కేశవ అని నిన్ను వాసిగ భక్తులు
వర్ణింపుచున్నారు మేలుకో,
వాసవవందిత వసుదేవ నందన
వైకుంఠవాసుడ మేలుకో కృష్ణా మేలుకో
నారాయణ నిన్ను నమ్మిన భక్తుల
కరుణబ్రోతువు వేగ మేలుకో,
శరణన్న రక్షణ బిరుదు నీకున్నది
శశిధరసన్నుత మేలుకో కృష్ణా మేలుకో
మాధవ అని నిన్ను యాదవులందరు
మమత చెందుచున్నారు మేలుకో,
చల్లని చూపుల తెల్లని నామము
నల్లని నాస్వామి మేలుకో కృష్ణా మేలుకో
గోవింద అని నిన్ను గోపికలందరు
గొల్లవాడందురు మేలుకో,
గోపీమనోహర గోవర్ధనోద్ధార
గోపాలబాలుడ మేలుకో కృష్ణా మేలుకో
విష్ణురూపము దాల్చి విభవము దర్శించ
విష్ణుస్వరూపుడ మేలుకో
దుష్టసంహారక దురితము లెడబాపు
సృష్టి సంరక్షణ మేలుకో కృష్ణా మేలుకో
మధుసూదన నీవు మగువతో డుత గూడి
మరచి నిద్రించేవు మేలుకో,
ఉదయార్క బింబము ఉదయించు వేళాయె
వనరుహలోచన మేలుకో కృష్ణా మేలుకో
త్రివిక్రమాయని శక్రాదులందరు
విక్రమమందురు మేలుకో,
శుక్రాదిగ్రహములు సుందరరూపము
చూడగోరుచున్నారు మేలుకో కృష్ణా మేలుకో
వామన రూపమున భూదానమడిగిన
పుండరీకాక్షుడ మేలుకో,
బలిని నీ పాదమున బంధన చేసిన
కశ్యపనందన మేలుకో కృష్ణా మేలుకో
శ్రీధర, గోవిందా, రాధామనోహర
యాదవకులతిలక మేలుకో,
రాధావధూమణి రాజిల్కనంపింది
చూడబోతువుగాని మేలుకో కృష్ణా మేలుకో
హృషీకేశ భువియందలి ఋషులందరు
వచ్చికూర్చున్నారు మేలుకో,
వచ్చినవారికి వరములు కావలె
వైకుంఠవాసుడ మేలుకో కృష్ణా మేలుకో
పద్మనాభ నీదు పత్ని భాగాదులు
వచ్చికూర్చున్నారు మేలుకో,
పరమతారకమైన పావన నామము
పాడుచు వచ్చిరీ మేలుకో కృష్ణా మేలుకో
దామోదరాయని దేవతలందరు
దర్శింపవచ్చిరి మేలుకో,
భూమి భారము మాన్ప బుధుల బ్రోవనురావే
భూకాంత రమణుడా మేలుకో కృష్ణా మేలుకో
సంకర్షణ నీవు శత్రుసంహార మొసగ
సమయమైయున్నది మేలుకో,
పంకజాక్షులు నీదు పావన నామము
పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణా మేలుకో
వాసుదేవా నీకు సురపత్నులు
భుజియింపదెచ్చిరి మేలుకో,
భాసురంబుగ యాగ సంరక్షణకొరకు
వర్ణింపుచున్నారు మేలుకో కృష్ణా మేలుకో
ప్రద్యుమ్నారూపుడ అర్జునవరదుడ
దుర్జనసంహార మేలుకో,
అబ్జవంశమునందు ఉద్భవించిన కుబ్జ
నాదరించిన దేవ మేలుకో కృష్ణా మేలుకో
అనిరుద్ధ యని నిన్ను అబ్జభవాదులు
అనుసరింపవచ్చిరి మేలుకో,
అండజ వాహన అబ్ధిసంహరణ
దర్భశయన వేగ మేలుకో కృష్ణా మేలుకో
పురుషోత్తమాయని పుణ్యఅంగనలంతా
పూజలు చేతురు మేలుకో,
పురుహూతవందిత పురహారమిత్రుడ
పూతన సంహార మేలుకో కృష్ణా మేలుకో
అధోక్షజ నిన్ను స్మరణ జేసినవారి
దురితము లెడబాప మేలుకో,
వరుసతోడుత నిన్ను స్మరణ చేసినవారికి
వందన మొసగెద మేలుకో కృష్ణా మేలుకో
నారసింహ నిన్ను నమ్మిన భక్తుల
కరుణబ్రోతువు వేగ మేలుకో,
శరణన్న రక్షణ బిరుదు గల్గిన తండ్రి
శశిధరసన్నుత మేలుకో కృష్ణా మేలుకో
అచ్యుతయని నిన్ను సత్యముగా
ప్రదవిధుల కొనియాడవచ్చిరి మేలుకో,
పచ్చని చేలము అచ్చంగా దాల్చిన
లక్ష్మీ మనోహర మేలుకో కృష్ణా మేలుకో
జనార్దనా నీవు శత్రు సంహారమొసగ
సమయమైయున్నది మేలుకో,
పంకజాక్షులు నీదు పావన నామము
పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణా మేలుకో
ఉపేంద్రయని నిన్ను యువిదలందరుగూడి
యమునాతీరమందున్నారు మేలుకో,
గోపకాంతలు నీదు రాక గోరుచున్నారు
మురళీనాదవినోద మేలుకో కృష్ణా మేలుకో
హరహరి యని నిన్ను కొనియాడగోపిక
జనులంతావచ్చిరి మేలుకో,
అష్టభార్యలు నీదు రాక గోరుచున్నారు
వనమాలికాధర మేలుకో కృష్ణా మేలుకో
శ్రీకృష్ణ యని నిన్ను గోపాలబాలురు
బంతులాడవచ్చిరి మేలుకో,
కాళంగి మర్దన కౌస్తుభ మణిహార
కంస సంహరణ మేలుకో కృష్ణా మేలుకో
శ్రీరామ యని మునులు స్థిర భక్తితో నిన్ను
సేవింపుచున్నారు మేలుకో,
తాటక సంహార ఖరదూషణాంతక
కాకుత్త్స కులరామా మేలుకో కృష్ణా మేలుకో
తెల్లవారవచ్చే దిక్కులు తెలుపొందే
నల్లని నా స్వామి మేలుకో,
వేళాయె గోవుల మందకు బోవలె
గోపాలబాలుడా మేలుకో కృష్ణా మేలుకో