*🌻1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము🌻*
🌻నివేదనము (ఘంటాకాలము)🌻
🍃🌹పిమ్మట మామూలు ప్రకారము పరిచారకుడు ఆహ్వానించగానే పాక కైంకర్యపరులు పాకశాలనుంచి ప్రసాదములు, దోసెలు పణ్యారములు తెచ్చి శ్రీవారికటాక్ష పాత్రమగునట్లు వుంచి వెళ్లెదరు. అర్చక స్వాములు ఆలయములోనికి వచ్చి తలుపులు వేయుదురు. అర్చకుడు మామూలు ప్రకారం నివేదనము చేయును. మామూలు ఘంటానాదము జరుగుచుండును. శ్రీవారికి ఆరగింపు పూర్తికాగానే, తలుపులు తీయుదురు. ఘంటానాదము ఆగిపోవును. పాచక కైంకర్యవరులు శ్రీవారికి నివేదితములైన ప్రసాదములను నిర్ణీతస్థానములకు చేర్చెదరు.
🍃🌹వెంటనే తిరువీస ప్రసాదము శ్రీవారి నివేదనకై తెచ్చి ఉంచెదరు. అర్చకుడు తలుపులువేసి శ్రీవారి నివేదనము ప్రారంభించును. ఈ నివేదన కాలములో శ్రీవారి ఆలయములో నున్న చిన్న ఘంటను మ్రోగించుచుందురు. నివేదనము పూర్తికాగానే తలుపులు తీయుదురు. వెంటనే పచనకైంకర్యపరుడు, తిరువీస ప్రసాద పాత్రమును తీసికుని వెళ్ళును. ఏకాంతముగా శాత్తు మొర జరుగును. వెంటనే సర్వదర్శనము ప్రారంభమగును. "
*🌻సర్వదర్శనము🌻*
🍃🌹శ్రీ స్వామివారు ప్రాతఃకాలము మధ్యాహ్నకాలము సర్వదర్శనములలో దర్శనములేని వారలకు అభ్యాగతులకు దర్శనమిచ్చుటకే ఈ సమయములో కూడా సర్వదర్శనము నంగీకరించినారు. భక్తులు మామూలు దర్శనము చేయుచూ విమాన ప్రదక్షిణము చేయుచు కానుకల నర్పించుచూ ఆనందపడుచూ వెళ్ళుచుందురు. శయనాసనమునకు సమయము కాగానే సర్వదర్శనము ఆపివేయబడి స్థానశుద్ధి రంగవల్లులు (ముగ్గులు) యేర్పాటు జరుగును, ఏకాంత సేవ ప్రారంభమగును.
*🌻ఏకాంతసేవ (శయనాసనము)🌻*
🍃🌹పూర్వాంగముగా పరిచారకులు శ్రీస్వామివారి గర్భాలయమునకు ముందు ఆలయములో వెండిగొలుసులలో బంగారు మంచమును, అందులో పట్టుపరుపులు, పట్టుదిండ్లు, పట్టుశాటీలు మొదలగు శయన పరికరములను యేర్పాట్లు చేయుదురు. పిమ్మట బహు విధములగు ఫలములు, ద్రాక్ష, శర్కర క్షీరములు, కలకండ, బాదం పప్పు, జీడిపప్పు మొదలగు అనేకములైన అనుభావ్య పదార్ధములను, ఏలా లవంగతక్కోల జాజి కర్పూరక్రముకాది చూర్ణముతో కూడిన తాంబూలములను తెచ్చి శ్రీవారి సన్నిధానమున ఉంచెదరు.
🍃🌹అనంతరము అర్చకుడు ద్వారము తలుపులు వేసి శ్రీవారికి శయనాసనాంగములగు ఉపచారములుచేసి భోగ్య ద్రవ్యములనన్నియు ప్రత్యేకముగా శ్రీవారికి నివేదించి, ముఖవాసమును సమర్పించి పిమ్మట కర్పూరహారతి భక్తి శ్రద్ధలతో నర్పించి ఏకాంతముగా శ్రీవారిపాదములనాశ్రయించి ద్వయము ననుసంధించి క్షమామంత్రమును పఠించి రక్షణ భారమునుంచి మైమరచి ఆనందము అనుభవించును. ధన్యతావాదము చేయుచూ కౌతుకమూర్తియగు శ్రీభోగ శ్రీనివాసస్వామివారిని ముందు అమర్చి యున్న సువర్ణ శయనమందలి పట్టుపరుపులయందు శయనాసనములో వేంచేపుచేయును. ద్వారము తలుపులు తీయబడును. తాళ్ళపాకంవారు అన్నమాచార్యులవారి గీతములను మృదులమగు తాంబురనాదముతో కలిపి శ్రీవారు నిదురించునట్లు గానము చేయుచుందురు.
🍃🌹ఏకాంతసేవా దర్శన పరాయణులగు మహాను భావులందరు, నారీమణులందరు శ్రీవారి శయన వైభవమును చూచి ఆనందసముద్రములో మునిగియుందురు. అప్పుడు శ్రీవారికి శయనాసనములో కర్పూరహారతి జరుగును. పిమ్మట తీర్థ ప్రసాదములు శ్రీస్వాములకు, ఏకాంత సేవా దర్శన పరాయణులకు వినియోగము జరుగును. శ్రీవారి ఏకాంత సేవాదర్శనము చేసుకుని భక్తులు క్రమముగా ఆలయము నుంచి వెళ్ళెదరు. పిమ్మట అర్చకుడు రాత్రి బ్రహ్మాదులు వచ్చి శ్రీవారిని ఆరాధించుటకు తగు తీర్థాది పరికరములను యేర్పాటు చేయించును. పరిచారకులను పంపి తలుపులువేసి, శ్రీవారి సన్నిధికి చేరి అన్ని యేర్పాట్లు చూచి పిమ్మట శ్రీవారికి మానసికములగు మనోరథములను తెలుపుకొని ఆజ్ఞను గైకొని సంప్రదాయానుసారముగా బయలు దేరును.
🍃🌹తృతీయ ద్వారమునకు వచ్చి తలుపులను యంత్రము (తాళము) చే బంధించి సువర్ణద్వారమునకు వచ్చును. అచ్చట అర్చకుడు మంత్రపూర్వకముగా యంత్రికతో (కుంచెకోలతో) సువర్ణ ద్వార కవాటములకు అంతర్బంధమును చేయును. పిమ్మట అధికారులు ఆ తలుపులకు బయట తాళములు రెంటిని వేసి నీళ్ళు వేసెదరు. అందరు భగవద్ధ్యానము చేయుచూ విమాన వందనముతో మహాద్వారమునకుచేరి, రక్షకభటులను నియమించి వారివారి స్వస్థానములకు చేరి కృతార్థులయ్యెదరు.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*