*శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 7*

P Madhav Kumar


*మహాలక్ష్మీ ధ్యానమ్*


తన (పద్దెనిమిది) చేతులలో అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణం, వజ్రాయుధం, కమలం, ధనస్సు, కలశం, దండం, శక్తి, ఖడ్గం, డాలు, శంఖం, ఘంట, మద్యపాత్ర, శూలం, పాశం, సుదర్శనచక్రం ధరించి; ప్రవాళమణి (పగడపు) వర్ణం కలిగి, మహిషాసురుణ్ణి సంహరించిన దేవి; తామరపూవుపై కూర్చొని ఉండే తల్లి అయిన మహాలక్ష్మిని సేవిస్తున్నాను.


 

*మహిషాసుర సైన్యవధ - 1*

 *ఋషి పలికెను :* 

పూర్వం అసురులకు మహిషాసురుడు, దేవతలకు ఇంద్రుడు అధిపతులుగా ఉన్నప్పుడు దేవాసురులకు పూర్ణంగా నూడేళ్ళు ఒక యుద్ధం జరిగింది. అందు దేవసైన్యం మహావీర్య సంపన్నమైన అసురసైన్యం చేతిలో ఓడిపోయింది. 


దేవతలందరినీ జయించిన పిదప మహిషాసురుడు ఇంద్రపదవిని అధిష్ఠించాడు.  


అంతట ఓటమిపొందిన దేవతలు ప్రజాపతియైన బ్రహ్మ వెంట శివుడు, విష్ణువు ఉన్న చోటికి వెళ్ళారు. మహిషాసురుడు తమని ఓడించిన విధాన్ని జరిగినది జరిగినట్టే సవిస్తరంగా దేవతలు వారికి తెలియపఱచారు. 


"సూర్యచంద్రుల, ఇంద్రాగ్ని వాయు యమ వరుణుల, ఇతర దేవతల అధికారాలనన్నిటిని అతడు (మహిషుడు) స్వయంగానే అధించాడు. దురాత్ముడైన మహిషునిచే స్వర్గం నుండి నిరాకరింపబడి దేవగణములందరూ భూమిపై మనుష్యులవలె సంచరిస్తున్నారు. అమరవైరి యొక్క దుశ్చేష్టిత మంతా మీ ఇరువురికీ తెలుపబడింది. మిమ్మల్ని శరణమర్థిస్తున్నాము. మీరు ఇరువురూ వాణ్ణి వధించే మార్గాన్ని చిత్రించి మాకు దయ చూపుతారుగాక”


ఇలా దేవతల పలుకులను విని విష్ణువు, శివుడు కోపము నొందిరి. వారి ముఖాలు బొమముడిపాటుతో భయంకరములయ్యాయి. అంతట కోపపూర్ణుడైన విష్ణువు వదనం నుండి ఒక గొప్ప తేజస్సు వెలువడింది. బ్రహ్మ, శివుడు ముఖాల నుండి కూడా అలాగే వెలువడింది. 


ఇంద్రాది ఇతర దేవతల శరీరాల నుండి కూడా ఒక మహాతేజం వెలువడింది. ఈ తేజస్సు (అంతా) ఏకమయ్యింది. అక్కడ మహోజ్వలంగా వెలుగుతున్న పర్వతం వలె, సర్వదిశా వ్యాప్తమైన జ్వాలలు గల ఒక తేజోరాశిని దేవతలు చూసారు. అంతట సర్వదేవ శరీరాల నుండి ఉత్పన్నమైన అసమానమైన ఆ తేజస్సు,  ల్లోకాలను వ్యాపించిన వెలుగుతో, ఒకటిగా కూడి స్త్రీరూపాన్ని ధరించింది. 


శివుని తేజస్సు ఆమె ముఖంగా రూపొందింది. యమునిది ఆమె వెంట్రుకలుగా, విష్ణుతేజస్సు ఆమె బాహువులుగా, చంద్రునిది ఆమె కుచద్వయంగా, ఇంద్రునిది ఆమె నడుముగా, వరుణునిది ఆమె పిక్కలు తొడలుగా, భూమితేజస్సు ఆమె పిరుదులుగా రూపొందాయి.


బ్రహ్మతేజస్సు ఆమె పాదములుగా, సూర్యతేజస్సు ఆమె కాలివ్రేళ్ళుగా, వసువుల (తేజస్సు) ఆమె చేతి వ్రేళ్లుగా, కుబేర (తేజస్సు) ఆమె ముక్కుగా, ప్రజాపతి తేజస్సు ఆమె దంతాలుగా, అగ్ని (తేజస్సు) ఆమె మూడుకన్నులుగా, రెండు సంధ్యల తేజస్సు ఆమె కనుబొమలుగా, వాయు (తేజస్సు) ఆమె చెవులుగా రూపొందాయి. 


ఇతర దేవతల నుండి వెలుడలిన తేజస్సులు కూడా శుభమూర్తి అయిన (ఆ దేవి రూపొందుటకు) తోడ్పడ్డాయి. సర్వదేవతా తేజోరాశి నుండి సముద్భవించిన ఆమెను చూసి మహిషాసుర పీడితులైన దేవతలు సంతసించారు. 


పినాకపాణి (శివుడు) తన శూలం నుండి ఒక శూలాన్ని, విష్ణువు తన చక్రము నుండి ఒక చక్రాన్ని తీసి ఆమెకు ఇచ్చారు. 


వరుణుడొక శంఖాన్ని, అగ్ని దేవుడు ఒక బల్లాన్ని ఆమెకు ఇచ్చారు. వాయుదేవుడొక వింటిని బాణాలతో నిండిన రెండు అమ్ములపొదులను ఇచ్చాడు. వేల్పుటేడు, సహస్రాక్షుడు అయిన ఇంద్రుడు తన వజ్రాయుధము నుండి ఒక వజ్రాయుధాన్ని, తన ఐరావతగజం ఘంట నుండి ఒక ఘంటను తీసి ఆమెను ఇచ్చాడు. 


యముడు తన కాలదండం నుండి ఒక దండాన్ని, వరుణుడొక పాశాన్ని ఇచ్చారు. ప్రజాపతియైన బ్రహ్మ ఒక అక్షమాలను, ఒక కమండలువును ఇచ్చాడు.


సూర్యుడు ఆమె సమస్త రోమకూపములలో తన కిరణాలను ఇచ్చాడు. కాలుడు (యముడు) ఖడ్గాన్ని, నిర్మలమైన డాలును ఆమెకు ఇచ్చాడు. 


 *సశేషం...........*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat