దేవతలు బ్రహ్మాండము బయటికి వెళ్ళి దాని కొరకు ఒక యజ్ఞము చేయాలని హిమాలయపర్వతముల మీద ఒక యజ్ఞప్రాంగణము ఏర్పాటు చెయ్యాలనుకున్నారు. భండుడికి ఎందరో గూఢచారులు ఉన్నారు. వాడు ఎక్కడ ఎవరు ఎలా కదిలినా పసికడతాడు. ఏమి చెయ్యాలని ఆలోచన చేసారు. శ్రీమహావిష్ణువు – ‘భండుడికి ఇతరులు భోగములు అనుభవించకూడదు, తానే అనుభవించాలని కోరిక కనక ఇంతకముందు వాడు కనీ వినీ ఎరుగని ఇద్దరు కాంతలను సృష్టించి వాడి దగ్గరకు పంపి వాడు వారితో రతికేళిలో మునిగి తేలుతూ ఉండగా మనము నిశ్శబ్దముగా ఎవరికీ తెలియకుండా హోమగుండము ఏర్పాటు చేద్దామ’ ని దేవతలను వెంట పెట్టుకుని బ్రహ్మాండము అంచు దగ్గరకు తీసుని వెళ్ళారు. బ్రహ్మాండము బయటకు వెళ్ళి అవతల ఉన్నవారిని ఆహ్వానించాలి. దేవతలు బ్రహ్మాండమునకు ఒక రంధ్రము చేసి వెళితే బయట ఎన్నో కోట్లబ్రహ్మాండములు ఉన్నాయి. ఎవరిని పిలవాలి? ఎవరు వచ్చి రక్షిస్తారు? పిలిస్తే వచ్చి శక్తిపుట్టేట్టుగా అనుగ్రహించే శంభుదేవుడిని ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా పలుకుతాడని దేవతలు శంభుదేవుని ఈ విధముగా ప్రార్థన చేసారు.
జయఫాల నయన! శ్రితలోలనయన! శీతశైలశయన ! శర్వా !
జయ కాలకాల! జయమృత్యుమృత్యు ! జయ దేవదేవ శంభో!
జయ చంద్రమౌళి ! నమదింద్రమౌళి మణిసాంద్రహేళి చరణా !
జయ యోగ మార్గ జితరాగదుర్గ ముని యాగ భాగ! భర్గా !
జయ స్వర్గవాసి మతివర్గ భాసి ప్రతి సర్గ సర్గ కల్పా !
జయ బంధు జీవ సమబంధు జీవ సమసాంధ్య రాగ జూటా !
జయ చండ చండతర తాండవోగ్ర భర కంపమాన భువనా !
జయ హార హీర ఘనసార సారతర శారదాభ్ర రూపా !
జయ శృంగి శృంగి శ్రుతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతీ
జయ కాలకంఠ కలకంఠ కంఠసుర సుందరీ స్తుత శ్రీ !
జయ బావ జాత సమ ! భావజాత సుకళాజిత ప్రియాహ్రీ !
జయ దగ్ద భావ భవ ! స్నిగ్ధ భావ! భవ ! ముగ్ధ భావ భవనా !
జయ రుండమాలి ! జయ రూక్ష వీక్ష ! రుచిరుంద్ర రూప ! రుద్రా!
జయనాసికాగ్ర నయనోగ్ర దృష్టి జనితాగ్ని భుగ్న విభవా !
జయ ఘోర ఘోరతర తాప జాప తప ఉగ్ర రూపవిజితా !
జయ కాంతిమాలి ! జయ క్రాంతికేలి జయ శాంతిశాలి ! శూలీ !
జయ సూర్య చంద్ర శిఖి సూచనాగ్ర నయలోచనాగ్ర ! ఉగ్రా!
జయ బ్రహ్మ విష్ణు పురుహుత ముఖ్య సురసన్నుతాంఘ్రి యుగ్మా !
జయ ఫాలనేత్ర ! జయ చంద్రశీర్ష ! జయ నాగభూష ! శూలీ !
జయ కాలకాల ! జయ మృత్యుమృత్యు ! జయ దేవదేవ ! శంభో !
పరమశివుని యొక్క గుణములు అన్నీ ఆవిష్కరిస్తూ దేవతలు చేసిన ప్రార్థన విని పరమశివుడు అక్కడకు వచ్చి మీకు కలిగిన ఆపద తీరాలి అంటే లలితాపరాభట్టారిక ఆవిర్భవించాలి. అందుకొరకు ఒక మహాయజ్ఞము చెయ్యాలి. శ్రీ మహావిష్ణువు భండుని మోహములో పడవెయ్యడానికి ఇప్పటికే ఇద్దరు కన్యలను సృష్టించారు. నిశ్శబ్దముగా హిమాలయ ప్రాంతమునకు వెళ్ళి హోమము చేద్దాము అన్నాడు.
పెద్ద యజ్ఞకుండము తయారు చేసారు. అందులో అగ్నిరగిల్చి హవిస్సులు వేసి అమ్మవారిని పిలవాలి. భండుడు తెచ్చిన ఉపద్రవమునకు అగ్నిహోత్రము ప్రతిష్ఠించడానికి ఈ బ్రహ్మాండములో ఉన్న అగ్నిపనికిరాదు. శంభుదేవుడు –‘మనకి ఉండే గార్హపత్యాగ్ని, ఆవహనీయాగ్ని, దక్షిణాగ్ని పనికిరావు. బ్రహ్మాండమునకు చేసిన రంధ్రమునుంచి చిదగ్ని అనే అగ్నిని వాయురూపములో తీసుకుని వచ్చి ఆ వాయువును అగ్నికుండములో పెట్టి హవిస్సులు ఇవ్వడానికి అగ్ని రగిలిస్తాను. సామాన్యమైన పదార్థములు వేస్తే యజ్ఞముతో ప్రీతి చెందడానికి చాలాకాలం పట్టవచ్చు. భండుడు మేల్కొనే లోపల అమ్మవారి ఆవిర్భావము జరిగిపోవాలి. ఆర్తి ప్రకటనము జరిగి తొందరగా రావాలి. మీ శరీరభాగములను ఖండించి హవిస్సుగా సమర్పించండి. దేవతలు కనక మీ శరీర భాగములను కోసినంత మాత్రమున మీకు మృత్యువు రాదు. ఆర్తి ప్రకటనము జరిగి అమ్మవారు ఆవిర్భవిస్తుంది అన్నాడు. ‘అమ్మా ! నువ్వు ఆవిర్భవించాలి’ అని దేవతలందరితో కలిసి శంభుదేవుడు ప్రార్థన చేసాడు.
విశ్వరూపిణీ ! సర్వాత్మే! విశ్వభూతైక నాయకి ! |
లలితాపరమేశాని ! సంవిద్వహ్నే స్సముద్భవ ! ||
అనన్గరూపిణీ పరే ! జగదానందదాయిని ! |
లలితాపరమేశాని ! సంవిద్వహ్నే స్సముద్భవ ! ||
జ్ఞాత్వ జ్ఞాన జ్ఞేయ రూపే ! మహాజ్ఞాన ప్రకాశిని |
లలితాపరమేశాని ! సంవిద్వహ్నే స్సముద్భవ ! ||
లోకసంహార రసికే ! కాళికే ! భద్రకాళికే ! |
లలితాపరమేశాని ! సంవిద్వహ్నే స్సముద్భవ ! ||
లోకసన్త్రాణరసికే ! మంగళే ! సర్వ మంగళే !
లలితాపరమేశాని ! సంవిద్వహ్నే స్సముద్భవ ! ||
విశ్వసృష్టి పరాదీనే ! విశ్వనాథే ! విశఙ్కటే !
లలితాపరమేశాని ! సంవిద్వహ్నే స్సముద్భవ ! ||
సంవిద్వహ్ని హుతాశేష సృష్టి సమ్పాదితాకృతే ! |
లలితాపరమేశాని ! సంవిద్వహ్నే స్సముద్భవ ! ||
భణ్డాద్వైస్తారకాద్యైశ్చ పీడితానాం సతాం ముదే ! |
లలితాపరమేశాని ! సంవిద్వహ్నే స్సముద్భవ ! ||
దేవతలు తమ శరీరఖండములనుకోసి హోమకుండములో వేస్తూ అమ్మవారిని ప్రార్థన చేస్తుంటే కంటితో చూడడానికి వీలుకాని పరబ్రహ్మస్వరూపిణి, మణిద్వీపములో కూర్చుని అన్ని బ్రహ్మాండములను శాసించకలిగి, కోట్ల బ్రహ్మాండములకు నాయకురాలయిన అమ్మవారు అనుగ్రహము కలిగి, ఈ బ్రహ్మాండములో హిమాలయ పర్వతముల మీద ఏర్పాటు చేసిన హోమకుండములోని చిదగ్నినుంచి అమ్మవారి ఆవిర్భావము ప్రారంభము అయింది. అమ్మవారు ఆవిర్భవిస్తున్న స్వరూపమును దేవతలు ప్రార్థన చేసారు. ఆవిర్భవించిన తరవాత ఏమి జరిగిందన్నది లలితాసహస్రనామ పూర్వభాగములో వివరణ ఇచ్చారు. దేవతా సైన్యములను, వారాహిని, శ్యామలాదేవిని, బాలాదేనిని, ఏనుగులను, గుఱ్ఱములను, సృష్టి చేసి, తనభర్తను మహా కామేశ్వరుడిగా స్వీకరించి, ఎలా యుద్ధము చేసింది? భండుని ఎలా చంపింది ? అన్న విషయములు తరవాత భాగములో వస్తాయి. దేవతలు భండాసురుని సంహరించిన తరవాత ప్రసన్నతను పొందారు.🙏