మన ఇంట్లో పూజా మందిరాన్ని వాస్తు ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేయాలి?” అని చాలామంది అడుగుతున్నారు.
సాధ్యమైనంత వరకూ ఈశాన్యంలో కానీ, తూర్పుదిశన గానీ, ఉత్తరాన గానీ పూజగదిని ఏర్పాటుచేసుకోవాలి. తద్వారా యోగ, ధ్యానం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి. సూర్యభగవానుడి లేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. కనుక పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలంటే ఈశాన్య దిక్కునే ఎంచుకోవాలి. స్థలం బాగా ఉంటే ఇంటిమధ్యలో పూజగదిని ఏర్పాటు చేసుకోవచ్చు.
పూజ గదిని ఎప్పుడూ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేయాలి తప్ప బేస్‌మెంట్‌లో చేయకూడదు. దీనికి కారణం బేస్‌మెంట్‌లోకి వెలుతురు ప్రసరించదు. సూర్యుడి తొలి కిరణాలవల్ల లబ్దిపొందలేరు. అలాగే పూజగదిని పై అంతస్థుల్లో కూడా ఏర్పాటు చేసుకోకూడదు. అందరికీ అందుబాటులో ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళు, కదల్లేని వాళ్లుంటే వాళ్లకు తప్పకుండా సౌకర్యకరంగా ఉండాలి.
పూజగది ఏర్పాటు చేసుకోవడానికి స్థలం లేకపోతే వంటింట్లోనే ఈశాన్య దిక్కున పూజామందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అపార్ట్‌మెంట్లలో ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం కుదరదు కనుక ఇది ఉత్తమ పద్ధతి.
పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పడకగదులలో ఏర్పాటుచేసుకోకూడదు. అలాగే పూజగది బాత్‌రూంకు సమీపంలో లేకుండా జాగ్రత్త పడాలి.
నాపేరును తొలగించి తమ పేరునిందులో చేర్చి ఫార్వర్డు చేసేవారికీ, నాపేరును దీంట్లోంచి తీసేసి ఫార్వర్డుచేసి సంతోషించే వారందరికీ ఇది అంకితం.
ప్రత్యేకంగా పూజగదిని ఏర్పాటుచేసుకుంటే విగ్రహాలను ఎటువైపు పెట్టుకోవాలన్నదీ సందేహమే. విగ్రహాలను ఈశాన్యం, తూర్పు, పడమర దిక్కుల్లో పెట్టుకోవచ్చు. ప్రొద్దుటే సూర్య కిరణాలు ఈశాన్య, తూర్పు దిశ నుంచీ, సాయంకాలం పడమర నుంచీ ప్రసరించి మనలో మరింత భక్తిభావనను ప్రేరేపిస్తాయి.
గోడకు ఆనించకుండా ఒక అంగుళం దూరమైనా ఎడం ఉండేలా విగ్రహాల్ని పెట్టాలి. రెండువైపులా దీపాలను వెలిగించాలి. ఒక పువ్వు వత్తినీ, రెండువత్తులను జతజేసిన ఒక వత్తినీ ఒక్కో దీపపు కుందులో ఉండేలా చూసుకోవాలి. ఆ వత్తులను పూజ చేసుకునేవాళ్లు స్వయంగా తయారుచేసుకోవాలి. ఒక దీపం కుందులో స్వచ్ఛమైన ఆవునెయ్యినీ, మరో కుందులో స్వచ్ఛమైన నువ్వులనూనెనూ ఉపయోగించాలి. ఈ ప్రక్రియను “పాశుపతం” అంటారు. మార్కెట్లో “దీపం నూనె” పేరుతో అమ్మబడుతున్న అడ్డమైన పాపపు నూనెను వాడవద్దు.
పూజ గదిలో గంటను ఏర్పాటుచేసుకోకూడదు. పూజ గది ఆలయం కాదు కదా. అది మన వ్యక్తిగతధ్యానానికి, పూజకు ఉద్దేశించింది. పూజ గదిలో మరణించిన తాత ముత్తాతల ఫోటోలూ పెట్టవద్దు. పెద్దలకు గౌరవం చూపిస్తున్నామనే భావనతో పెడుతున్నామని అనుకుంటారు కానీ అలా చేయకూడదు.
పూజ గదిలో డబ్బు, నగలు లాంటి విలువైన వస్తువులను దాచకూడదు. పూజగది కప్పు కొద్దిగా కిందకి ఉండేలా చూసుకోవాలి. దానివల్ల గది కుదురుగా కనుపిస్తుంది. పూజ గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ఆ గదికి రెండు తలుపులున్న ద్వారాన్నే ఎంచుకోవాలి. పూజ గదికి లేత రంగులే వేయాలి. తెలుపు, లేత పసుపు లేదా లేత నీలాన్ని ఎంచుకోవచ్చు. వీలైతే పూజగదికి గడప కూడా ఉండేలా చూసుకోవాలి.
Tags: Vastu, Pooja, Puja, Pooja Room, Vastu room, Devotees, bhakthi,