నవగ్రహ పురాణం - 82 వ అధ్యాయం

P Madhav Kumar
4 minute read


*బుధగ్రహ చరిత్ర - 9*


ఇల తలను అడ్డగా ఊపింది. *"గురుదేవా... ఇక్కడ... ఈ రూపంలో నేను ప్రశాంతంగా ఉన్నాను ! ఈ జీవితం నాకెంతో తృప్తిగా ఉంది... నేను రాను.”*


*"నీ నిర్ణయంలో కేవలం స్వార్థం ఉంది. నీ సుఖసంతోషాలు మాత్రమే ఉన్నాయి. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాల్సిన గురుతరమైన బాధ్యత నీ మీద ఉంది. వయోవృద్ధుడైన వైవస్వతుడి నుండి రాజ్య భారాన్ని స్వీకరించి , ప్రజలను పాలించే విధి నీకు ఉంది ! నువ్వు ఆ విధ్యుక్త ధర్మం నుండి తప్పించుకోకూడదు !"* వశిష్ఠుడు ఇలా ముఖంలోకి తదేకంగా చూస్తూ అన్నాడు..


ఇల మౌనంగా ఉండిపోయింది. వశిష్ఠుల వారు చెప్పిన అంశాలన్నీ సహేతుకమైనవే !


*"ముఖ్యంగా నీ తల్లిదండ్రులు నీ కోసం భరించరాని మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. వారికి నువ్వు దగ్గరై , ఆ దారుణ దుఃఖాన్ని దూరం చేయాలి...”*


*"గురుదేవా...".*


*"స్త్రీ రూపంలో నువ్వు రాజధానికి రానవసరం లేదు. నేను పరమశివుణ్ణి తప్పస్సుతో మెప్పిస్తాను. నీకు నీ పురుష రూపం లభించేలా చూస్తాను !"* వశిష్ఠుడు నిష్కర్షగా అన్నాడు. *"అప్పుడు నువ్వు సుద్యుమ్నుడవుతావు. సుద్యుమ్నుడు ఇక్కడ బుధుడి భార్యగా ఉండలేడు కద !"*


ఏదో చెప్పబోయిన ఇలకు బుధుడి రాక ఆటంకం కలిగించింది.


వశిష్ఠుడు బుధుడికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. వెంటనే బుధుడు ఆయనకు పాదాభివందనం చేశాడు. 


"మీ పాదాలు సోకి నా ఆశ్రమం పావనమైంది. మీ రాకకు కారణం చెప్పి నన్ను ధన్యుణ్ణి చేయండి."* బుధుడు వినయంగా అన్నాడు.


వశిష్ఠ మహర్షి బుధుడిని సానుభూతితో చూశాడు. *"నాయనా ! నా రాకకు కారణం నీకు విచార కారణం ! అయినా చెప్పక తప్పదు. విను...”* అంటూ తన రాకకు కారణం పూర్తిగా వినిపించాడు.


తన ప్రియ భార్య ఇల మౌలికంగా స్త్రీ కాదనీ , స్త్రీగా మారిన పురుషుడనీ విని బుధుడు నిర్ఘాంతపోయాడు. ప్రశ్నార్ధకంగా ఇల వైపు చూశాడు.


*"చూడగానే మిమ్మల్ని ఇష్టపడ్డాను. మీ భార్యగా , మీతో సహజీవనం చేస్తూ ఆనందంగా గడపాలని ఆ క్షణంలోనే నిశ్చయించుకున్నాను..."* ఇల తలవాల్చుకుని అంది *“మీ నుండి నిజం దాచాను. నన్ను క్షమించండి.”*


బుధుడు ఇల దగ్గరగా జరిగి , ఆమె భుజం చుట్టూ తన చేతిని వేశాడు. వశిష్ఠుడి వైపు సూటిగా చూశాడు. *"మహర్షీ ! నాకు నా ఇల్లాలి పూర్వ రూపంతో పనిలేదు. నాకు కావాల్సింది ఇల ! అంతే ! నేను ఆమెను వదలను !"*


భర్త మాట వినగానే ఇల కళ్ళు నీళ్ళతో నిండాయి. వశిష్ఠ మహర్షి తలపంకిస్తూ నిట్టూర్చాడు.


*"నాయనా... ఒక క్షణం ఆలోచించు. మీ కుమారుడు పురూరవుడిని నేను తీసుకువెళ్ళి పెంచుకుంటాననుకో. దశాబ్దాలు గడిచిపోతాయి. నువ్వూ , నీ భార్య వృద్ధులయ్యారు. యువకుడైన పురూరవుణ్ణి తిరిగి ఇచ్చివేయమని అడుగుతారు. నేను నిరాకరిస్తే మీకు ఎలా ఉంటుంది ? ఆలోచించు !"*


*“మహర్షీ !”*


*"ఇల తల్లితండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. రాజ్యానికి ఉత్తరాధికారి లేడు. వైవస్వతుడికి సుద్యుమ్నుడు అత్యవసరం ! జరగబోయేది నీకు చెబుతున్నాను. ఈరోజు కాకపోయినా రేపు ఇల పూర్వ రూపానికి వస్తుంది. ఇలాదేవి సుద్యుమ్నుడుగా మారిపోతుంది ! అప్పుడు ఆ పురుష రూపంలో ఉన్న ఇలను భార్యగా నువ్వు చేరదీయలేవు...”*


*"గురుదేవా !"* ఇల గద్గదికంగా అంది.


*"ఔను తల్లీ ! నీ తండ్రి సామాన్యుడు కాడు. సాక్షాత్తుగా సూర్యుని పుత్రుడు. వారసులు లేని 'నిస్సంతు'లా ఉండిపోడు. ఇది హెచ్చరిక కాదు , జరగ బోయేదాని సూచన !”* 


*"మహర్షీ ! ఇలనూ , నన్నూ దూరం చేస్తారా ?"* బుధుడు దీనంగా అడిగాడు.


*"లేదు , నాయనా ! ఇలనూ , నిన్నూ దూరం చేయడం నా ఉద్దేశం కాదు. సుద్యుమ్నుడిని అతని తల్లిదండ్రులకు దగ్గర చేయడం !"* వశిష్ఠుడు చిరు నవ్వుతో అన్నాడు. *"అమ్మా ! ఇలా , నాకొక విషయం చెప్పు. రూపం మారిన అనంతరం నీకు ఇల అని పేరు ఎవరు పెట్టారు ?"*


*"స్త్రీ రూపం రాగానే నా పేరు 'ఇల' అని ఎందుకో నాకే తోచింది. గురుదేవా !"* ఇల సమాధానమిచ్చింది. 


వశిష్ఠుడు చిరునవ్వు నవ్వాడు. *"ఎందుకంటే - పుట్టుకతో నువ్వు ఆడపిల్లవు ! అప్పుడు నీ తల్లిదండ్రులు నీకు పెట్టిన పేరు ఇల !"*


*“అంటే... అంటే... ఇల ఇలగా జన్మించి , సుద్యుమ్నుడుగా - పురుషుడుగా మారిందా ?"* బుధుడు ఆశ్చర్యంగా అన్నాడు..


*"అవును , బుధా ! ఆడశిశువుగా జన్మించిన ఇల మగ శిశువుగా పరివర్తన చెందడానికి కారణం ఈ వశిష్ఠుడే !"* వశిష్ఠుడు చిరునవ్వు నవ్వాడు. *"ఇలా రండి... నా దగ్గరగా కూర్చోండి. ఇల జన్మ వృత్తాంతం ఆలకించండి !"*


ఇల , బుధులు వశిష్ఠుడి ఎదురుగా పక్కపక్కనే కూర్చున్నారు. తల్లి ఒడిలో కూర్చున్న పురూరవుణ్ణి వశిష్ఠుడు నవ్వుతూ చూశాడు.


*"పురూరవా ! ఇలా రా , నాయనా ! నా ఒడిలో కూర్చో !”*


పురూరవుడు తల్లిదండ్రుల వైపు ఒకసారి చూసి , వశిష్ఠ మహర్షి ఒడిలో కూర్చున్నాడు. వశిష్ఠుడు కుర్రవాడి తల నిమిరి , బుగ్గ మీద చుంబించాడు. తల ఎత్తి ఇలనూ , బుధుణ్ణి చూశాడు.


