ఇంట్లో దీపారాధన ఎలా చేయాలి, ఏం చేయకూడదు?
దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలాగంటే అలా చేయకూడదు. దీపారాధన చేసేముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ ఇది పద్ధతి కాదు.
దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి. వెండి కుందులు, పంచ లోహ కుందులు, ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు. కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉయోగించాలి. అంతేకానీ శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్ధతి కాదు.
కార్తీక మాసం పర్వదినాలలో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదలో నిర్వహిస్తే చాలా మంచిది. సర్వ రోగాలు, దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి.
కుందుని ఒక పళ్శెంలో కానీ తమలపాకు మీద కానీ పెట్టాలి. కింద ఆధారం లేకుండా పెట్టకూడదు. అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. అందుకు మీరు ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక అడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సాయంతో దాపారాధనని చేయాలి. అగరవత్తులు, ఏకహారతి, కర్పూర హారతి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దీపారాధన నుంచి వెలిగించకూడదు.
దీపారాధన చేయగానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి. దీప పీఠ భాగము బ్రహ్మతో సమానం. స్తంభం విష్ణు రూపం, ప్రమిద పరమేశ్వరుడని, దీపతైలం నాదం, వత్తి అగ్ని దేవుడిగాను భావన ఉంది. వెలుగు శక్తి స్వరూపం.
ఒక వత్తి దీపాన్ని చేయరాదు. ఏక వత్తి అశుభ సందర్భంలో మాత్రమే వెలిగిస్తారు. అమ్మవారి ముందు బియ్యం పోసి దాని మీద వెండి కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, పూజ చేస్తే తెలివి తేటలు, మేథస్సు పెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది. తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావని విశ్వాసం.
దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీమహాలక్ష్మికి, నువ్వుల నూనె శ్రీమహావిష్ణువు, శ్రీసుబ్రహ్మణ్య స్వామి, కొబ్బరి నూనె శ్రీమహాగణపతికి ముఖ్యమని చెబుతుంటారు. అలాగే ఆవు నెయ్యి, విప్పనూనె, వేపనూనె, ఆముదం, కొబ్బరి నూనెలు పరాశక్తికి చాలా ముఖ్యం.
ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, ఆముదం కానీ ఏదో ఒక తైలం శ్రేష్ఠం. ఎట్టి పరిస్థితుల్లో శనగనూనె వాడరాదు.
తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి. దక్షిణంవైపు దీపారాధన చేయరాదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధ కలుగుతాయి.
దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్ర్తం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి భాదలు తొలగించు కునుటకు మంచిది .
దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన శుభము. అదే ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమంతో 41 రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
Tags: దీపారాధన, దీపం, Deeparadhana, home, dharma sandesalu, deepam, deepam at home, diwali