Karthika Puranam | కార్తీక పురాణం - 9వ అధ్యాయము |

P Madhav Kumar

 కార్తీక పురాణం - 9వ అధ్యాయము | విష్ణు పార్షద, యమదూతల వివాదము

"ఓ యమదూతలారా! మేము విష్ణు దూతలము. వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను"యని ప్రశ్నిచిరి. అందుకు జవాబుగా యమదూతలు "విష్ణుదూతలారా! మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధన౦జయాది వాయువులు, రాత్రి౦బవళ్లు సంధ్యకాలం సాక్షులుగా వుండి ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. 
మా ప్రభువుల వారీ కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసానకాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటివారో వినుడు.

వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును, గోహత్య , బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించినవారును, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను - గురువులను - బంధువులను - కులవృతిని తిట్టి హింసి౦చువారున్నూ, జీవహింస చేయు వారున్నూ దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును, జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారును, యితరుల ఆస్తిని స్వాహా చేయు వారును,
శిశుహత్య చేయువారును, శరణన్నవానిని కూడా వదలకుండా బాధించు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులును, పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారునూ పాపాత్ములు
. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండి౦పుడని మా యమధర్మరాజు గారి యాజ్ఞ. అది అటులుండగా ఈ అజామిళుడు బ్రాహ్మణుడై పుట్టి దురచారములకులోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి, కామాంధుడై వావివరసలులేక, సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణు లోకమునకు యెట్లు తీసుకొని పోవుదురు?" అని యడగగా విష్ణుదూతలు "ఓ యమకి౦కరులారా! మీరెంత యవివేకులు? మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు లెట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జప దాన ధర్మములు చేయువారును - అన్నదానము, కన్యాదానము, గోదానము , సాలగ్రామ దానము చేయువారును, అనాధప్రేత సంస్కాములు చేయువారును, తులసి వనము పెంచువారును, తటాకములు త్రవ్వి౦చువరును, శివకేశవులను పూజి౦చువారును సదా హరి నామస్మరణ చేయువారును మరణ కాలమందు 
'నారాయణా'యని శ్రీ హరిని గాని, 'శివ' అని శివుని గాని స్మరించువారును, తెలిసిగాని తెలియక గాని మరే రూపమునగాని హరి నామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు! కాబట్టి అజామిళుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున 'నారాయణా' అని స్మరించుచూ చనిపోయెను గాన, మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము" అని పలికిరి.
అజామిళుడు విష్ణుదూతల సంభాషణలాలకించి ఆశ్చర్యమొంది "ఓ విష్ణుదూతలారా! పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీ మన్నారాయణ పుజగాని, వ్రతములుగాని, ధర్మములుగాని చేసి యెరుగను. నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై, నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారునియందున్న ప్రేమచో 'నారాయణా' యని నంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు.
ఆహా! నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లితండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది" అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ! తెలిసిగాని, తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో, అటులనే శ్రీహరిని స్మరించిన యెడల సకల పాపములును నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికినీ నిజము.


ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి నవమాధ్యాయము - తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat