నవగ్రహ పురాణం - 75 వ అధ్యాయం

P Madhav Kumar


*బుధగ్రహ చరిత్ర - 2*



బుధుడు తన తండ్రి ముఖంలోకి క్షణకాలం మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. చంద్రుడి చూపులు పుత్రవాత్సల్యంతో , బుధుడి చూపుల్ని కౌగిలించుకున్నాయి.


*"నాన్నగారూ..."* బుధుడు సందేహిస్తూ ఆగాడు. *"ఏమిటి నాయనా ?"* చంద్రుడు ప్రేమగా అడిగాడు.


*"నాకు... నాకు... ఒక వరం కావాలి. అనుగ్రహిస్తారా ?"* బుధుడు ఆశగా అడిగాడు. అతని కళ్ళు అనుగ్రహించమంటూ మౌనంగా ప్రార్ధన చేస్తున్నాయి. చంద్రుడి చేతి వేళ్ళ కొసలు , బుధుడి చుబుకం కింద చేరి , అతని ముఖాన్ని లాలనగా , కొద్దిగా పైకెత్తాయి. *“అడుగు నాయనా !”*


బుధుడు అడిగాడు. అతడు కోరిన వరం చంద్రుణ్ణి ఒక్క కుదుపు కుదిపి , చలనం లేని విగ్రహంలా మార్చివేసింది. చంద్రపత్నులందరూ కదలడం మరిచిపోయిన లతల్లా ఉండిపోయారు. హఠాత్తుగా ఆవరించిన నిశ్శబ్దంలో , నిశ్చేష్టుడిలా నిలచి పోయిన తన తండ్రిని బుధుడు ఆశ్చర్యంతో చూశాడు.


*"నేను...ఒకసారి... అమ్మను చూడాలి ! అనుమతి అనుగ్రహించండి !"* బుధుడు కోరిన కోరిక అందరి చెవుల్లోనూ ఇంకా మారుమ్రోగుతూనే ఉంది - చంద్రుణ్ణి తప్పించి ! ఎందుకంటే అది చంద్రుడి హృదయంలో ప్రతిధ్వనిస్తోంది !


*“బుధా...”* ఊహించని బుధుడి కోరిక తనను నిమగ్నం చేసిన ఆశ్చర్య సాగరంలోంచి బైటపడి , అన్నాడు చంద్రుడు. *"నా కన్నతల్లిని , ఒక్కసారి కళ్ళారా చూడాలి , నాన్నగారూ... చూడవచ్చా?"* బుధుడు ఆశగా అడిగాడు.


చంద్రుడి ముఖాన్ని ముసుగులా కప్పిన ఆశ్చర్యాన్ని తొలగించివేస్తూ ఆనందం చిరునవ్వు రూపంలో ప్రత్యక్షమైంది. రెండు చేతుల్తో ఆప్యాయంగా బుధుణ్ణి దగ్గరకు తీసుకున్నాడు. తన కౌగిలిలో ఇమిడ్చి , అరచేతితో కొడుకు వీపు నిమురుతూ ఉండిపోయాడు.


*"వెళ్ళు నాయనా ! వెళ్ళి నీ కన్నతల్లిని చూడు !"* చంద్రుడి కంఠం గాద్గదికంగా ఉంది.


బుధుడు తండ్రి కౌగిలి నుంచి , సున్నితంగా తనను వేరుచేసుకున్నాడు. ఆనందోత్సాహాలు తాండవిస్తున్న తన అందమైన ముఖాన్ని కొద్దిగా పైకెత్తి , ఆయన ముఖంలోకి కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు.


*"ధన్యోస్మి, నాన్నగారూ !"* అంటూ బుధుడు తన తండ్రి పత్నుల వైపు చూశాడు.


అందరి కళ్ళల్లోనూ అశ్రువులు చిప్పిల్లుతున్నాయి వాళ్ళలో పొంగిపొరలుతున్న మాతృవాత్సల్యాన్ని వెల్లడిస్తూ. బుధుడు మౌనంగా అందరికీ చేతులు జోడించి , ద్వారం వైపు తిరిగాడు. ఇరవై ఎనిమిది జతల కళ్ళు వెన్నుకాపుగా బుధుడి వీపును స్పృశిస్తున్నాయి.


బృందగానంలాగా , శ్రావ్యంగా , శిష్యులు వల్లె వేస్తున్న వేదసూక్తాన్ని వింటూ , బృహస్పతి - తనకు ఎదురుగా అల్లంత దూరాన కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తూ , నివ్వెరపోయాడు.


ఆశ్రమం వైపు వస్తున్న యువకుడి మీదే ఆయన చూపులు నిలిచిపోయాయి. అందంగా వొంపులు తిరిగిన కాలిబాట. ఆ పాద పథం మీద అడుగులు వేస్తూ వస్తున్న యువకుడు ! ఆ దృశ్యం... గతంలో తనకు కనిపించిన దృశ్యాన్ని గుర్తుకు తెస్తోంది ! ఆ యువకుడు... ఆ యువకుడు... ఆ చంద్రుణ్ణి గుర్తుకు తెస్తున్నాడు. ఏదో ఆశ్చర్యం , మరేదో అర్థం కాని అందోళనా ఆయన లోపల బలంగా పెనవేసుకుని , గుండెను పిండుతున్నాయి.


