నవగ్రహ పురాణం - 91 వ అధ్యాయం - శుక్రగ్రహ చరిత్ర - 3

P Madhav Kumar


*శుక్రగ్రహ చరిత్ర - 3*


*"అదృష్టవంతుడివి , నాయనా ! శివుడి జఠరంలో విహరించి , ఆయన కుమారుడుగా , మేమిచ్చిన శరీరంతోనే - నూతనంగా జన్మించావు. ఆ కైలాసవాసుడు కరుణించిన శుక్రనామధేయంతో విరాజిల్లు"* భృగు మహర్షి ఉశనుడితో అన్నాడు.


*"పార్వతి నా బిడ్డకు ప్రాణం పోసింది."* పులోమ ఆనందంగా అంది. *"భవానీ శంకరుల కరుణ నీకు భవిష్యత్తులో కూడా తప్పక లభిస్తుంది !"*


*"మా గురుదేవుల అదృష్టం మాకూ అదృష్టమే మాతా !"* శుక్రుడితో పాటు ఆయన తల్లిదండ్రుల ఆశ్రమానికి వచ్చిన రాక్షస రాజు వృషపర్వుడు ఉత్సాహంగా అన్నాడు. అంతలోనే అతని ముఖాన్ని నిరాశ మేఘంలా కప్పింది. *“గురుదేవులు మహత్తర యోగశక్తి ద్వారా కుబేరుడి వద్ద సంగ్రహించిన సంపద మళ్ళీ చేయిజారిపోయిందే అన్న విచారం అందర్నీ బాధిస్తోంది !".*


*"ఆ ధనాన్ని మించిన జ్ఞానధనం మా శుక్రుడి రూపంలో నీ ఆస్థానంలో ఉంది , వృషపర్వా !"* భృగువు నవ్వుతూ అన్నాడు. *“మేధో సంపద ముందు ఆ సంపద ఎంత ?”* 


*"మీ మాటలు నాకు ధైర్యాన్నీ , ఓదార్పునీ ఇస్తున్నాయి , గురుపితా !"* వృషపర్వుడు. వినయంగా అన్నాడు.


*"గురుదేవా ! ఐశ్వర్యం అందినట్టే అంది , అంతర్థానమైంది ! అని తెలిసి , దేవతలు , విర్రవీగిపోతున్నారని చారులు వర్తమానం తెచ్చారు. భుజబలమైనా , యోగబలమైనా విజయం తమదే అనే భావనలో ఉన్నారు. వాళ్ళ వైఖరి నన్ను శతవిధాల బాధిస్తోంది."* వృషపర్వుడు శుక్రుడితో అన్నాడు. 


*"విజయం తననే వరిస్తుందన్న ఆత్మవిశ్వాసంతో శత్రువు ఉన్నప్పుడే యుద్ధం చేయడం యుద్ధనీతి ! అది విజయానికి దోహదం చేస్తుంది !"* శుక్రుడు నవ్వుతూ అన్నాడు.


*"అంటే దేవతల మీద యుద్ధం ప్రకటించమని మీరు సూచిస్తున్నారా ?"* వృషపర్వుడు అడిగాడు.


*"ఔను ! భుజబలంతోనూ , యోగబలంతోనూ తమకే విజయం చేకూరుతుందనుకుంటున్న ఇంద్రాదులు కొంతకాలం పాటు ప్రమత్తంగా ఉంటారు. భుజబలాన్నీ , యోగబలాన్నీ మించిన బుద్ధి బలంతో ముహూర్తం నిర్ణయం చేస్తాను. స్వర్గ రాజ్యాన్ని ముట్టడించండి !"* శుక్రుడు రెచ్చగొడుతూ అన్నాడు.


********************************


శుక్రుడి మంత్రాలోచన ప్రకారం వృషపర్వుడు రాక్షస సైన్యంతో దేవతల మీద విరుచుకుపడ్డాడు. యుద్ధం భీకరంగా సాగింది..


రాక్షస వీరులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మితి మీరిన సైన్య నష్టం జరిగాక , వృషపర్వుడు యుద్ధ రంగం నుండి వెనుతిరిగాడు.


రాక్షసులు పరాజయం శుక్రుడిని అధికంగా బాధించింది. ముహూర్త నిర్ణయం సవ్యంగా లేదంటూ వృషపర్వుడు పరోక్షంగా గురువును సున్నితంగా విమర్శించాడు. 


*"రాక్షస వీరులు ఈ విధంగా దేవతల చేతుల్లో మరణిస్తూ ఉంటే , దేవతలను జయించి , స్వర్గ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం కల్ల !"* అన్నాడు వృషపర్వుడు.


శుక్రుడు అతని వైపు తీక్షణంగా చూశాడు. ఆలోచనాపరంపర ఆయన నుదురు మీద గీతలు గీస్తోంది.


*"రాక్షసవీరులు యుద్ధంలో మరణించకుండా ఉంటే ?"* శుక్రుడు ఉన్నట్టుండి అన్నాడు. వృషపర్వుడు అర్ధం కానట్టు చూశాడు.


*"ఆలోచించు , అనురాధిపా ! మన వీరులకు యుద్ధంలో మరణం అనేది లేకుండా ఉంటే ఏమవుతుంది ?"* శుక్రుడు గంభీరంగా అడిగాడు.


వృషపర్వుడు చిన్నగా నవ్వాడు. *"మరణం లేకుండా ఎలా ఉంటుంది ? చావులేని సమరం సాధ్యం కాదు గురుదేవా !"*


*"ఈ శుక్రుడు సాధ్యం చేస్తాడు !"*


*"ఆచార్యా !"*


*"దేవతల చేతిలో మరణించే మన రాక్షస వీరులు వరసగా పునర్జీవితులవుతూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు !"*


*"మృతి చెందిన వాళ్ళు బ్రతకడమా ?"* వృషపర్వుడు కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాడు. 'ఎలా బ్రతుకుతారు, గురుదేవా ? ఎవరు బ్రతికిస్తారు ?"*


*"మృతసంజీవని బ్రతికిస్తుంది !"* శుక్రుడు చిరునవ్వుతో అన్నాడు. 


*"ఆ మృతసంజీవనీ విద్యను నేను సాధిస్తాను. తదేక దీక్షతో తపస్సు చేసి , పరమశివుణ్ణి మెప్పిస్తాను."* 


*"ఆచార్యా !"* వృషపర్వుడి కంఠం ఆశ్చర్యంతో వణికింది.


*"నా తల్లిదండ్రుల అనుమతి తీసుకుని , రేపే తపస్సుకు బయలుదేరుతాను"* శుక్రుడు తన నిర్ణయాన్ని గంభీరంగా ప్రకటించాడు.


*"గురుదేవా ! మీ నిర్ణయం. మీ ఆలోచనా రాక్షసకులానికి శాశ్వత రక్ష ! మృతసంజీవని ! మరణించిన రాక్షస వీరులు మళ్ళీ లేస్తారు. ఓహో , ఓహో ! అదే జరిగితే విజయం మన ఇంట శాశ్వతంగా విడిది చేసినట్టే !"* వృషపర్వుడు ఉత్సాహంతో అన్నాడు. 


*"ఒక హెచ్చరిక ! మృతసంజీవనితో నేను తిరిగి వచ్చేదాకా దేవతలతో యుద్ధం తలపెట్టకు సుమా ! మృతసంజీవనీ మహా విద్యతో ఈ శుక్రుడు తిరిగి వచ్చిన అనంతరం చేసే యుద్ధమే కట్ట కడపటి సురాసుర యుద్ధం కావాలి !"*


*"ఆజ్ఞ ! మీరు ఆ మహా విద్యతో తిరిగి వచ్చి ముహూర్తం నిర్ణయించినప్పుడే దేవతల మీద దండయాత్ర చేస్తాను !"* వృషపర్వుడు శుక్రుడి రెండు చేతులూ పట్టుకుంటూ అన్నాడు.


*******************************


శుక్రుడు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని మహారణ్య మధ్యంలో ఉన్న తపోభూమికి వెళ్ళాడు.


'మృతసంజీవని' కోసం గురువుగారికి వీడ్కోలు పలికిన రాక్షసులు వృషపర్వుడి నేతృత్వంలో ఉత్సవం జరుపుకున్నారు. తమ గురుదేవుల తపస్సు త్వరగా ఫలించాలని కోరుకుంటూ పూజలు చేశారు.


అనుకోని అతిధి నారద మహర్షి వృషపర్వుడి ఆస్థానానికి వచ్చాడు. గడచిన దేవదానవ సంగ్రామంలో పరాజయం ఎదురైనందున సానుభూతి వ్యక్తం చేశాడు. నారదుడు. సంభాషణా క్రమంలో శుక్రుడు 'మృతసంజీవని' కోసం వెళ్ళిన విషయం నారదుడికి తెలిసింది. కలవర పెడుతున్న విషయాన్ని కడుపులో దాచుకోలేకపోయిన నారదుడు స్వర్గలోకం దారి పట్టాడు.


*******************************

నారదుడు చేరవేసిన సమాచారం వినగానే ఇంద్రుడి ముఖం వివర్ణమై పోయింది. బృహస్పతి ఆలోచనలో పడిపోయాడు.


*"శుక్రుడి ఆలోచన బహుప్రమాదకారి , మహేంద్రా !!* బృహస్పతి ఆలోచనలు చాలించి అన్నాడు. 


*"ఆయన మృతసంజీవని సాధిస్తే మనకు మిగిలేవి రెండే. ఒకటి పరాజయం , రెండు మరణం !"* ఇంద్రుడు ఆందోళనతో అన్నాడు..


*"అత్యవసరంగా శుక్రుడి తపస్సు భగ్నం కావాలి ! దానికి అవసరమైన చర్య చేపట్టు !"* బృహస్పతి హెచ్చరించాడు..


*"వెంటనే అప్సరసలను పంపిస్తాను ! ఆ శుక్రుడి మృతసంజీవనీ తపస్సును , రససంజీవని తపస్సుగా మార్చివేయమంటాను !"* ఇంద్రుడు ఆవేశంగా అన్నాడు.


బృహస్పతి చిరునవ్వు నవ్వాడు. *"ఆత్రుత కాదు , ఆలోచన ! ఆలోచించు, అమరేంద్రా !"* 


*"గురుదేవా !"* ఇంద్రుడు ఆశ్చర్యంగా అన్నాడు.


*"సమస్యకు పరిష్కారం అనేది అనాలోచితంగా , అనాయాసంగా స్ఫురిస్తే , అందులో ప్రభావం తక్కువగా ఉంటుంది ! అనాలోచితంగా స్ఫురించే ఉపాయం అందరికీ స్ఫురించే ఉపాయమే !!.*


దేవేంద్రుడు అర్ధం కానట్టు చూశాడు. బృహస్పతి చిన్నగా నవ్వాడు.


*"అర్ధం కాలేదా ? తపోభంగం చేయడానికి అప్సరసలను వినియోగించడమనే పథకం ఆలోచించడానికి మహేంద్రుడూ , బృహస్పతీ అవసరం లేదు. ద్వారం వద్ద కాపలా ఉన్నవాడు చాలు !"* బృహస్పతి నవ్వాడు.



*"సునిశితంగా ఆలోచించి మార్గనిర్దేశం చేయడానికే గదా , తమను గురువుగా స్వీకరించాను !"* ఇంద్రుడు నవ్వుతూ అన్నాడు.


బృహస్పతి తలపంకించాడు. *"అప్సరసలను పంపితే ఏం జరుగుతుంది ? వలువల వలలో బంధించి , శృంగారంలో దించి , తపస్సును భగ్నం చేస్తారు...”*


*"మన లక్ష్యం అదే కదా , గురుదేవా ?”*


*"అది తాత్కాలిక ఫలితం మాత్రమే ! శుక్రుడు మళ్ళీ తపస్సు చేయవచ్చు. సాధించవచ్చు. మనం శాశ్వత ఫలితమిచ్చే పథకం సిద్ధం చేయాలి...”*


*"చెప్పండి !"*


*"శుక్రుడి తపస్సును భగ్నం చేయడానికి నీ పుత్రిక జయంతిని నియోగించు !"*


*"ఆచార్యా !!"*


*"ఆలకించు ! అది ఉభయతారకం ! జయంతి చక్కని చుక్క జయంతి అందానికి ఒక్కసారి ముగ్ధుడైతే చాలు , శుక్రుడు ఆమెను భార్యగా స్వీకరిస్తాడు. అప్పుడు ఏమవుతుంది ?"*


*"ఏమవుతుంది ? మీరే చెప్పండి !"* ఇంద్రుడు అన్నాడు.


*"ఆడకూతురి భర్త అల్లుడవుతాడు. అల్లుడు , సహజంగా మామగారి పక్షాన ఉండిపోతాడు శాశ్వతంగా !"* 


*"మీ ఆలోచన అద్భుతం !"* ఇంద్రుడు ఉత్సాహంగా అన్నాడు. ఏదో సందేహం అతని ఉత్సాహాన్ని మాయం చేసింది. *“ఒకవేళ ఆ శుక్రుడు మన జయంతిని పరిణయం చేసుకోకపోతే ?"*


*"అప్సరసలు సాధించేదేమిటో , అదే సాధించబడుతుంది !"* బృహస్పతి నవ్వుతూ అన్నాడు. *“భవితవ్యాన్ని సూచిస్తాను , విను మహేంద్రా ! శుక్రుడు జయంతిని పరిగ్రహిస్తాడు. దాని మూలంగా రాక్షసులు మార్గదర్శనం చేసే ఆద్యుడులేని అనాథలవుతారు. అనాథలను జయించడం అతి సులభం !”*


*"ఇప్పుడే జయంతిని పంపిస్తాను”* అంటూ ఇంద్రుడు ఉత్సాహంగా లేచాడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat