*శ్రీదేవీభాగవతము - 42*

P Madhav Kumar


*చతుర్థ స్కంధము - 02*

                     

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 42*


*భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా!*

*శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 

 

*జనమేజయుని సందేహాలు*

*వ్యాసుడు చేసిన కర్మ ప్రబోధం* చదువుకున్నాము.


*అమ్మ దయతో......*  ఈ రోజు  

*దేవకీ వసుదేవుల జన్మవృత్తాంతము*

*జనమేజయుని సందేహాలు*

*అందరికందరే - వ్యాసుడు*

చదువుకుందాం.

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🙏 *దేవకీ వసుదేవుల జన్మవృత్తాంతం* 🌹


ఒకప్పుడు కశ్యపుడు (బ్రహ్మదేవుడి మనుమడు) యజ్ఞం చేస్తూ వరుణుడి గోవును అపహరించి తెచ్చాడు. అతడు వచ్చి ఎంత బతిమాలినా తిరిగి ఇవ్వలేదు. దానితో వరుణుడికి కోపం వచ్చింది. మానవజన్మ ఎత్తి భూలోకంలో గోపాలుడుగా జీవించమని శపించాడు. నీ భార్యలిద్దరూ నీతో పాటే మానవజన్మలు ధరిస్తారు. ఆవుకి దూరమై మా దూడలు విలపిస్తున్నాయి. అలాగే నీ భార్యలూ పుత్రశోకంతో విలపిస్తారు అని వరుణుడు శపించి రుసరుసలాడుతూ వెళ్ళి విషయమంతా బ్రహ్మదేవుడికి విన్నవించాడు. బ్రహ్మదేవుడు కశ్యపుడిని (మనుమడిని) పిలిపించి, వరుణుడి గోవును అపహరించినందుకు నిందించి, పరమదారుణమూ సర్వపాప కారణమూ అయిన లోభగుణాన్ని వదులుకోమని హితవు చెప్పి, మర్యాదా రక్షణ కోసం తానూ అలాగే శపించాడు. భార్యలిద్దరితోనూ భూలోకంలో అంశావతారంగా జన్మించి యదువంశంలో గోపాలుడిగా జీవించమన్నాడు. అలాగే - *కశ్యపుడు వసుదేవుడుగా, అతడి భార్య అదితి - దేవకీదేవిగా, మరొక భార్య సురస - రోహిణీదేవిగా జన్మించారు.*


కశ్యపుడి భార్యలలో దితి - అదితులిద్దరి మధ్యా సవతి పోరు ఎప్పుడూ సాగుతూ ఉండేది. ఒక సంఘటనతో మనసు కష్ట పెట్టుకున్న ఎదిగి తన సవతి అదితికి (వీరిద్దరూ దక్షప్రజాపతి కూతుళ్ళు) శాపం ఇచ్చింది. నీకు పుట్టిన పుత్రులు ఏడుగురివరకూ పుట్టినవాడు పుట్టినట్టు చనిపోతాడు - అని శపించింది.


ఇలా శపించడానికి దారితీసిన సంఘటన ఏమిటా అని అడగబోతున్నావు కదూ. అదే చెబుతున్నాను. అది చాలా భయంకరమైన సంఘటన. ఈర్ష్యాసూయలు ఎంతటి పాపానికైనా ఒడికట్టిస్తాయనడానికి నిదర్శనం. విను.


దితికన్నా ముందే కడుపుపండి అదితికి ఒక మగబిడ్డ జన్మించాడు. అతడే ఇంద్రుడు. అమిత తేజోబలశాలి. సురనాయకుడు. దితికి కడుపుమండింది. భర్తను వేడుకొంది. ఇంద్రుడికి అన్ని విధాలా సాటివచ్చే కొడుకుని అనుగ్రహించమని అర్థించింది. కశ్యపుడు అంగీకరించాడు. వ్రతం ముగిసేసరికి ఇంద్రసమానుడైన కొడుకు జన్మిస్తాడని అభయం ఇచ్చాడు. ఆమె గర్భంలో తన వీర్యాన్ని నిషిక్తం చేశాడు. గర్భిణిగా ఉన్నప్పటికీ నేలమీద పడుకోవడం శుచిని పాటించడం మొదలైన ప్రతనియమాలను నిష్ఠతో ఆచరించింది దితి. నెలలు నిండుతున్న కొద్దీ ఆమెలో ఒక తేజస్సు అతిశయిస్తూ వచ్చింది.


ఇది గమనించిన అదితికి అసూయ కలిగింది. తన కొడుకుతో సాటివచ్చే కొడుకు, తన సవతికి జన్మించబోతున్నాడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఒకరోజున ఇంద్రుణ్ణి పిలిచి దుర్బోధ చేసింది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే శత్రువుని సంహరించి ఉత్పత్తినే అడ్డుకొని సుఖపడమని ఉపదేశించింది. పుట్టి పెరిగి బలపడ్డాక కష్టపడి సంహరించడంకన్నా ఇది తేలిక పనికదా, ఆలోచించమంది.  శత్రువు అంకురించాడు అంటే క్షయరోగంలా వృద్ధి పొందుతాడు. వ్యాపిస్తాడు. తెలుసుకో, అప్పుడు అదుపు చెయ్యడం అసంభవం. కనక ఇప్పుడే మేలుకో. నా హృదయాన్ని ఇనపమేకులా హింసిస్తున్న దితి గర్భాన్ని ఏదో ఒక ఉపాయంతో వెంటనే ఛేదించు. నాకు మనశ్శాంతిని ప్రసాదించు.


కన్నతల్లి ప్రబోధాన్ని ఆలకించాడు. ఇంద్రుడు. తన అవసరాన్ని గుర్తించాడు. సరే అని బయలుదేరాడు. సవతితల్లి దగ్గరకు వెళ్ళాడు. సవినయంగా భక్తితో పాదాభివందనం చేశాడు.


*అమ్మా !* ఎంత నీరసంగా ఉన్నావో చూడు. అసలే వట్టి మనిషివి కావు. పైగా ఈ వ్రతనియమాలు ఒకటి. చూస్తూ ఊరుకోలేక, నీకు ఏదైనా ఇంత సేవ చేద్దామనిపించి ఇలా వచ్చాను. చెప్పమ్మా, ఏమి చెయ్యమంటావో. నువ్వు పరమ పతివ్రతవు. నీ పాద సేవచేస్తే నాకింత పుణ్యమూ పురుషార్థమూను. గురుశుశ్రూషవల్ల ఉత్తమగతులు లభిస్తాయంటారు. నిజం చెబుతున్నాను. నీకూ మా అమ్మకూ నా దృష్టిలో భేదం లేదు. ఒట్టు - అంటూ ప్రక్కనే కూర్చుని కాళ్ళు పిసకడం మొదలు పెట్టాడు.


ఆ పిచ్చితల్లి ఈ మాటలు విశ్వసించింది. బాగా నీరసపడి ఉందేమో, ఇంద్రుడు కాళ్ళు పడుతూంటే హాయిగా ఆదమరచి నిద్రపోయింది. ఇదే అదను అనుకొన్న ఆ ఇంద్రుడు యోగ విద్యాబలంతో సూక్ష్మరూపం ధరించి దితి గర్భంలోకి ప్రవేశించాడు. తన వజ్రాయుధంతో గర్భ శిశువును ఏడు ముక్కలుగా ఖండించాడు. శిశువు దారుణంగా విలపిస్తూంటే ఒకవైపు ఊరడిస్తూనే ఏడు ముక్కలనూ మళ్ళీ రెండేసి ముక్కలుగా తరిగిపోసి ఇవతలికి వచ్చాడు. (పధ్నాలుగు ముక్కలూ పధ్నాలుగుమంది మరుత్తులయ్యారు).


గర్భకోశంలో జరుగుతున్న గందరగోళానికి దితి మేల్కొంది. దారుణంగా విలపించింది. తల్లీ కొడుకులు చేసిన వయవంచనను గ్రహించింది.