ఆ యువకుడు , ఎవరో కాదు , చంద్రుడు ! ఔను... సందేహం లేదు... చంద్రుడే ! ఎందుకు వస్తున్నాడు ఆ ధూర్త శిష్యుడు ? గతాన్ని పునరావృతం చేయడానికా ? రకరకాల ఆలోచనలు బృహస్పతిలో సంకుల సమరం సాగిస్తున్నాయి. నిలువెల్లా నిండి నిబిడీకృతం అవుతున్న ఆశ్చర్యం ఆగ్రహంగా పరివర్తన చెందుతూ , ఆయన శరీరాన్ని వణికిస్తోంది.


గురువుగారి ముఖకవళికలను గుర్తించిన శిష్యులు 'వల్లెవేత'కు స్వస్తి చెప్పారు.


చేష్టలు ఉడిగి , విగ్రహంలా మారిపోయిన తన ముందు ప్రత్యక్షమైన 'చంద్రుడి'ని ఉద్వేగంతో చూశాడు బృహస్పతి. ఎందుకో ఆయన కనుబొమలు అదురుతున్నాయి.


*"ఆత్రేయ మహర్షి పౌత్రుడు , చంద్రుని పుత్రుడూ అయిన బుధుడు నమస్కరిస్తున్నాడు."* అంటూ 

యువకుడు బృహస్పతి పాదాలను స్పృశించి , కళ్ళకు అద్దుకున్నాడు. బృహస్పతి గుండె వేగంగా స్పందించింది. ఆయన నేత్రాలు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. అత్రి మహర్షి పౌత్రుడు... చంద్రుని పుత్రుడు... బుధుడు... బృహస్పతిలో ఆవిర్భవించిన ఆగ్రహావేశాలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఉప్పెనలా ఉవ్వెత్తున లేచిన ఉద్వేగ తరంగాలు తమ జన్మస్థానానికి అధోగమనం చేస్తున్నాయి. 


బుధుడు... బృహస్పతి తనలో అనుకున్నాడు. తనలో అనుకున్నాడని అనుకున్నాడు. కానీ అనుకోలేదు... అన్నాడు !


*"ఔను , గురుదేవా ! బుధుడు వినయంగా అన్నాడు. *"చంద్రపుత్రుణ్ణి... శిష్య సమానుణ్ణి ! ఆశీర్వదించండి !".*


బృహస్పతి చెయ్యి అప్రయత్నంగా పైకి లేచింది. *"దీర్ఘాయుష్మాన్ భవ !"* ఆయన పెదవులు ఉచ్చరించాయి. 


*"సుఖీభవ !"* అంటూ చంద్రుణ్ణి దీవించిన విషయం తటాలున గుర్తొచ్చింది బృహస్పతికి.


*"గురుదేవా... మిమ్మల్ని ఒకటి అర్థించడానికి వచ్చాను..."* బుధుడు అదే వినయంతో అన్నాడు. *“అనుమతిస్తే... అర్థిస్తాను...”*


బుధుడు , తన గృహిణి తార గర్భంలో వాసం చేసి , తన గృహంలో జన్మించిన బాలుడు. తన పుత్రుడు కాదు. కానీ తన భార్యకు పుత్రుడవుతాడు. బృహస్పతిలోంచి ఏదో నిర్వేదం నిశ్వాస రూపంలో బైటపడింది.


ఈ బుధుడు బుద్ధిమంతుడిలా ఉన్నాడు. అర్థించడానికి అనుమతి అర్థిస్తున్నాడు. బుధుడి చూపులు అతని ప్రార్ధనను గుర్తుచేస్తున్నాయి బృహస్పతికి.



*"అడుగు నాయనా..."* అంత సేపూ మౌనాన్నే ఆశ్రయించిన బృహస్పతి మెల్లగా అన్నాడు.


*"నా తల్లి తారాదేవిని దర్శించుకోవడానికి అనుమతించండి..."* 


బృహస్పతి ఆశ్చర్యంతో ఒక్కసారిగా ఊపిరి బిగబట్టాడు. ఎదురుచూడని అభ్యర్ధన ! తన ఊహకు అందని అభ్యర్ధన ! తన కన్నతల్లిని చూడడానికి తనయుడు అనుమతి అడుగుతున్నాడు. ఉద్వేగభారంతో బృహస్పతి శిరస్సు ముందుకీ , వెనుకకూ కంపిస్తూ ఉండిపోయింది.


తను ఎంత మాట్లాడినా మౌనంగానే ఉండిపోతున్న బృహస్పతిని , వాక్ పతిని , వాచస్పతిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు బుధుడు. తన ముందు కూర్చున్న దేవగురువు సామాన్యుడు కాదు ! ఆయన వాక్ పతి ! వాక్చాతుర్యం కలిగిన మేధావి ! మాటల మాంత్రికుడు ! కానీ మాట్లాడటం లేదు !


*“గురుదేవా...”* బుధుడు ప్రాధేయపూర్వకంగా అన్నాడు. *"ఒక్కసారి... ఒక్కసారి... నా మాతృదేవతను చూసి , వెళ్ళిపోతాను. నేను... నేను...అమ్మను చూడాలి.”*


బొంగురుగా ధ్వనించిన బుధుడి స్వరం విని , బృహస్పతి రెప్పలెత్తి , అతని ముఖంలోకి చూశాడు. బుధుడి కళ్ళల్లో ఆశ ద్రవ రూపంలో కదలాడుతోంది. అతని కళ్ళలోని ఆ ఆశ తన హృదయాన్ని ద్రవింప జేస్తోంది. బృహస్పతి ఇంక మౌనంగా ఉండలేకపోతున్నాడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat