_*🚩అయ్యప్ప చరితం - 12 వ అధ్యాయం🚩*_

P Madhav Kumar


🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️


ఆ లోపల హరిహర పుత్రుడు జన్మించాలని మేమంతా ఆశతో ఎదురుచూస్తున్నాము అన్నారు ఇంద్రాది దేవతలు గూడా త్రిమూర్తులను దర్శించి !

*‘‘త్వరలోనే మీ కోరిక తీరగలదు ! వేచి వుండండి’’* అని అభయం ప్రసాదించి వాళ్లను పంపివేశారు శివకేశవులు.


*‘‘పరమేశ్వరా ! ఇక నేను కూడా వైకుంఠానికి తిరిగి వెళతాను !’’* అంటూ లేచాడు మహావిష్ణువు

అంతవరకు కైలాసంలోనే దేవతలతో సమావేశం జరిగింది.  వాళ్లు వెళ్లాక మహావిష్ణువు వెళ్లడంతో పరమేశ్వరుడు ఆలోచనామగ్నుడైనాడు !

అంతర్మందిరంలోనుండి కనిపిస్తున్న పుష్పోద్యానం వైపు దృష్టి సారించిన పరమశివుని కనుబొమ్మలు ముడివడ్డాయి.

పుష్పోద్యానంలో అతిలోక లావణ్యవతియైన ఒక సుందరి నడయాడుతుండటం చూసి *‘ఎవరో జగన్మోహిని ! ఈ వనంలోకి ఎలా వచ్చింది? వెళ్లి పలకరిస్తాను’’* అనుకుంటూ వనంలోకి ప్రవేశించాడు పరమేశ్వరుడు


ఆమె అందం స్వామి మనస్సుకు ఆహ్లాదం కలిగించింది ! చిరునవ్వు మన్మథబాణంలా వచ్చి తగిలేసరికి విచలితుడౌతూ *‘‘సుందరీ ! ఎవరివి నీవు ?  ఈ వనంలో ఒంటరిగా విహరిస్తున్న నిన్ను చూస్తుంటే నీతో జంటగా విహరించాలనిపిస్తున్నది సుమా!’’* అంటూ ఆమెను సమీపించాడు !

ఆమె అంగీకారంగా ముసి ముసి నవ్వులు నవ్వి చేయందించడంతో ఇద్దరూ వనంలో విహరిస్తూ ఆనందించ

సాగారు ! కళ్లలో కళ్లు కలిపి నాట్యం చేయసాగారు ! ఆ సమయంలో ఇద్దరి శరీరాలనుండి తేజస్సులు వెలువడి పచ్చని పచ్చికమీద ఒకటై క్రమంగా బాలునిగా రూపుదిద్దుకున్నాయి. జగన్మోహిని మాయమై ఆ స్థానంలో మహావిష్ణువు నిలిచాడు ! పరమేశ్వరుడు చిరునవ్వుతో చూస్తూ *‘‘నారాయణా! నీ విష్ణుమాయలో ఓలలాడించి నన్ను వివశుడిని చేసావు సుమా ! చమత్కారివే!’’* అన్నాడు.


దివ్యతేజంతో ప్రకాశిస్తున్న బాలుడిమీద పుష్పవృష్టి కురిపిస్తూ ఆనందంతో జయజయధ్వానాలు చేశారు.  విషయం తెలిసి వచ్చిన దేవగణాలు , బ్రహ్మ , నారదాది మునులు !


*‘‘హరి మాటల అంశతో ప్రభవించిన దివ్య శిశువుకు మా ప్రణామాలు ! ఈ బాలుడిని చూస్తుంటే మా కష్టాలిక త్వరలోనే తీరగలవన్న ఆనందంతో పరవశించిపోతున్నాయి మా హృదయాలు!’’* అంటూన్న దేవతలవైపు ప్రసన్నంగా చూసారు హరిహరులు !

పరమేశ్వరుడు ‘‘ఈ బాలుని భూతనాధుడనే పేర భూతగణాలకు నాయకునిగా అభిషిక్తుడిని కావిస్తున్నాను !

నందీశ్వరాది ప్రమథ గణాల చేత పూజింపబడగలడు’’ అంటూ శిరస్సుమీద చేయి వుంచాడు.

మహావిష్ణువు ఆ చేతిమీద తన హస్తాన్ని వుంచి *‘‘ధర్మశాస్తా అనే పేరుతో ధర్మానికి అధిదేవత కాగలడు ఈ చిరంజీవి!’’* అన్నాడు. తన కంఠం నుండి ఒక మణిహారాన్ని తీసి ఆ బాలుడి మెడలో వేశాడు మహావిష్ణువు. *‘‘దేవతలారా ! మణికంఠుడనే సార్థక నామంతో ఈ బాలుడు భూలోకంలో పన్నెండు సంవత్సరాలు రాజవంశంలో ప్రవర్థమానుడై మహిషిని సంహరించి మీకు ఆనందాన్ని కలిగిస్తాడు.

భూమిమీద ధర్మాన్ని సుస్థిరం కావిస్తాడు ’’ అని  తెలియజెప్పాడు.

*‘‘ధన్యులం స్వామీ ! ధన్యులం ! హరిహర పుత్రుడు మణికంఠునికి జయము! జయము!’’* అంటూ జయజయధ్వానాలు చేసి తృప్తిగా తిరిగి వెళ్లారు ఇంద్రాది దేవతలు.

*‘‘విప్ర పూజ్యం విశ్వ వంధ్యం విష్ణుం శంభు ప్రియం సుతం*

*క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం’’* అంటూ హరిహరుల మధ్య ఆసీనుడైన మణికంఠునికి నమస్కరించి *‘‘మహిషిని మర్దించగల వీరపుత్రుడు జన్మించాడు ! భూలోకం చేరి ఏమేమి వింతలు చూపనున్నాడో’’* అని ఆత్రంగా ఎదురుచూస్తున్నాము

స్వామీ ! ఎప్పుడెప్పుడు ముక్తి లభిస్తుందని వ్యధ చెందుతున్న సుందర మహిషానికి విముక్తి ప్రసాదించినట్లే గదా ! నారాయణ ! నారాయణ ! అంటూ భూలోకం వైపు సాగిపోయాడు నారద మహర్షి !


ఏకాగ్రతతో వింటున్న నైమిశారణ్య వాసులవైపు ప్రసన్నంగా చూస్తూ చెప్పడం కొనసాగించాడు సూత మహర్షి ! *‘‘శౌనకాది మునులారా ! హరిహర పుత్రుడైన భూతనాధుడు ఆవిర్భవించిన వైనం విన్నారు గదా ! ఆవిర్భవించిన వెంటనే యువకుడైన భూతనాథుడు కొంతకాలం కైలాసంలో ప్రమథ , భూత గణాల పూజలందుకుంటూ గడిపాడు !  పార్వతీ పరమేశ్వరులకు , గణపతి , కుమారస్వాములకు ఆనందాన్ని ప్రసాదించాడు !  అతనికి పూర్ణ - పుష్కళ అనే ఇద్దరు దేవకన్యలతో వివాహం జరిపించింది పార్వతీమాత.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat