ఆబోతును అచ్చుపోసి వదులుట (వృషోత్సర్గము):
కార్తీకపౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్గనము చేయుట, శివలింగం, సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మలందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకొందురు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును.
ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశము నందు ఎవ్వరు ఆబోతును అచ్చు వేసి వదులుతారా అని ఎదురు చూస్తూంటారు. ఎవడు ధనవంతుడై వుండి కూడా పుణ్య కార్యక్రమములు చేయక, దాన ధర్మలు చేయక చివరికి ఆబోతును అచ్చువేసి పెండ్లైనా చేయడొ అలాంటి వాడు రౌరవాది సకల నరకములు అనుభవించటమే కాకుండా వాని బంధువులను కూడా నరకమునకు గురి చేస్తాడు.
కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమునందు తన శక్తి కొద్ది దానము చేసి, నిష్ఠతో వ్రతమును ఆచరించి, సాయంకాల సమయమున శివ కేశవులకు ఆలయము నందు దీపారాధన చేసి ఆ రాత్రంతా జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొద్ది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహ పరములందు సర్వ సుఖములను అనుభవిస్తారు.
🍃🌷కార్తీకమాసంలో విసర్జింపవలసినవి:
ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధ బోజనమును చేయరాదు. నీరుల్లిపాయ తినరాదు. తిల దానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజుల యందు భోజనము చేయరాదు. కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. విధవ వండినది తినరాదు.ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేసేవారు ఆ రెండు రాత్రులు తప్పని సరిగా జాగరము వుడాలి. ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసంలో తైలము పుసుకొని స్నానము చేయరాదు. పురాణములను విమర్శించరాదు. కార్తీకమాసంలో వేడి నీటితో స్నానము చేస్తే కల్లుతో సమానమని బ్రహ్మ దేవుడు చేప్పివున్నడు.
ఒక వేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైన విడవకుండా కార్తీకమాస వ్రతము చేయలనుకునే వారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. అలా చేసే వారు గంగ, గోదావరి, సరస్వతి మరియు యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.
ఏ నది దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయలి. అటుల చేయని యెడల జన్మ జన్మములు నరకకూపమున బడికృశింతురు. ఒక వేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువుల నందుగాని స్నానము చేయవచ్చు.
తదనంతరం ఈ క్రింది శ్లోకమును చదువుచూ స్నానమును ఆచరించవలెను:
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ |
నర్మదా సింధుకావేరి జలేస్మిన్ సన్నిధింకురు ||
అని పఠిస్తూ స్నానము చేయవలెను. కార్తీకమాస వ్రతమును చేయు వారు పగలు పురాణ పఠనము శ్రవణము, హరికథ కాలక్షేపాలతో కాలము గడపవలెను. సాయంత్ర కాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా మందిరంలో వున్న శివుని కల్పోక్తంగా ఈ క్రింది విధంగా పూజించాలి.
🍃🌷కార్తీకమాస శివ పూజా కల్పము
1. ఓం శివాయ నమః – ధ్యానం సమర్పయామి2. ఓం పరమేధ్వరాయ నమః – ఆవాహనం సమర్పయామి
3. ఓం కైలాసవాసాయ నమః – నవరత్న సింహాసనం సమర్పయామి
4. ఓం గౌరీనాథాయ నమః – పాద్యం సమర్పయామి
5. ఓం లోకేశ్వరాయ నమః – అర్ఘ్యం సమర్పయామి
6. ఓం వృషభవాహనాయ నమః – స్నానం సమర్పయామి
7. ఓం దిగంబరాయ నమః – వస్త్రం సమర్పయామి
8. ఓం జగన్నాథాయ నమః – యజ్ణోపవితము సమర్పయామి
9. ఓం కపాలధారిణే నమః – గంధం సమర్పయామి
10. ఓం సంపూర్ణ గుణాయ నమః – పుష్పం సమర్పయామి
11. ఓం మహేశ్వరాయ నమః – అక్షతాన్ సమర్పయామి
12. ఓం పార్వతీనాథాయ నమః – ధూపం సమర్పయామి
13. ఓం తేజోరూపయ నమః – దీపం సమర్పయామి
14. ఓం లోకరక్షాయ నమః – నైవేద్యం సమర్పయామ
15. ఓం త్రిలోచనాయ నమః – కర్పూర నీరాజనం సమర్పయామి
16. ఓం శంకరాయ నమః – సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
17. ఓం భవాయ నమః – ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
ఈ ప్రకారంగా కార్తీకమాసంతా పూజించవలెను. శివ సన్నిదిన దీపారాధన చేయవలెను. అల చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తి కొద్ది బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ, తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఇలా చేస్తే నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివ కేశవుల సన్నిధిన నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృ దేవతలకు మోక్షము కలుగును.
శక్తి ఉండి కూడా ఈ వ్రతమును చేయనివారు వంద జన్మలు నానాయోనుల యందు జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుతారు.
ఈ కార్తీకమాస వ్రతమును శాస్త్రోక్త విధిగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ణానము కలుగును. వ్రతము చేసిన, పురాణము చదివిన, వినిన అటువంటి వారికి సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షప్రాప్తి పొందుతారు.
🌷ఇతి శ్రీ స్కాంధపురాణాంతర్గత, వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం చతుర్దశాధ్యాయ - పదునాల్గవ రోజు పారాయణము సమాప్తము.
ఓం నమో నారాయణాయ... ఓం నమః శివాయ...🙏🙏