కోపావేశంతో ఇద్దరినీ శపించింది. ఇంద్రుడి త్రిలోకాధిపత్యం నశించుగాక. నా గర్భస్థ శిశువును ఏడు ముక్కలు చేయించింది కనక అదితి సంతానం పుట్టగానే ఏడుగురు నశింతురుగాక. కారాగారదుఃఖం అనుభవించుగాక, పుత్రశోకంతో కృశించుగాక అని శపించింది.


అప్పటికి కశ్యపుడు అక్కడికి వచ్చి మరింక శాపాలు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. ప్రేమగా లాలనగా ఓదార్చాడు. కళ్యాణీ ! చాలు ఇక శపించకు.  కోపాన్ని నిలువరించుకో. నీ గర్భస్థ శిశువు పధ్నాలుగు ఖండాలు అయ్యాడు. కనక పధ్నాలుగుమంది మరుత్తులు అవుతారు. ఇంద్రుడితో సమస్కంధులు అవుతారు. అతడికి పరమమిత్రులుగా మెలగుతారు. ఇరవైయెనిమిదవ ద్వాపరంలో అంశావతారంగా మానవజన్మ ఎత్తి అదితి నీ శాపాన్ని అనుభవిస్తుంది. వరుణుడు కూడా మొన్న నా మిద అలిగి ఇలాంటి శాపమే ఇచ్చాడు. ఈ ఇద్దరి శాపాలవల్లా మేమిద్దరమూ మానుషజన్మ ఎత్తుతాము.


ఈ ఓదార్పుమాటలకు దితి సంతృప్తి చెందింది. మరింకేమి మాట్లాడకుండా దుఃఖాన్ని దిగమింగుకుంది.


*జనమేజయా !* శాపకారణం విన్నావుగా. కశ్యపుడు యదువంశంలో వసుదేవుడుగా జన్మించాడు. అదితి దేవకీదేవిగా జన్మించింది.


*(అధ్యాయం - 3, శ్లోకాలు - 55)*


🌈  *జనమేజయుడి ధర్మ సందేహాలు* 💐


ఈ కథ విన్న జనమేజయుడికి మతిపోయింది. ఏది ధర్మం, ఏది అధర్మం ? ఎవరిని నమ్మాలి? ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ? - అంతా అగమ్యగోచరంగా కనిపించింది.


*మహానుభావా ! మహామతీ ! వ్యాసమహర్షి!* చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు చెప్పిన ఈ వృత్తాంతం. ఈ సంసారమంతా (సృష్టి) ఒక పెద్ద పాపకూపం. దీని బంధనాలనుంచి ఎవడూ తప్పించుకోలేడు. కశ్యపుడంతటివాడు దిక్పాలకుడి గోవును అపహరించాడు. త్రిలోకాలకూ అధిపతి అయ్యుండి అతడి కొడుకు దేవేంద్రుడు ఇంతటి జుగుప్సితం చేశాడు. గర్భంలో ప్రవేశించి పిండాన్ని ఖండఖండాలు చెయ్యడం పరమదారుణం కదూ ! పైగా, సేవకోసం వచ్చానని ఒట్టువేసి మరీ చెప్పి, నమ్మించి మోసం చెయ్యడం, గర్భశోకాన్ని కలిగించడం ఎంత దారుణం ! ధర్మానికి శాసకుడూ ముల్లోకాలకూ రక్షకుడూ అయిన ఇంద్రుడే ఇంతటి నీచానికి ఒడికట్టాడంటే ఇంక ఈ లోకంలో ఎవరు ఏది చేస్తే మాత్రం తప్పవుతుంది !


కురుక్షేత్ర మహాసంగ్రామంలో అందరూ దారి తప్పినవారే. భీష్ముడూ ద్రోణుడూ కృపుడూ కర్ణుడు ధర్మరాజూ - అంతా, అందరూ ధర్మం తప్పారు. వీరందరికీ శ్రీకృష్ణుడు ప్రేరకుడు కావడం మరీ వింత. సంసారం నిస్సారమని తెలిసిన మహామేధావులే వీరంతా. దేవాంశ సంభూతులే వీరంతా. ధర్మతత్పరులే వీరంతా. అందుకేనా అంత నింద్యంగా ప్రవర్తించారు !


*మహర్షి !* వీరి కథలు విన్నాక ఇక ధర్మంపట్ల ఆస్థ ఎవరికి ఉంటుంది ! ధర్మానికి ప్రమాణం ఏమిటి? ఇది ధర్మము అని దేనిని ఎలా నిశ్చయించడం ? ఎవరిని అనుసరించడం ? మహాత్మా ! నాకు మతిపోతోంది.


ఆప్తవాక్యం ప్రమాణం అనేట్టయితే అసలు ఆప్తుడు ఎవరు ? దేహధారి ప్రతివాడూ విషయాసక్తుడే. రాగ సహితుడే.  రాగంవల్లనే కదా ద్వేషం పుట్టేది. ఒకరిపట్ల రాగం ఉంది అంటే, మరొకరిపట్ల ద్వేషం ఉన్నట్టే. తన ప్రయోజనం దెబ్బతింటే కొందరిపట్ల రాగమూ, కొందరిపట్ల ద్వేషమూ ఆవిర్భవిస్తాయి. ద్వేషంవల్ల ఆసత్యవచనం సంభవిస్తుంది. స్వార్థ సిద్ధికోసం (భయంతో) అబద్ధాలు ఆడటం తప్పనిసరి అవుతుంది. జరాసంధుణ్ణి చంపడం కోసం శ్రీమహావిష్ణువంతటివాడు బ్రాహ్మణరూపం ధరించాడు. అన్ని ధర్మాలూ తెలిసి మోసం చేశాడు. ఇక ఆప్తుడు ఎవరు ? ప్రమాణం ఏమిటి ? యజ్ఞ సందర్భంగా అర్జునుడూ ఇంతే చేశాడు. (బ్రాహ్మణరూపంలో వచ్చి మత్స్యయంత్రాన్ని ఛేదించడం). ఇక నా బొంద యజ్ఞమేమిటి ? శమదమాలు (ప్రాథమిక ధర్మాలు) లేకపోయాక ఎందుకు చేసినట్టు ? పరలోక పదార్థం కోసమా ? కీర్తికోసమా ? మరింక దేనికోసమైనానా ?


*ధర్మానికి నాలుగు పాదాలని వేదం చెబుతోంది. వాటిలో సత్యం మొదటిది. శౌచం రెండవది. దయ మూడవది. దానం నాల్గవది.* 


ఇవే లేకపోయాక ఇక ధర్మం ఎలా నిలుస్తుంది ? ధర్మం లేకపోయాక చేసిన పని ఆశించిన ఫలితాలను ఎలా ఇస్తుంది ? ఇంతటి ప్రధానమైన ధర్మంపట్ల ఎవడికీ ఒక పట్టుదల గానీ, ఒక ధ్యాసగానీ ఒక స్థిరమైన ఆసక్తిగానీ ఉన్నట్టు ఎక్కడా కనిపించడం లేదు.


మోసం చెయ్యడానికి (ఉద్దేశ పూర్వకంగా) విష్ణుమూర్తి వామనుడయ్యాడు. జగత్ర్పభువు. బలిచక్రవర్తిని మోపగించాడు. బలిచక్రవర్తి సామాన్యుడా ! నూరుయజ్ఞాలు చేశాడు. వేదాజ్ఞలను తూచా తప్పకుండా పాలించాడు. ఏవాడూ ధర్మం తప్పలేదు. దానం అతని శీలం. సత్యవాది. జితేంద్రియుడు. అంతటివాణ్ణి అకస్మాత్తుగా అధఃపాతాళానికి అణగదొక్కాడు శ్రీమన్నారాయణుడు. మహర్షీ ! (కృష్ణుడు = వ్యాసుడు) ఇంతకీ ఆ ఇద్దరిలో ఎవరు ఎవరిని జయించినట్టు ? బహుపురాణకర్తవు, నువ్వే చెప్పాలి మరి.


       ꧁┉┅━❀🔯❀━┅┉꧂

 

🌈 *“అందరికందరే - వ్యాసుడు* 💐


*జనమేజయా !* సందేహమేముంది. విజయం బలిచక్రవర్తిదే. యావద్భూగోళాన్నీ దానం చేసిన మహానుభావుడతడైతే, మాటవరసకు త్రివిక్రముడనిపించుకున్నా శ్రీమహావిష్ణువు మోసం కోసం వామనుడైపోయాడు.  అంతేకాదు, రాజేంద్రా ! విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ద్వారపాలకుడు కూడా అయ్యాడు. నువ్వన్నట్టు సకల ధర్మాలకూ సత్యమే మూలం. అయితే దేహధారులకు అది దుస్సాధ్యం. మాయాశక్తి కడుంగడు బలీయసి. బహురూపిణి.


దాని త్రిగుణాలతో ఈ విశ్వమంతా రంగులు పులుముకుంటుంది. శబలితమవుతుంది. సత్యమే మోసంగా, మోసమే సత్యంగా భాసిస్తుంటాయి. ఈ సమ్మిశ్రస్థితి సనాతనం. ఎక్కడో ఒక వైఖానసమహర్షులు - నిస్సంగులూ నిష్క్రతిగ్రహులూ సత్యయుక్తులూ వీతరాగులూ గతతృష్ణులూ ఉన్నారంటారు. వారైనా దృష్టాంతంగా చూపించడం కోసమే నిర్మింపబడ్డారని నా అభిప్రాయం.  వీరు తప్ప మిగతా సృష్టి అంతా త్రిగుణ సమ్మిశ్రితమే.


పురాణాలూ వేదాలూ వేదాంగాలూ ధర్మశాస్త్రాలూ - అన్నీ సగుణుల రచనలే. సగుణంనుంచి సగుణమే ఆవిర్భవిస్తుంది తప్ప నిర్గుణం ఎలా వస్తుంది ? అందుకే వీటికి ఏకవాక్యత ఉండదు.


మానవదేహం ధరించి మాయామోహితుడైన వాడికి ధర్మంపట్ల స్థిరచిత్తం ఉండదు. మనస్సు ఇంద్రియాలవెంట ఆసక్తమై పరుగులు తీస్తుంది. కామక్రోధాది గుణాలతో ప్రేరితాలై రకరకాల స్పందనలు కలుగుతుంటాయి. బ్రహ్మాదిస్తంబ పర్యంతమూ సకల విశ్వమూ మాయామోహితమే. ఆ మాయ వీటితో క్రీడిస్తోంది.


ఇంద్రియాలు కోరుకున్నది లభించకపోతే మనిషి వెంటనే పాల్పడేది అసత్యానికే. దానికోసం వంకలు వెతుక్కుంటాడు. కామక్రోధాదులను మించిన శత్రువులు లేరు. ఇవన్నీ కలిసి మానవుణ్ణి పాపకూపంలోకి పడదోస్తాయి. వీటికి వశుడైన మనిషి మరింక మంచిచెడ్డలను గుర్తించలేడు. ఈ పని చెయ్యదగినది, ఈ పని చెయ్యకూడనిది అనే వివేకం కోల్పోతాడు.


ఐశ్వర్యం చేకూరింది అంటే అహంకారం బలపడిందన్నమాటే. అహంకారం నుంచి మోహమూ, మోహం వల్ల కట్టకడపటికి మరణమూ సంభవిస్తాయి. సంకల్ప వికల్పాలకు కేంద్ర స్థానమైన మనస్సులో ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఆశ, తృష్ణ, దైన్యం, దంభం, అధర్మం - ఇత్యాదులన్నీ ఆవిర్భవిస్తాయి. వీటికి అన్నింటికీ మూలం మోహమే.


ఐశ్వర్యవంతులు కొందరు అహంకారంతో ఆర్భాటంగా పెద్ద ప్రదర్శనగా యజ్ఞయాగాలు చేస్తుంటారు.  దానధర్మాలు నిర్వహిస్తుంటారు. ఇవి అంతశుద్ధి లేని కార్యాలు. నిష్ఫలాలు.


ఏ కార్యక్రమానికైనా ద్రవ్యశుద్ధి ప్రధానం. ముందు అది చూసుకోవాలి. ఎవరికీ ఏ ద్రోహమూ చెయ్యకుండా న్యాయంగా సంపాదించిన ధనం ఉత్తమోత్తమం.


ధర్మకార్యాలకు దీనినే వినియోగించాలి. అక్రమార్జనలతో చేస్తే విపరీతఫలాలు వస్తాయి. పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అలాగే యజమానుడికి (కర్త,) ఋత్విజుడికీ (కారయిత) మనస్సులు నిర్మలంగా ఉండాలి. అప్పుడే యజ్ఞఫలం పరిపూర్ణంగా దక్కుతుంది. 


దేశ - కాల - క్రియా - ద్రవ్య - కర్మ- కారయితృ - మంత్రాల శుద్ధి ఉంటేనేగానీ యజ్ఞఫలం సంపూర్ణంగా లభించదు. వీటిలో ఏ శుద్ధి లోపించినా ఫలసిద్ధి వ్యతిరేకంగా ఉంటుంది. శత్రునాశమూ స్వీయవృద్ధి కోరితే స్వీయనాశమూ శత్రువృద్ధి జరుగుతాయి.


*జనమేజయా !* మనిషి ఎప్పుడూ స్వార్థ పరాయణుడే. శుభాశుభాలను విచారించడు. ఎప్పుడూ పాపమే చేస్తాడు. ప్రజాపతులూ దేవతలూ రాక్షసులూ - వీరంతా స్వార్థ నిరతులు. పరస్పర విరోధులు. వేదాల ప్రకారం దేవతలు సత్త్వగుణ సంభవులు. మానవులు రజోగుణ సంభవులు. రాక్షసులూ పశువక్ష్యాదులూ తామసగుణ సంభవాలు. గుణాలకున్నట్టే వారికీ పరస్పర వైరం. అందుకే మానవుల తపస్సులను దేవతలు ఎప్పుడూ భంగపరుస్తుంటారు.


అసలు మౌలికంగా ఈ సంసారమే అహంకార సంభూతమైనప్పుడు - రాగద్వేషరహితుడు ఎక్కడ ఉంటాడు !


*(అధ్యాయం - 4, శ్లోకాలు - 52)*


అందుచేత,  


*ఓ మహారాజా!* ద్రోహచింతలేని ధర్మాత్ముడు ఈ సృష్టిలో దొరకడు. సకలచరాచరజగత్తూ రాగద్వేషాలతో నిండినదే. ఈ కలియుగంలోనే కాదు ఆ తొలియుగంలో కూడా ఇదే పరిస్థితి. దేవతలు ఈర్ష్యాళువులు. ద్రోహచింతనులు. మోసగాళ్ళు. ఇక మానవులమాటా పశుపక్ష్యాదులమాటా చెప్పాలా!


ద్రోహం చేసినవాడికి ద్రోహం చెయ్యడం సమత. అద్రోహికీ అతిశాంతుడికీ ద్రోహం చెయ్యడం ఖలత (నీచత).


ఎవడో ఒక తపస్వి, శాంతచిత్తంతో జపధ్యాన పరాయణుడై ఎక్కడో ఏ అడవిలోనో ముక్కు మూసుకుని కాలం గడుపుతుంటాడు. దేవేంద్రుడు పవిబూని వాడి తపస్పును కాస్తా భంగపరుస్తాడు. దీన్ని ఏమనాలి ? వానోటితో ఎందుకులే చెప్పడం.


సజ్జనులకు ఎప్పుడూ ఎక్కడైనా సత్యయుగమే. అసజ్జనులకు ఎప్పుడూ కలియుగమే. మధ్యములకు - మధ్యయుగం. ఎప్పుడో ఎక్కడో యుగానికీ జగానికీ ఒక్కడు - సత్యధర్మానువర్తి ఆవిర్భవిస్తాడు. మిగతా యుగాలు అన్నింటా అందరూ ప్రధానంగా అధర్మపరాయణులే (ఆధర్మికులే).


*(రేపు....  "నరనారాయణుల తపస్సు")*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏



🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏


🙏 శ్రీ మాత్రే నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat