ప్రసాదములలో శ్రీవారి ఆజ్ఞ ప్రకారము తనభాగలబ్ధమైన ప్రసాదమును తీసుకొని వేరొక పాత్రయందుంచుకొనును. అర్చకస్వాములు ఘంటాకాలమునందు బంధింపబడిన ద్వారము తలుపులు తెరచెదరు. మహా ఘంటా ప్రణవధ్వానము శమించును, పాచక కైంకర్యపరులు ఆలయములో ప్రవేశించి శ్రీవారికి నివేదింపబడిన ప్రసాదములను నిర్ణీత స్థానములకు చేర్చిదరు.


*🌻హోమము🌻*


🍃🌹అనంతరము యాగశాలయందు హోమము జరుగును.


*🌻బలి🌻*


🍃🌹పిమ్మట ఆలయదేవతలు, ద్వారదేవతలు, ద్వారపాలకులు, లోక పాలకులు, విమానపాలకులు, అనపాయినులు మొదలగు దేవతలలో నిత్యతృప్తులగు పూజాకాంక్షులకు పూజలు జరిగినవి కాన బలికాంక్షకులకు దేవాలయమునకు చుట్టుగల వారివారి బలిపీఠములయందు బలిని సమం త్రకముగా ఉపచారములతో నిచ్చి బలిపీఠమునందును బలిశేషమును దివానక్తంచరులగు భూతయక్షపిశాచాదులకు ధ్వజదండపృష్ఠభాగమున ప్రకాశించుచున్న సువర్ణ బలిపీఠ పార్శ్వమునందు సమంత్రకముగా నిచ్చెదరు. 


🍃🌹పిమ్మట శ్రీవారి సన్నిధానమునకు వెళ్ళెదరు. ఈ సమయమున అర్చకులు ఇతర దేవతలకు ఆరాధనమును నివేదనమును చేయుదురు. శ్రీ భాష్యకారుల వారికి ఆరాధనమును శ్రీవారికి నివేదితమైన ప్రసాద మును నివేదనచేయుదురు.


*🌻శాత్తుమొఱ🌻*


🍃🌹పిమ్మట శ్రీవారి సన్నిధానమునకు జియ్యంగార్లు, ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీవైష్ణవస్వాములు వచ్చి శ్రీ ఆండాళ సాయించిన తిరుప్పావు ముప్పది పాశురముల దివ్య ప్రబంధములో శేషించిన రెండు పాశురములు ఈ శాత్తుమొరలో అనుసంధానముచేసి మంగళాశాసనము చేసెదరు. కర్పూరహారతి జరుగును. పిమ్మట గోష్ఠికి తీర్థము, శఠారి, చందనము, ప్రసాదము వినియోగము జరుగును. శ్రీవారిని సేవించుకుని వైష్ణనస్వాములు స్వరూపానుగుణముగా వెలుపలకు వచ్చెదరు.


🍃🌹ఇది శ్రీవారి ప్రాతఃకాలారాధనము.



     *🙏ఓం నమో వేంకటేశాయ🙏*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat