నవగ్రహ పురాణం - 83 వ అధ్యాయం

P Madhav Kumar


*బుధగ్రహ చరిత్ర - 10*



బ్రహ్మ మానస పుత్రుడైన వశిష్ఠ మహర్షి తపస్సు అచిరకాలంలోనే ఫలించింది. పరమశివుడు ఆయన ముందు సాక్షాత్కరించాడు. 


*"వశిష్ఠా! వరం కోరుకో !"* శివుడు చిరునవ్వుతో అన్నాడు.


*"పరమేశ్వరా ! నీకు తెలియదా ? మీ శాపం మూలంగా వైవస్వతుడి ఏకైక పుత్రుడు సుద్యుమ్నుడు స్త్రీగా మారిపోయాడు.”* 


*"ఇలా సుందరి బుధుణ్ణి భర్తగా స్వీకరించి , పుత్రుణ్ణి పొందింది కద !"* శివుడు నవ్వుతూ అన్నాడు.


*"లేక లేక కలిగిన ఏకైక పుత్రుణ్ణి కోల్పోయిన వైవస్వత దంపతులు నిరంతర విచారంలో మునకలు వేస్తున్నారు. రాజ్యానికి వారసుడు లేడు. కరుణామయా ! శాపాన్ని ఉపసంహరించి , వైవస్వతుడికి పుత్రభిక్ష ప్రసాదించు. గతంలో పుత్రికను పుత్రుడిగా మార్చి వైవస్వతుడి కోరిక తీర్చిన నా సహాయాన్ని సార్ధకం చేయి !"* వశిష్ఠుడు చేతులు జోడించి ప్రార్ధించాడు.


*"ఆ శాపం మా దంపతులది. అందులో ఈ అర్ధ నారి ఈశ్వరుడి భాగం అర్ధమే సుమా !"* శివుడు చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు. *“అందువల్ల శాపాన్ని సగం మాత్రమే. ఉపసంహరిస్తాను...”*


*"సగమా ?"* వశిష్ఠుడు ఆశ్చర్యంతో అన్నాడు.


*"వైవస్వతుడికి అన్యాయం జరగకూడదు. బుధుడికీ అన్యాయం జరగరాదు. అక్కడ తనయుడు కావాలి. ఇక్కడ ధర్మపత్ని కావాలి. ఒక మాసం సుద్యుమ్నుడుగానూ , ఒక మాసం ఇలగానూ జీవితాంతం కొనసాగేలా అనుగ్రహిస్తున్నాను."*


*"పరమేశ్వరా !”*


*"సుద్యుమ్నుడు సుద్యుమ్నుడుగా ఒక నెల పాటు రాజ్యం చేస్తాడు ! ఇలగా ఒక నెల పాటు బుధుడి ఆశ్రమంలో గృహిణీపదం నిర్వర్తిస్తాడు. శుభం భూయాత్ !"* అంటూ పరమశివుడు అంతర్ధానమయ్యాడు.


సూర్యోదయ సమయం. సరస్సులో వికసించిన పద్మాలు... నీటిలోంచి పైకి తేలిన బుధుడు , ఇల చేతుల్లోంచి పురూరవుణ్ణి అందుకుని , గట్టు వైపు వెళ్ళాడు.


పురూరవుణ్ణి నేల మీద నిలుచోబెట్టి , పొడి గుడ్డతో తేమను తుడిచాడు బుధుడు. తండ్రి చేస్తున్న పని తనకు పట్టనట్టు పురూరవుడు కొలనులో ఈదుతున్న తల్లినే చూస్తున్నాడు. పురూరవుడి వైపు నవ్వుతూ చూసింది. పురూరవుడు నవ్వుతున్నాడు. రెండు తామర పువ్వుల మధ్య మెరుస్తూ కనిపిస్తున్న అమ్మ ముఖాన్ని ఆనందంగా చూస్తూ.


*"నాన్నగారూ ! రెండు పద్మాల మధ్య అందమైన పద్మం ! ఎవరో చెప్పుకోండి !"* అన్నాడు పురూరవుడు.


బుధుడు సరస్సు వైపు తిరిగాడు. రెండు తామర పువ్వుల మధ్య ఆ రెండింటిని అందంలో వెక్కిరిస్తూ ఇల ముఖపద్మం దర్శనమిచ్చిందాతనికి.


ఇల నవ్వుతూ నీటిలో మునిగింది. పద్మాల మధ్య మళ్ళీ ప్రత్యక్షమయ్యే ఆమె ముఖారవిందం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు బుధుడు. పురూరవుడు కూడా అటే చూస్తున్నాడు.


ఉన్నట్టుండి రెండు పద్మాల మధ్య ముఖం పైకి లేచి , ప్రత్యక్షమైంది. ఆ ముఖం ఇలది కాదు ! ఆ ముఖం స్త్రీది కాదు ! ఆ ముఖం పురుషుడిది !


*"నాన్నగారూ ! అమ్మ...అమ్మ ఏదీ ?”* పురూరవుడు మెల్లగా అడిగాడు కొత్త ముఖాన్ని చూస్తూ.


బుధుడు సమాధానం చెప్పే స్థితిలో లేదు. ఇల ఏమైంది ? ఆ పురుషుడు ఎవరు ? పురుషుడు ఇద్దర్నీ చిరునవ్వుతో చూస్తూ , వాళ్ళ వైపు ఈదుతూ వస్తున్నాడు. బుధుడి చూపులు జంటతామరలవైపూ , ఆ పురుషుడి వైపూ చూస్తూ ఉండిపోయాయి.


కొలను గట్టును సమీపించిన ఆ పురుషుడు , నీళ్ళలోనే నిలుచున్నాడు , బుధుడి వైపు చిరునవ్వుతో చూస్తూ. *"ఎవరు నువ్వు ? నా భార్యను ఏం చేశావ్ ?"* బుధుడు తీక్షణంగా చూస్తూ అడిగాడు.


ఆ పురుషుడు అర్ధం కానట్టు కళ్ళు చిట్లిస్తూ చూశాడు. *"ఏమిటి స్వామీ...”* ఏదో అనబోయిన అతను , తన కంఠస్వరం విని నిర్ఘాంతపోతూ , మౌనం ధరించాడు. మెల్లగా తలవాల్చి తనను తాను చూసుకున్నాడు. బుధుడు ఆశ్చర్యంతో ఆలోచనలలో మునిగిపోయాడు.


ఇల , తన ప్రేయసి , తన ఇల్లాలు - పురుషుడిగా మారిపోయిందా ? ఆ వశిష్ఠమహర్షి అన్నంత పనీ చేశాడా ? తాను పత్నీ విహీనుడయ్యాడా ? పురూరవుడు మాతృ విహీనుడయ్యాడా ?


*"స్వామీ ! ఇది నా పురుష రూపం ! ఇది - ఇప్పుడు మీరు చూస్తోంది నా పూర్వరూపం...”* అంతసేపూ తన శరీరాన్ని పరిశీలనగా చూసుకున్న పురుషుడు ఆశ్చర్యంతో అన్నాడు.


*"ఇలా..."* బుధుడు అప్రయత్నంగా అన్నాడు.


*"స్వామీ ! వశిష్ఠమహర్షి ప్రయత్నం ఫలించి నట్లుంది... స్వామీ..."* సుద్యుమ్నుడిగా మారిపోయిన ఇలా విచారంతో అంది.


బుధుడు బలహీనంగా నేల మీద కూర్చుండి పోయాడు.


*"నాన్నగారూ... అమ్మ ఏదీ ?"* పురూరవుడు ఏడుపును ఆపుకుంటూ అడిగాడు. 


బుధుడు పురూరవుణ్ణి హృదయానికి హత్తుకుని , బరువుగా నిట్టూర్చాడు. *"అమ్మ... లేదు నాయనా..."*


ఆశ్రమం ముందు అరుగు మీద ముగ్గురూ విచార వదనాలతో కూర్చున్నారు. బుధుడి చూపులు సుద్యుమ్నుడి మీదే ఉన్నాయి. బలిష్టమైన , ఎత్తైన విగ్రహం , గంభీరంగా అగుపించే ముఖం. పౌరుషాన్నీ , దర్పాన్ని వ్యక్తం చేస్తున్న మీసాలు...


బుధుడు పూర్తిగా మౌనంలోకి వెళ్ళిపోయాడు. అమ్మ గురించి అడిగి , అడిగీ అలసిపోయిన పురూరవుడు తండ్రి వొడిలో వాలాడు. పరిస్థితి తమకు కూడా అర్థమైనట్టు ఆశ్రమ జంతువులు స్తబ్దంగా పడుకున్నాయి.


*"నాయనా , సుద్యుమ్నా !"* ఆశ్రమ ప్రాంగణంలోకి అడుగు పెడుతూ , ఆశ్చర్యంగా పిలిచిన వశిష్ఠుడి కంఠస్వరం వాళ్ళను ఉలిక్కిపడేలా చేసింది. వశిష్ఠుడు రథం దిగి వస్తున్నాడు.


*“గురుదేవా !”* సుద్యుమ్నుడు కూర్చున్న చోటు నుంచి లేచి , వశిష్ఠునికి ఎదురువెళ్ళాడు. 


వశిష్ఠ మహర్షి ఆగి తను చెక్కిన శిల్పాన్ని తృప్తిగా చూస్తున్నట్లు సుద్యుమ్నుడిని చూస్తూ ఉండిపోయాడు. సుద్యుమ్నుడు , ఆయనకు పాదాభివందనం చేశాడు.


*"సుఖీభవ !"* వశిష్ఠుడు దీవించాడు. విజయోత్సాహంతో సుద్యుమ్నుడి ముఖంలోకి చూశాడు. *"ఎన్నాళ్ళయింది సుద్యుమ్నా , నిన్ను చూసి !".* 


*“గురుదేవా...”*


*"మళ్ళీ ఇన్నాళ్ళకు ఆ పరమేశ్వరుడి కృపతో నిన్ను నిన్నుగా చూస్తున్నాను. నిన్ను చూసి నీ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో ఊహించలేను సుమా!"* వశిష్ఠుడు నవ్వుతూ అన్నాడు. 


*“ఒకరికి సంతోషం...మరొకరికి సంతాపం...”* సుద్యుమ్నుడు నిరుత్సాహంగా అన్నాడు.


*“ఒక్కసారి ఆ తండ్రీ కొడుకులను చూడండి."*


వశిష్ఠుడు బుధుణ్ణి , పురూరవుణ్ణి చిరునవ్వుతో చూస్తూ , వాళ్ళ వైపు నడిచాడు. బుధుడు లేచి , మౌనంగా నమస్కరించాడు. పురూరవుడు కూడా లేచి , దగ్గరగా వచ్చిన వశిష్ఠ మహర్షికి పాదాభి వందనం చేశాడు.


*“చిరాయుష్మాన్భవ ! పురూరవుడు తల్లిదండ్రులకు తగ్గ తనయుడు.”* అంటూ కుర్రవాడి తల నిమిరాడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat