ఖడ్గమాలకు ఆ పేరు ఎందుకు వచ్చింది ? మరి 'అస్య శ్రీ శుద్ధ శక్తిమాలా మంత్రస్య' అని ఎందుకన్నారు ?

P Madhav Kumar

 ప్ర: ఖడ్గమాలకు ఆ పేరు ఎందుకు వచ్చింది ? మరి 'అస్య శ్రీ శుద్ధ శక్తిమాలా మంత్రస్య' అని ఎందుకన్నారు ? ఖడ్గమాలలోని ఆ పేర్లు ఎవరివి?

జ: ఖడ్గమాల శ్రీవిద్యకు చెందినది. తొలుత లలితాత్రిపురసుందరి నామం చెప్పబడి, అటు పై న్యాసాంగ దేవతలు, తిథినిత్యా దేవతలు, దివ్యౌఘ సిద్ధాఘ మానవౌఘ గురు మండల నామాలు; ఆ తరువాత క్రమంగా శ్రీచక్ర నవావరణ దేవతల నామాలు, నవచక్రేశ్వరీ నామాలు, చివరగా దేవీ విశేషణాలు చెప్పబడ్డాయి.

ఒకే అక్షరం గల మంత్రాలు 'పిండ' మంత్రాలనీ, రెండక్షరాలు కలవి 'కర్తరి' అనీ, మూడు నుండి తొమ్మిది అక్షరాలు కలవి 'విధి బీజముల'నీ, 10 నుండి 20 అక్షరాల వరకు కలవి మంత్రములనీ, 21 నుండి ఎన్ని అక్షరాలున్నా మాలామంత్రములనీ వ్యవహరింపబడుతాయి. ఆ కారణం చేతనే ఇది మాలా మంత్రం

15 అక్షరాల పంచదశీ (శ్రీ)విద్యను ఆధారం చేసుకుని 15 విధాల మాలా మంత్రాలు ఏర్పడ్డాయి. అవి: శుద్ధశక్తిమాల, నమోంత శక్తిమాల, స్వాహాంత శక్తిమాల. తర్పణాంత శక్తిమాల, జయాంత శక్తిమాల, శుద్ధ శివ సంబుద్ధ్యంతమాల, నమోంత శివమాల, స్వాహాంత శివమాల, తర్పణాంత శివమాల, జయాంత శివమాల, శుద్ధమిధున మాల, నమోంత మిధునమాల, స్వాహాంత మిధునమాల, తర్పణాంత మిధునమాల, జయాంత మిధునమాల.

ఇందులో ప్రసిద్ధంగా లభిస్తున్నది 'శుద్ధశక్తిమాల'. దీనిని 'ప్రకృతిమాల' అని కూడా అంటారు. ఈ మాలా మంత్రాలను వివిధ ప్రక్రియలతో ఉపాసించి కొన్ని సిద్ధులను పొందవచ్చు. పై చెప్పిన 15 విధాల మాలామంత్రాలకు 15 సిద్ధులున్నాయి. అందులో మొదటిది 'ఖడ్గసిద్ధి'. తరువాత చెప్పబడిన పదునాలుగు : పాదుకాయుగ్మ సిద్ధి, అంజన సిద్ధి, బిల సిద్ధి, వాక్సిద్ధి, దేహ సిద్ధి, లోహ సిద్ధి, అణిమాద్యష్ట సిద్ధి, వశీ కరణ సిద్ధి, ఆకర్షణ సిద్ధి, సమ్మోహన సిద్ధి, స్తంభన సిద్ధి, చతుర్వర్గ సిద్ధి, ఐహికాముష్మిక సిద్ధి, భోగ మోక్ష సిద్ధి.ఒక్కొక్క సిద్ధి కోసం ఈ మాలా మంత్రాలను వివిధ (15) విధాల వినియోగిస్తారు. 'ఖడ్గాది' 15 సిద్ధులనిచ్చే మాలా మంత్రము కనుక ఇది 'ఖడ్గమాల' అని లోకంలో ప్రసిద్ధి పొందింది.

' తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై

 అష్టాదశ మహాద్వీప సమ్రాద్భక్తా ( సమ్రాడ్భోక్తా) భవిష్యతి' - అని ప్రస్తుత లభ్య గ్రంథాలలో ఉంది.

కానీ ఈ శుద్ధశక్తిమాలను 14వ దైన ఐహికాముష్మిక సిద్ధి కోసం వినియోగించడమే మంచిదని విజ్ఞుల అభిప్రాయం. దానికి సంబంధించిన శ్లోకం :

 అలౌకికం లౌకికం చేత్యానంద ద్వితయం సదా

 సులభం పరమేశాని త్వత్పాదౌ భజతాం నృణామ్ శుద్ధశక్తిమాలను నిష్కామంతో జపించితే సర్వ (15) సిద్ధులూ లభిస్తాయని శాస్త్ర వచనం. సర్వసిద్ధులలో మొదటిది 'ఖడ్గసిద్ధి' కనుక - దానిని మొదలుకొని మిగిలిన సిద్దులను ఇచ్చే శుద్ధశక్తి మాలామంత్రాన్ని 'ఖడ్గమాల'గా వ్యవహరిస్తున్నాం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat