_*🚩అయ్యప్ప చరితం - 10🚩*_

P Madhav Kumar


🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️


అందరూ భక్తితో ప్రణమిల్లిన తర్వాత *‘‘మహర్షి! రాక్షసులలో దైత్య, దానవులన్న రెండు తెగలేవిధంగా ఏర్పడ్డాయో తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను! రంభ, కరంభులు ప్రహ్లాదుని సంతతికి చెందినవారు కాదా?’’* అని అడిగాడు ఒక ముని కుమారుడు లేచి వినయంగా నమస్కరించి!

అతని వైపు చిరునవ్వుతో చూశారు సూతమహర్షి !

‘‘మంచి ప్రశ్న అడిగావు !  కశ్యపుని పద ముగ్గురు భార్యలలో అదితికి దేవతలు జన్మించారు ! దితి , దను , సింహిక అనే ముగ్గురికి తమోగుణ ప్రధానులైన రాక్షసులు జన్మించారు ! దితిపుత్రులు దైత్యులనీ , దను పుత్రులు దానవులనీ పిలవబడ్డారు !  దైత్యులు , దానవులు అన్యోన్యంగా కలిసి వుండేవారు !  సింహికకు జన్మించిన పుత్రుడు రాహువు సైన్యాధిపతిగా నియమింపబడ్డాడు. సింహక తపస్సుతో బ్రహ్మను మెప్పించి తన పుత్రుడు అమరత్వం , దైవత్వం పొందేట్లు వరం పొందింది !  ఆ కారణంగానే క్షీర సాగర మథన సమయంలో మహావిష్ణువు రాహువుమీద జగన్మోహిని మాయను ప్రసరింపజేయలేదు ! అందువల్ల రాహువు దేవతల పంక్తిని చేరి అమృత పానం కావించాడు !  అతను తమోగుణ ప్రధానుడు , కనుక అతని శరీరాన్ని రెండు భాగాలు చేసి వాటికి సర్పాకృతి అనుగ్రహించి గ్రహ మండలంలో ప్రత్యేక స్థానాలిచ్చి దైవత్వాన్ని ప్రసాదించాడు శ్రీమహావిష్ణువు !

దైత్యులలో వాళ్ల తల్లి తపస్సు ఫలితంగా బలపరాక్రమవంతులైన కుమారులు జన్మించి ముల్లోకాలను జయించి , నిరంకుశంగా పాలిస్తుండటం , వాళ్లను శ్రీమహావిష్ణువు సంహరిస్తుండటం జరిగేది !

దానవులలో దనువు అనే రాక్షసుని పుత్రులైన రంభ ,  కరంభులకు తమ పుత్రులు ముల్లోకాలు జయించాలన్న కోరిక కలగడంతో వారుకూడా తపస్సుకు పూనుకోవటం , మహిషుడు జన్మించటం జరిగింది కదా ! మహిషుని లాగే దానవ ప్రభువులైన శుంభ నిశుంభులను కూడా జన్మాగతే వధించింది ! వీరందరూ స్త్రీ చేత మాత్రమే మరణాన్ని వరంగా పొందడం కూడా అందుకు కారణం !  ఇక మహిషాసురుని మరణానంతరం అతని సోదరి మహిషి కోరిన చిత్రమైన కోరిక మణికంఠుని అవతరణానికి కారణమైంది !’’  అంటూ చెప్పటం కొనసాగించారు సూతమహర్షి !


*‘‘ఓం బ్రహ్మదేవాయనమః! ఓం బ్రహ్మదేవాయనమః!’’* అంటూ సత్యలోకాన్ని చుట్టివేసి ప్రతిధ్వనించసాగాయి. భూలోకం నుండి ఎగిసివచ్చిన తపోజ్వాలలు !  వాటివైపు ఆందోళనగా చూస్తూ *‘‘స్వామీ ! మహిషి కావిస్తున్న తపస్సు అంతకంతకు తీవ్రవౌతున్నది !  ఆ తపోజ్వాలలను అరికట్టకపోతే లోకాలను దహించివేయగలవు ! ఆమె తపస్సును విరమించేలా చేయవలసిన బాధ్యత మీదే గదా స్వామీ! ’’* అన్నది సరస్వతీదేవి ఆందోళనగా చూస్తూ!

*‘‘అవును ! ఆమె తపస్సును విరమింపజేయడానికి దేవతలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు !  ఇక నేను తరలి వెళ్లక తప్పదు!’’* అని హంస వాహనరూఢుడై మహిషి ముందర సాక్షాత్కరించాడు బ్రహ్మదేవుడు!


*‘‘పుత్రీ !  నీ తపస్సుకు ప్రసన్నుడినైనాను ! ఏం వరం కావాలో కోరుకో!’’* అంటూ బ్రహ్మ పలుకులు వినిపించడంతో కళ్లు తెరిచి చూసింది మహిషి ! భక్తిపూర్వకంగా నమస్కరించి *‘‘హే విధాతా ! నాకు అమరత్వాన్ని ప్రసాదించండి’’* అంటూ కోరింది !

*‘‘అమరత్వం అమృతపానంతోనే లభ్యవౌతుంది ! కనుక అది తప్ప వేరే ఏదైనా కోరిక వుంటే చెప్పు , తప్పకుండా తీరుస్తాను!’’* అన్నాడు బ్రహ్మ శాంత గంభీర స్వరంతో !

కొద్దిసేపు వౌనంగా ఆలోచించి *‘‘అయితే శివకేశవులకు జన్మించి, పన్నెండు సంవత్సరాలు భూలోకంలో పెరిగిన బాలుడు చేతిలో తప్ప ఇతరులెవరి వల్లా మరణం రాకుండా అనుగ్రహించండి’’* అని వేడుకుంది మహిషి !

*‘‘తథాస్తు’’* అని అంతర్థానం చెందాడు బ్రహ్మదేవుడు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat