‘శ్రీమత్సింహాసనేశ్వరి’
ఆకలివేసి అందరికీ తినడానికి దొరికి, తిన్నతరవాత అది జీర్ణమవడానికి, ఇంట్లోవాళ్ళు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోకుండా సంతోషముగా ఉన్నారు అంటే సింహాసనములో ఉన్న పరమాత్మ ప్రసన్నుడై పరిపాలిస్తున్నాడు అని. అమ్మవారు ఒక్కతే నిజమైన సింహమును ఆసనముగా చేసుకుని సింహవాహన అయింది. ఆవిడ సింహమును అధిరోహించే యుద్ధములు చేసింది. అది మామూలు సింహము కాదు పెద్ద పెద్ద రాక్షసులను పంజాతో కొట్టి చంపేస్తుంది. యుద్ధభూమిలో సింహము పరిగెడుతుంటే రథముమీద వెళ్ళినట్టుగా ఉండదు. సింహపు వేగమునకు ఒరిగిపోకుండా, తాను కూడా కదులుతూ ఉగ్రముగా కూర్చుని రాక్షసులను చంపుతుంది. దేవతలు –
అయిగిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే
గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే |
సింహము మీద కూర్చుని మహిషాసుర సంహారము చేసినప్పుడు తల్లిని చూసి కీర్తించారు. ఉగ్రముగా ఉన్న అమ్మను ఉపాసన చెయ్యడము భయము కాదు. ఆవిడ శత్రువులను చంపుతుంది. ఆ తల్లిని ఉపాసన చెయ్యడము వల్ల భక్తులపట్ల ప్రసన్నురాలు అవుతుంది. సింహాసనములో ఉన్న తల్లికి భయపడి లోకములో పరిపాలన అంతా జరుగుతున్నది. అమ్మవారి ఆజ్ఞకు భయపడి వాయువు వీస్తున్నది, నీరు ప్రవహిస్తున్నది. ఆ తల్లికి భయపడి భూమి తిరుగుతున్నది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అగ్ని వేడిగా ఉన్నది.
సింహ శబ్దమును అటు ఇటు మారిస్తే హంసి అవుతుంది. హంస అనగా మెల్లగా నడవవలసినది. నడకకు ప్రసిద్ధి హంస. పరమహంసలు జగత్తును బ్రహ్మమును వేరు చేసి చూస్తారు. యోగనిష్ఠలోకి ప్రవేశించేవారు ఊపిరిని చాలా మెల్లగా పీల్చి మందముగా విడచిపెడుతూ ఉంటారు. ఊపిరి రూపములో ఒకావిడ లోపలికి, బయటికి హంసనడకతో మెల్లగా నడుస్తూ తిరుగుతున్నది. హృదయగుహలో శ్రీమత్సింహాసనేశ్వరి కూర్చుని ఉన్నంతసేపు హంస తిరుగుతూ ఉంటుంది. ఆవిడ లేచింది అంటే హంస తిరగడము ఆగిపోతుంది. ఆవిడ ఉండటమే శోభ. లలితా సహస్రము చదువుతూ శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరి అని ఊపిరి పీల్చేసరికి మనలోనే ఉన్న ఆవిడ పాదపద్మముల దగ్గరకే ఈ ఊపిరి వెళ్ళి వస్తున్నది అన్న భావన కలిగితే తరవాత నామము జ్ఞాపకమునకు రాదు. మనసు లోపలకు వెళ్ళి ఈ దర్శనము మొదలు పెట్టిందని గుర్తు. స్తోత్రం చదవడము ఆగిపోతుంది. అలా ఆగిపోతే నిజముగా లలితాసహస్రనామము చదివారని గుర్తు. అర్థమయి చదవడము అంటే దర్శనము పొందడము. ఏ నామము దగ్గర అనుభవించి రమించి ఆగిపోతే అక్కడ జన్మధన్యము అయిపోతుంది. పంచభూతములలోనుంచి వచ్చి మళ్ళీ పంచభూతములలోకి వెళ్ళిపోవడమునకు మధ్యలో ఉన్నసంధికాలమే జీవితము. వెళ్ళిపోయేట్టుగా చేసే శక్తిని ‘యత్ప్రయంతపి తనిష్వంతి’ సంహారప్రక్రియ అంటారు. పిపీలికాది పర్యంతము అనేక ప్రాణులు పుట్టి వెళ్ళిపోతుంటాయి. ఒక ప్రాణి పంచభూతములలో కలసిపోవడము కూడా కదలికయే. ఈశ్వరుని చేరిపోవడమే మనిషి జీవితములో ప్రధానలక్ష్యము. సింహ అన్న శబ్దమునకు హింసించునదని అర్థము. ప్రళయకాలములో తనను పొందకుండా ఉండిపోయిన జీవులను అమ్మవారు తానే పొందుతుంది అదే సింహాసనేశ్వరి. ఐదింటితో సింహాసనము అని తల్లిని చెపితే ఆ ఐదు శాక్తేయ ప్రణవములు అన్నారు. ‘శ్రీం హ్రీం క్లీం ఐం సౌః’ అన్న బీజాక్షరముల మీద కూర్చుంటుంది. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం నాలుగుదిక్కుల మధ్యలో పంచభూతములైన పృథ్వి ఆపస్ తేజో వాయు ఆకాశములు ఐదూ సింహాసనముగా అమ్మవారు కూర్చున్న ప్రదేశమే అంతటా నిండిపోయిన ఆవిడ సింహాసనము. పంచముఖములు కలిగిన సద్యోజాత, అఘోర, తత్పురుష, వామదేవ, ఈశానములనే అయిదు ముఖములతో అయిదు క్రియలు చేసే తత్త్వాన్ని అధిరోహించి పంచప్రేతాసీనయి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులనే నాలుగు కోళ్ళు గల తల్పము ఉన్న సింహాసనము మీద కూర్చుని ఉంటుంది. ఇన్ని విధములుగా ఆవిడ శ్రీమత్సింహాసనేశ్వరి.🙏
🙏 శ్రీ మాత్రే నమః 🙏