*బుధగ్రహ చరిత్ర - 1*
*"అనసూయా ! బుధుడు పెద్దవాడయ్యాడు. విద్య నేర్చుకుని , బుద్ధిమంతుడయ్యాడు. ఇక మన రక్షణా , పోషణా వాడికి అవసరం లేదు. స్వయం సాధనతో అభివృద్ధి చెందాల్సిన వయసులో అడుగుపెట్టాడు."* అత్రి మహర్షి చెప్పుకుపోతున్నాడు.
*"అంటే , బుధుణ్ణి పంపించి వేస్తారా , స్వామీ ?"* అనసూయ తన ప్రశ్నతో ఆయన వాక్ ప్రవాహాన్ని నిలువరించింది.
*"తప్పదు కదా !"* అత్రి చిరునవ్వుతో అన్నాడు.
అనసూయ ముఖాన్ని విచారం ఆవరించింది. *"బుధుణ్ణి కొడుకు కన్నా ఎక్కువ మక్కువగా చూసుకొన్నాను. వాణ్ణి వదిలి ఉండాలంటే...”*
*"నువ్వు బాధపడకూడదు ! త్రిమూర్తులనే పుత్రులుగా పొందగలిగిన భాగ్యాన్ని చూరగొన్న అదృష్టవంతురాలివి ! ఇంకా విష్ణువూ , పరమశివుడు నీ గర్భాంబుధిలో ఊయలలూగి జన్మించాలి. కదా ! దగ్గరై దూరం కావడం , దూరమయ్యాక దగ్గరవడం ప్రాణులకు సహజం కదా , దేవీ ! బుధుణ్ణి దీవించి , చంద్రుడి వద్దకు పంపించు!”*
*“అలాగే...”*
*“ఔనా , తాతగారూ ! నన్ను పంపించివేస్తున్నారా ?"* బుధుడు అత్రిమహర్షి సమీపాన కూర్చుంటూ అడిగాడు. *"నా పితామహికి మీరు చెప్పారట కదా !"*
*"ఔను , నాయనా ! ఇంతకాలం నువ్వు మా అదుపాజ్ఞలలో , సంరక్షణలో పెరిగావు. ఇప్పుడిక స్వతంత్రంగా , స్వచ్ఛందంగా , స్వీయ రక్షణలో , స్వీయ పోషణలో జీవిస్తూ , స్వీయ సాధనలో చరితార్థుడవు కావాలి. ఒక వయసు వచ్చేదాకా నువ్వు అస్వతంత్రుడివి. ఇప్పుడు స్వతంత్రుడివి ! సహాయం పొందే వయసును అధిగమించావు. సహాయం అందించే వయసును అందుకున్నావు ! నీ తండ్రి చంద్రుడి వద్దకు వెళ్ళు. అతని అనుమతితో , నీ సాధన సాగించు !"*
*"మీ ఆజ్ఞ !"* బుధుడు వినయంగా అన్నాడు.
*"ఆజ్ఞ కాదు , నాయనా ! ఆశ ఆశయం ! నువ్వు మాకు గౌరవం తెచ్చే ఆదర్శ యువకుడివి కావాలి. తగిన వధువును చేపట్టాలి. వంశాన్ని వృద్ధి చేయాలి. ఈ ఆత్రేయ గోత్రాన్ని చంద్రవంశంగా విస్తరింపచేసే బాధ్యత నీదే !"* అత్రి ఆగి , మనుమడి ముఖంలోకి చూశాడు.
బుధుడు ఉత్సాహం ప్రతిఫలించే కళ్ళతో , వినయంగా చూస్తున్నాడు.
అత్రి బుధుడి కళ్ళలోకి తదేకంగా చూశాడు. *"బుధా , యువకుడివయ్యావు ! ఎప్పటికైనా నీకు తెలియాల్సిందే ! నీ తండ్రి చంద్రుడు స్త్రీలౌల్యంతో కష్టాలు కొని తెచ్చుకున్నాడు. స్త్రీ విషయంలో చంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకోవద్దు. నచ్చిన కన్యను స్వీకరించు. సుఖపడు ; ఆమెను సుఖపెట్టు !"*
*"అలాగే , పితామహా !"*
*"రేపే నీ ప్రయాణం , నాయనా ! చంద్రమందిరానికి వెళ్ళు. నీ తండ్రి అనుమతితో , నీ శాశ్వత గమ్యాన్ని నిర్ణయించుకో !"* అత్రి బుధుడి తల నిమురుతూ అన్నాడు.
పాదాలకు నమస్కరించి , లేచి నిలుచున్న బుధుణ్ణి చంద్రుడు వాత్సల్యంతో కౌగిలించుకున్నాడు.
*"ఎంతకాలమైంది , నిన్ను చూసి !"* అంటూ పుత్రుణ్ణి కొంచెం ఎడంగా జరిపి , తదేకంగా చూశాడు. తొలియవ్వనంలో తనని చూస్తున్న అనుభూతి కలుగుతోందతనికి. అందాన్ని తన నుండి పుణికి పుచ్చుకున్నాడు బుధుడు. ఇప్పుడు బుధుణ్ణి చూస్తే , అతని తండ్రి తనే అని బృహస్పతి నిస్సంకోచంగా ఒప్పుకుంటాడు. అందగాడైన బుధుణ్ణి చూస్తుంటే , చంద్రుడి రక్తంలో ఏదో అనురాగం కలిసిన అహంకారం ప్రవహిస్తున్నట్టనిపించింది.
*"అశ్వినీ ! భరణీ ! కృత్తికా ! రోహిణీ ! ఎక్కడున్నారు ? అందరూ రండి. నా పుత్రుడు వచ్చాడు. వచ్చి , చూడండి."* చంద్రుడు ఉద్రేకంతో బిగ్గరగా అరిచాడు.
చంద్రపత్నులందరూ ఒకరిని తరుమకుంటూ ఒకరు వస్తున్నట్టు వచ్చారు.. *"బుధుడు ! అందాల చంద్ర తనయుడు. చూడండి !"* అన్నాడు తన పత్నీ బృందంతో చంద్రుడు.
అందరూ చంద్రుడికి ఇరువైపులా నిలుచుని , బుధుణ్ణి చూస్తూ , కన్నుల పండుగ చేసుకుంటున్నారు.
బుధుడు తనకు మాతృస్థానంలో ఉన్న ఇరవై యేడుగురినీ వినయంగా చూశాడు. *"మాతృమూర్తుల పాదారవిందాలకు బుధుడు నమస్కరిస్తున్నాడు. ఆశీర్వదించండి."* , అంటూ బుధుడు సాష్టాంగ ప్రణామం చేశాడు , అందర్నీ ఉద్దేశించి.
*"సుఖీభవ !"* అశ్విని ముందుగా దీవించింది.
*"సుఖీభవ ! సుఖీభవ !"* అశ్విని చెల్లెళ్ళు అందరూ బృందగానం చేస్తున్నట్టు అన్నారు.
*“ఇంత అందగాడైన పుత్రుడు ఉండడం మా అదృష్టం."* అశ్విని బుధుణ్ణి చిరు నవ్వుతో చూస్తూ అంది.
*"మీ అదృష్టం కన్నా , నా అదృష్టం ఎన్ని రెట్లు అధికమో తెలుసా అమ్మా ! ఇరవై యేడు రెట్లు !"* బుధుడు అందర్నీ కలయజూస్తూ అన్నాడు.
బుధుడి మాటల్లోని అర్ధధ్వనిని గ్రహించిన చంద్రుపత్నులు ఆనందంగా నవ్వారు. చంద్రుడు గొంతు కలిపాడు.
*"స్వామీ... మన బుధుడు ఇంక మనతోనే ఉండిపోవాలి , ఎప్పటికీ !"* రోహిణి ఉత్సాహంగా అంది.
*"నా పుత్రుడు ఉండి - పోవడానికి కాదు , రోహిణీ... ఉండటానికే వచ్చాడు !"* చంద్రుడు. నవ్వుతూ అన్నాడు. *"అంతే కదా , బుధా ?".*
*"మీ అనుమతి తీసుకుని , స్వయం సాధన ప్రారంభించమని ఆదేశించారు. నా పితామహులు !"* బుధుడు చిరునవ్వుతో అన్నాడు.
*"స్వయం సాధనా?!"* అశ్విని అర్ధం కానట్టు అంది.
చంద్రుడు ఆమె వైపు చూశాడు. *"ఔను ! యుక్త వయసు వచ్చాక , స్వాతంత్య్రంతో బాటు స్వయంపోషణావిధి వొడిలో వాలుతుంది. అప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా పుత్రుడు స్వయంగా సాధన సాగించాలి. సాధించాలి !".*
*"అయితే , మన పుత్రుణ్ణి పంపివేస్తారా ?”* దక్షపుత్రికలు ఏకకంఠంతో ప్రశ్నించారు. ఆ ప్రశ్నలో నిరాశ.
*"అమ్మలు అందించే ఆతిథ్యం స్వీకరిస్తూ బుధుడు కొన్నాళ్లు ఇక్కడే ఉంటాడు ! అనంతరం అరణ్యానికి వెళ్ళక తప్పదు ! అక్కడ ఇప్పటికే సృష్టికర్త ఆజ్ఞప్రకారం మన బుధుడి కోసం విడిది సిద్ధమై ఉంది !"* చంద్రుడు నవ్వుతూ అన్నాడు.
కొన్ని రోజుల పాటు దక్షపుత్రికల వాత్సల్యాన్నీ , అభిమానాన్నీ అనుభవించిన బుధుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు.
*“జాగ్రత్త సుమా ! పితామహుల ఆదేశాలను ఆచరణలో పెట్టు. ప్రతీ పౌర్ణిమకూ ఇక్కడికి వస్తూ ఉండు."* చంద్రుడు బుధుడితో అన్నాడు.