*"సూర్యుడికీ , సంజ్ఞా దేవికీ జ్యేష్ఠపుత్రుడైన వైవస్వత మనువు 'శ్రద్ధ'ను భార్యగా స్వీకరించాడు. తండ్రి అనుమతితో రాజ్యపాలన కొనసాగించాడు. ఆ దంపతులకు ఎంత కాలానికీ సంతతి కలగలేదు. సంతానార్ధం యాగం చేయమని వైవస్వతుడికి నేను సూచించాను. కులగురువైన నా సూచనను అనుసరించి వైవస్వతుడు పుత్రసంతానం కోసం యాగం నిర్వహించాడు."*


*"యాగం ప్రారంభమైంది. వైవస్వతుడి ధర్మపత్ని శ్రద్ధ యాగంలో భర్తతో పాటు పాల్గొంది , పుత్రికాసంతానం కావాలని ఆమె హోత చేత సంకల్పం చెప్పించింది. అది యజ్ఞం చేయిస్తున్న వారికీ , వైవస్వతుడికీ తెలీదు ! యాగం పూర్తయింది. సఫలమైంది. కూడా. పుత్రిక జన్మించింది. పుత్రిక జననంతో నిర్ఘాంతపోయిన వైవస్వతుడు నన్ను పిలిపించాడు. కొడుకుని కోరి యాగం చేస్తే కూతురు ఎందుకు పుట్టిందని నన్ను అడిగాడు. కారణం నాకు ధ్యానగోచరమైంది. పుత్రిక కావాలన్న సంకల్పంతో యాగం చేయబడిన నిజాన్ని చెప్పాను. వైవస్వతుడు విచారంతో క్రుంగిపోయాడు. తనకు వంశకర్త కావాలన్నాడు. వారసుడు కావాలన్నాడు. "*


*"అతన్ని చూసి నాకు జాలి వేసింది ! విశాల సామ్రాజ్యానికీ , వైవస్వతుడికీ వారసుడు అత్యవసరం. నేను శ్రీమహావిష్ణువును ప్రార్థించాను. నా తపశ్శక్తిని వినియోగించాను. ఆడశిశువును మగశిశువుగా మార్చాను".*


*"వైవస్వతుడు పరమానందం చెందాడు. పుత్రుణ్ణి 'సుద్యుమ్నుడు' అన్నాడు.”*. ఇల జన్మ రహస్యం ఆమెనూ , బుధుణ్ణి ఆశ్చర్యంలో ముంచి వేసింది. మాటలు మరిచిపోయిన వాళ్ళలా వశిష్ఠుడిని చూస్తూ ఉండిపోయారు.


*"ఆవేశాన్ని , ఆవేదననూ నిగ్రహించుకుని ఆలకించండి !"* వశిష్ఠుడు ఇలా బుధులతో అన్నాడు. *"వైవస్వతుడి వారసుడుగా సుద్యుమ్నుడు రాజు కావాలి ! అతని వారసుడుగా , భవిష్యత్తులో ఇదిగో - ఈ పురూరవుడు రాజు కావాలి. ఆ మహత్తర భవిత కోసం నేను ప్రయత్నించాలి. శివపార్వతుల శాపం సుద్యుమ్నుడిని స్త్రీగా మార్చింది. శివుడి గురించి నేను తపస్సు చేస్తాను. ఇలకు పూర్వరూపం లభించేలా చేస్తాను !".*


*"ఆచార్యా ! మీ చర్య నన్ను భార్యా విహీనుణ్ణి చేస్తుంది. సుఖసంతోషాలకు దూరం చేస్తుంది"* బుధుడు దీనంగా అన్నాడు. 


*"నాయనా ! చంద్రపుత్రుడివైన నువ్వు కారణ జన్ముడివి. శివుడు అర్ధనారీశ్వరుడు. భార్యాభర్తలను విడదీయడు ! ఆయన ఉభయతారకంగా అనుగ్రహిస్తాడని నాకు అనిపిస్తోంది.”* వశిష్ఠుడు నవ్వుతూ ధైర్యం చెప్పాడు.


వశిష్ఠుడు వైవస్వత దంపతులకు బుధుడి ఆశ్రమంలో జరిగిందంతా చెప్పాడు. *"గతంలో ఇలను పుత్రుడిగా మార్చి , మీకు బహూకరించాను ! సుద్యుమ్నుడు మళ్ళీ ఇలాగా మారిపోయిన కఠోర సత్యం నా శక్తికి ఒక పరీక్షగా భావిస్తున్నాను. మీ పుత్రికను పుత్రుడుగా మార్చి మరొకసారి మీకు బహూకరిస్తాను."*


*"గురుదేవా ! మా వంశం మీకు రుణపడి ఉంటుంది. నాకు పుత్రభిక్షా , రాజ్యానికి వారసభిక్షా అనుగ్రహించే భారం మీదే."* వైవస్వతుడు చేతులు జోడిస్తూ అన్నాడు.


*"ఆ ధర్మం నాది. దయ పరమేశ్వరుడిది ! నేడే తపోభూమికి వెళ్తున్నాను ,"* అంటూ లేచాడు వశిష్ఠుడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat