కార్తీక మాసంలో నక్తాలు - నక్త వ్రతారంభం

P Madhav Kumar


కార్తీక మాసంలో నక్తాలు ఉంటున్నాం అని కొందరంటుండటం వినిపిస్తుంటుంది.నక్తాలు ఉండటం అంటే ఉపవాసాలు ఉండటం అని అర్థం. ఉపవాసం అనే దానికి.. రోజంతా ఏమి తినకుండా , మరునాడు భోజనం చేయాలా ? ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి అనే సందేహాలు కలుగుతాయి. నక్తం అంటే రాత్రిపూట అని అర్థం. పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేయటాన్ని నక్తవ్రతమని , నక్త భోజనమని అంటారు. రాత్రిపూట తినమన్నారు కదా అని పది గంటలో , పదకొండు గంటలకో చేయకూడదు. సూర్యాస్తమయం అయి చుక్కలు కనిపించే సమయానికి చేయాలి. ఇలా చేయటం ఆరోగ్య ప్రదం. ఈ విధి విధానాన్ని తెలుసుకోకుండా ఇష్టానుసారం భోజనం చేస్తే అది వ్రత పుణ్యఫలాన్ని ఇవ్వకపోగా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ప్రమాదముంది. అందుకే.. 

పెద్దల పర్యవేక్షణలో వ్రతాలను ఆచరించటం మేలు. ఈ వ్రతం కేవలం కార్తీకంలోనే కాదూ సంవత్సరంలో అన్ని మాసాలలోనూ , కొన్ని ప్రత్యేక తిథులలో ఆచరించటం ఆరోగ్యానికి క్షేమకరమని , పుణ్యప్రదమని తెలియచెబుతోంది లింగపురాణం.


పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రమే భోజనం చేసే ఈ వ్రతాన్ని ఎందుకాచరించాలి ? అసలు ఉపవాసాలుంటూ ఏమీ తినకుండా ఉండేటప్పుడు ఎందుకు ఉద్యోగాలు చేయాలి , ధనాన్ని ఎందుకు సంపాదించాలి ? అని కొందరికి కలిగే సందేహాలకు ఈ కథా సందర్భంలో సమాధానాలు దొరుకుతాయి. గృహస్తుడు అని అంటే తానొక్కడూ తిని కూర్చోకూడదు. అతడిమీద ఎన్నెన్నో జీవులు ఆధారపడి ఉంటాయి. వాటన్నింటికీ భోజనం పెట్టటం ద్వారా తృప్తి కలిగించాకే గృహస్తుడు తినాలి. దేవతలు ఉదయం పూట , ఋషులు మధ్యాహ్నవేళ , పితృదేవతలు అపరాహ్ణవేళ , గుహ్యకులు లాంటివారు సాయంసంధ్య సమయాలలో భోజనం చేస్తారు. అందుకని వారందరికీ వారి వారి సమయాలలో ఆహారాన్ని నివేదించి.. చుక్కలు కనిపించేటప్పుడు గృహస్తుడు తినాలి. గృహస్తుడిచ్చిన ఆహారం మీద పశు పక్ష్యాదులు , సూక్ష్మ జీవులు ఆధారపడుతుంటాయి. వాటన్నింటికీ ఆహారాన్ని ఇచ్చేందుకు మనిషి ధర్మబద్ధంగా సంపాదించాలి.


నక్తవ్రతం కేవలం ఒంటిపూట ఉపవాసంతోనే ముగియదు. ఆ సందర్భంగా కొన్ని కొన్ని దానాలు , ధర్మాలు చేయాల్సి ఉంటుంది. దీని వెనుక సర్వభూతదయ అనే సామాజికాంశం కనిపిస్తుంది. 


ప్రాతఃకాలస్నానం , భస్మ , రుద్రాక్ష ధారణ , భగవన్నామ స్మరణలు , ప్రణవ శివ షడక్షర మహామంత్ర జపాలు చేయాలి. మితంగా పెసరపప్పు , బియ్యం కలిపి వండిన అన్నాన్ని భుజించి , సత్య సంభాషణలు చేస్తూ చాపమీద పడుకోవాలి.


పుష్యమాసంలో ఈ వ్రతాన్ని చేస్తే నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఈ మాసంలో రెండు పక్షాలలో వచ్చే అష్టమి తిథులు , పూర్ణిమనాడు వ్రతంచేసి , ఆవునెయ్యితో రుద్రుడికి అభిషేకించాలి. ధాన్యాన్ని శివుడికి నివేదించటం , కపిల గోవును , ఎద్దును దానం ఇవ్వటం వల్ల ఆగ్నేయాది లోకాలు ప్రాప్తిస్తాయి.


మాఘమాసంలో పెసరపప్పు , నెయ్యితో కూడిన భోజనాన్ని తినాలి. ఈ మాసంలోని చతుర్దశి , పౌర్ణమిలలో వ్రతం చేయొచ్చు. నెయ్యి , గొంగళి , నలుపురంగు ఆవు , ఎద్దులను దానం చేయటం వల్ల యమధర్మరాజు సంతుష్టుడవుతాడు. 


ఫాల్గుణ మాసంలో నెయ్యి , పాలతో వండిన పాయసాన్ని నివేదించాలి. చతుర్దశి , అష్టమి , పూర్ణిమలలో నక్తవ్రతం చేసి రుద్రాభిషేకాన్ని నిర్వహించాలి. గోమిధునాన్ని దానం చేసే వారికి చంద్రసాయిజ్యం లభిస్తుంది. 


చైత్రమాసంలో చేపడితే నిరుతిలోకం లభిస్తుంది. 


వైశాఖంలో వ్రతం చేసి తెల్లటి ఆవును , ఎద్దును దానమిస్తే అశ్వమేధ ఫలం దక్కుతుంది. 


జ్యేష్టమాసంలో నెయ్యి కలిపిన పదార్థం నివేదించి అర్ధరాత్రి వరకూ గోశాలలో గోవులకు సేవలు చేస్తూ ధూమ్రవర్ణంలో ఉన్న గోమిధునాన్ని దానం చేయాలి. 


ఆషాఢంలో చెరకు రసం నెయ్యి , పేలపిండి , ఆవుపాలను స్వీకరిస్తూ వ్రతాన్ని చేసే వారికి వరుణ లోక ప్రాప్తి కలుగుతుంది.


శ్రావణమాసంలో  అరవై రోజులలో పంట కొచ్చిన వరి ధాన్యాన్ని శివుడికి నైవేద్యం పెట్టాలి. చిత్ర వర్ణాలున్న గోమిధునాన్ని దానం ఇవ్వటం , పూర్ణిమనాడు ఆవునెయ్యితో శివుడిని అభిషేకించటం , అన్నదానం చేయటం వల్ల వాయు సాయిజ్యం లభిస్తుంది. 


ఆశ్వయుజంలో నల్లనిరంగులో ఉండే గోమిధునాన్ని దానమివ్వాలి. పున్నమినాడు రుద్రాధ్యాయంతో శివుడిని అభిషేకించి పూజిస్తే ఈశానలోకం లభిస్తుంది. 


కార్తీక మాసంలో నెయ్యితో కూడిన క్షీరాన్నాన్ని నివేదించి కపిల గోమిధునాన్ని దానమివ్వటం , అన్నదానాలు చేస్తే సూర్యలోకార్హత పొందుతారు. మార్గశిరంలో నెయ్యి , పాలతో కూడిన యవధాన్యంతో వండిన అన్నాన్ని నివేదించటం , వేద పండితులకు , దరిద్రులకు , సత్పురుషులకు పున్నమినాడు శివాభిషేకం అయిన తర్వాత భోజనాలు పెట్టడం , తెలుపు రంగుగల గోమిధునాన్ని దానమివ్వటం వల్ల సోమలోక నివాస అర్హత లభిస్తుంది.


నక్తవ్రతం అన్నిమాసాల్లోనూ చేయవచ్చంటోంది లింగపురాణం. అహింస , సత్యం , దొంగతనానికి పాల్పడకుండా ఉండటం , బ్రహ్మచర్యం , ఓర్పు , దయ , ఉదయం , మధ్యాహ్నం సాయం కాలాలలో స్నానం చేయటం , ఇలాంటివన్నీ వ్రతం వల్ల ప్రాప్తించే మంచి అలవాట్లు. శుక్ల , కృష్ణ పక్షాలలో చతుర్దశి , అష్టమి తిథులలో ఈ వ్రతాన్ని ప్రతినెలా అందరూ చేస్తూ ఉంటే సమాజంలో అశాంతి అనేదే ఉండదు అని అంటోంది లింగపురాణం.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat