*భగవద్గీత - అంతరార్ధ విశ్లేషణ - 8 వ భాగము.

P Madhav Kumar


భగవద్గీత తత్వార్ధమును అర్ధంచేసుకోవాలంటే, మొదటిగా కర్మ-జ్ఞాన యోగముల అంతరార్ధమును పూర్తిగా గ్రహించాలి. ఎందుచేతనంటే మిగతా అధ్యాయముల సారాంశమంతా ఈ రెండింటిపైనే ఆధారపడివుంటుంది. 


ఎవడు రాగద్వేషములకు వసుడుకాడో అతనిని "యోగి లేదా సన్యాసి" అని అంటారు. వేషభాషలకు ప్రాధాన్యము ఇవ్వకుండా, ద్వందములను(వేరుగా భావించుట) అతిక్రమించించినవాడు నిజమైన "యోగి". వీరు ఆత్మవస్తువును ఆశ్రయించి గమ్యమును చేరతారు. 


ఇక్కడ చాలామందికి కలిగే సంశయము ఏమిటంటే, మాకేమో విషయభోగములతో ఎంతో ఆనందము కలుగుతుంది! వీటితో ఆనందము కలగదని గీత చెబుతుంది! ఆత్మానందము అంటే ఏమిటో మాకు తెలియదు! అది మాకు అందుబాటులో లేదు! లభిస్తుందన్న నమ్మకము కూడా లేదు! అందుచేత ఈ ఇంద్రియసుఖమును వదలుకొని, తెలియని ఆత్మసుఖము కోసము ప్రయత్నించడం తెలివితక్కువ పని అవుతుంది కదా??


మంచి ప్రశ్న!, కొంచెము ఆలోచిస్తే, ఇక్కడ సుఖమన్నది బయట పదార్ధములలో లేదు, మనలోనే వుంది, మనమే అనుభవిస్తున్నామని అర్ధమవుతుంది. ఎందుచేతనంటే కొందరికి సుఖమును కలిగించిన వస్తువు, వేరొకరికి కలిగించపోవచ్చు. అలాగే ఆ పదార్ధముద్వారా పొందిన ఆనందము, దానిని అనుభవించిన కొన్నాళ్ళకు పోయి దానియందు విసుగు పుడుతుంది. ఆనందము కోసము ఇంకో కొత్తవస్తువును వెతుక్కుంటాము. అది దొరక్కపొతే అసహనం, కోపము కలిగి అశాంతికి లోనౌతాము. 


అంటే మునుజులు పొందుతున్న ఆనందము, అసహనం, కోపము వారిలోనే వున్నాయి కానీ వస్తువులలో లేదన్న విషయము బోధపడుతుంది. ఒకవేళ ఆ సుఖము వస్తువులోనే ఉంటే, అది అందరికి అన్నివేలయందు ఆనందాన్ని కలిగించాలి కదా!! అందుకే "కడుపునిండితే గారెలు చేదు" అన్నారు పెద్దలు. మనుజులలో నున్న అజ్ఞానమే, బాహ్య వస్తువులందు సుఖభ్రాంతికి కారణము. 


మానవుడు గాఢనిద్రలో నున్నప్పుడు, బాహ్యవస్తువులను మరచి, వాటియందు ఆసక్తిని విడచి, తన దుఃఖములను కూడా మరచి, తనయందే అమితసుఖమును అనుభవిస్తున్నాడు. ఈ తాత్కాలిక ఉపశమనము(సుషుప్తి) యందే ఇంత సుఖమును అనుభవిస్తే, ఇక జ్ఞానముతో కూడిన శాశ్వత ఉపశమనరూపమగు సమాధిస్థితియందు ఎంత ఆనందమును పొందగలడు? కావున అట్టి శాశ్వత ఆనందమును పొందుటకు, తాత్కాలికమైన వస్తుసుఖమును పరిత్యజించాలి. 


జ్ఞానములేని కర్మాచరణము, ఆచరణలేని జ్ఞానమువలన ఉపయోగములేదు. పండితులు ఈ రెండింటికి భేదకల్పనచేసి వాదనలతో వృధాగా కాలాయాపన చేస్తుంటారు. సన్యాసమునకు కూడా నిష్కామకర్మయే పునాది. ఈ పునాది దృఢంగా ఉంటే భౌతికంగా సన్యసింప అవసరములేకుండా పరబ్రహ్మమును తెలుసుకోగలడు.


అహంకారమును విడచుటయే కర్మయోగికి ఆఖరిపాఠము, జ్ఞానయోగికి మొదటిపాఠము. దీనినే దేహాత్మబుద్ధి అని కూడా అంటారు. అహంకారమే జీవుని సంసార పరిభ్రమణమునకు మూల కారణము. జ్ఞానులు తాముచేయు కర్మలన్నీ భగవంతునిపై ఆరోపించి, ఏమి ఆశింపక, మనోబుద్ధుల ప్రమేయంలేక కేవలం ఇంద్రియములచేతనే కర్మలు ఆచరిస్తారు. అహంకారంతో చేసే కర్మలన్నీ ప్రతిబంధకములే.


అందుకే జ్ఞానులు బ్రాహ్మణునియందును, ఆవు యందును, ఏనుగు నందును, కుక్క యందును, ఆఖరికి కుక్క మాంసము తిను చండాలుని యందును సమద్రుష్టి కలిగి వుంటారు. అంటే సర్వభూతములయందును ఆత్మను దర్శిస్తారు. మోక్షము (మోహ క్షయము) ఎక్కడో నున్నదని, ఎప్పుడో లభిస్తుందని చాలామంది భావిస్తారు. అది సర్వత్రా వున్నది. ఇప్పుడే ఇక్కడే లభించగలదు. 

శాస్త్రి ఆత్రేయ(ఆకుండి  శ్రీనివాస శాస్త్రి). 


తదుపరి భాగంలో మళ్లీ కలుసుకుందాము...🌹                                                       🪷⚛️✡️🕉️🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat