స్త్రీలు శివలింగార్చన చేయవచ్చ?

P Madhav Kumar


*జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సమాధానాలు :* 


 *ప్ర : స్త్రీలు శివలింగార్చన చేయవచ్చని కొందరు,చేయరాదని కొందరు అంటున్నారు. అనడానికి ప్రమాణమేదైనా ఉందా? నేను వెండిలింగాన్ని అర్చించుకొంటుం టాను. కానీ వెండి శివవీర్యోద్భవం కనుక దానిని పూజించరాదని ఒకరన్నారు. దయచేసి స్పష్టమైన సమాధానాన్ని ఇవ్వండి.* 


 *జ :* శివలింగార్చన అందరూ చేయవచ్చు. వారి వారి సంప్రదాయాలతో శివలింగ పూజ చేయవచ్చు. కేవలం 'శివాయ నమః' అనే నామంతో మొత్తం అర్చన చేసినా చాలు, ధన్యులమవుతాం.

 *బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రో వా ప్రతిలోమజః|* *పూజయేత్సతతం లింగం తత్తన్మంత్రేణ సాదరమ్ ||* *కింబహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః।* 

 *అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః||*

" బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది సర్వులూ శివలింగాన్ని, వారి వారి విధానాలతో ఆదరంగా పూజించాలి.

ఓ మునులారా!ఇన్ని మాటలెందుకు? ( పురుషులేకాక) స్త్రీలు కూడా శివారాధనకు అధికారులే. శివలింగార్చనలో అందరూ అధికారులే." - ఈ వాక్యాలు శ్రీ శివపురాణం, విద్వేశ్వర సంహిత లోని 38,39, 40 శ్లోకాలలోనివి. అయితే కొన్ని గ్రంథాలను పరిశీలిస్తే బాణలింగాన్ని మాత్రం అత్యంత నియమాలతో అర్చించాలని చెప్తున్నారు. బాణలింగం, సాలగ్రామం స్త్రీలు ఆరాధించరాదని కొన్ని గ్రంథాలలో ఉంది.

" పూర్వ సువాసీనులు స్ఫటిక లింగాన్ని పూజించవచ్చు అని శివపురాణంలో ఉంది.

 *విధవానాం ప్రవృత్తానాం స్ఫాటికం పరికీర్తితమ్ ।* 

(విద్యేశ్వర సంహిత 51వ శ్లోకం )

పార్థివలింగ పూజ అందరికీ శ్రేష్ఠమని చేప్పారు. వెండిలింగం నిషేధం కాదు. రజిత లింగార్చన ఐశ్వర్యప్రదం. వెండి, బంగారం వంటి ధాతువులు శివవీర్యోద్భవాలు - అని కొన్ని పురాణాల్లో ఉంది.

కానీ వాటిని ఆభరణాలుగా ధరించడం లేదా? కనుక శివలింగార్చనగా స్త్రీలకు వెండి నిషేధం అనడానికి ప్రమాణం లేదు.

 శివలింగార్చన చేసిన స్త్రీ భక్తులు చాలామంది పురాణాల్లోనే కనిపిస్తున్నారు.ఘశ్మ అనే భక్తురాలు ఘశ్మేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావానికి కారణమైన మహాత్మురాలు. అక్కమహాదేవి మొదలైన శివలింగార్చకులు చరిత్రలో ప్రసిద్ధి. అయితే పాదరసలింగాన్ని మాత్రం ద్విజులు ఆరాధించాలని శివపురాణం చెబుతోంది.


 *(' ఋషిపీఠం ' ప్రచురణ 'సమాధానమ్' పుస్తకం నుండి సేకరణ )*


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat