"భగవద్గీత - అంతరార్ధ విశ్లేషణ" - 12వ భాగము.

P Madhav Kumar


మనోనిగ్రహానికి, వైరాగ్యంతో కూడిన అభ్యాసముండాలి. వైరాగ్యముండి అభ్యాసము లేకపోయినా, అభ్యాసము మాత్రమేనుండి వైరాగ్యము లేకపోయినా మనస్సును స్వాధీనపరుచుకొనుట కుదరదు. 


ఒక కార్యమును సాధించుటకు నిర్విరామంగా, పట్టుదలతో చేయు ప్రయత్నమే అభ్యాసము. ఈ జన్మలో ఏర్పడిన వికారములు, గత జన్మలనుండి సంప్రాప్తించిన విషయవాసనలు జీవునిలో పూర్తిగా తొలగిపోవాలంటే నిరంతర అభ్యాసముద్వారా మనస్సుపై పట్టుసాధించాలి. ఈ అభ్యాసమంతా వైరాగ్యంతో(విషయవిరక్తితో) సాగాలి. అంటే శాశ్వతము కానీ ఇంద్రియసుఖముల వెంట నిరంతరం పరిగెత్తు మనస్సుని ధ్యానము ద్వారా శాశ్వతము, సత్యమగు పరమాత్మ వైపు మరల్చాలి.


ఈ కాలంలో అనేక ధ్యానపద్ధతులు అమల్లోవున్నాయి. ఏ పద్ధతైనా సరే, మనస్సును ఏకాగ్రపరచి దైవచింతన చేయడమే ముఖ్యము. ఆరంభదశలో మనస్సు పరిపరివిధముల పరిగెత్తినా, మెల్లగా ఆత్మయందు స్థాపితము చేయాలి.


సులభంగా చెప్పాలంటే ధ్యానమును కొత్తగా నేర్చుకొనవలసిన అవసరంలేదు. అందరూ నిత్యమూ చేస్తున్నదే. అయితే ఇన్నాళ్లు జీవుడు ధ్యానిస్తున్నది కేవలము ఈ ప్రాపంచిక విషయములు లేదా భోగవిలాసములైతే, ఇప్పుడు ఆ ధ్యానమును పరమాత్మవస్తువుపై మళ్లించడం అంతే. ప్రతిరోజు ఓ నిర్ణీత సమయమందు ధ్యానము చేస్తూ, మెల్లమెల్లగా ధ్యాననిడివి పెంచుకుంటూ పోతే మనస్సు అధీనంలోకి తప్పక వస్తుంది.


జననమరణ చట్రం నుండి బయటపడడమే అసలైన సాధన. దేనిని తెలుసుకుంటే ఈ చట్రములో తిరిగి ప్రవేసించడో, ఏది తెలుసుకుంటే ఆత్మానందమును పొందునో, ఏది తెలుసుకుంటే ఈ చరాచర జగత్తును సమదృష్టితో చూడగలడో, ఏది తెలుసుకుంటే అసలు సత్యము అవగతమగునో, దానిని ఈ ధ్యానము ద్వారా పొందవలెను.


నారాయణుని ధ్యానించి నరుని దూషిస్తే ప్రయోజనంలేదు. మాధవుని పూజించి మానవధర్మమును విస్మరిస్తే మనుగడలేదు. సత్యమును మరచి సదాశివుని స్మరిస్తే లాభములేదు. ఈ తత్వము నెఱింగి చేయు సాధనే ధ్యానము. 


ఈరోజు నవ్వుతూ చేసిన పాపమునకు, రేపు ఏడుస్తూ దుఃఖము అనుభవించవలసిందే. ఇది పరమాత్మ నిర్ణయము. కావునా జీవుడు నిష్కామకర్మాచరణతో జ్ఞానాన్ని పొంది, ధ్యానముతో బ్రహ్మానందమును అనుభవించే మార్గమును అర్జునునికి భోదించేడు శ్రీకృష్ణుడు.


తదుపరి అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము...🌹                                                         🪷⚛️✡️🕉️🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat