ఇంతవరకు జరిగిన కృష్ణార్జునసంవాదంలో - నిష్కామకర్మ, జ్ఞానము, అభ్యాసము, ధ్యానము, విజ్ఞానముల యొక్క ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించడం జరిగింది. పార్దునిలో ఇంకా తెలుసుకోవాలన్న జిజ్ఞాస పెరిగింది. ఇంతవరకు శ్రీకృష్ణుడు తరచుగా వాడే బ్రహ్మము/ పరమాత్మ/ ఆధ్యాత్మము/ అధిదైవము/ అధిభూతము/ అధియజ్ఞము అనే పదాల విషయంలో సంశయం కలిగింది అర్జునునికి. ఈ విషయాలను సులభంగా అర్ధమయ్యేరీతిన వివరించవలసినదిగా శ్రీకృష్ణుని అభ్యర్దించాడు సవ్యసాచి.
ఇదే గీతలో నున్న విశిష్ఠత. ఒకపక్క అర్ధమయినట్లే అనిపిస్తుంది కానీ తెలుసుకుంటున్న కొద్దీ కొత్తప్రశ్నలకు దారితీస్తుంది. అందుకే గీతను - సర్వఉపనిషత్తుల సారమని, బ్రహ్మవిద్యయని, యోగశాస్త్రమని, జీవితలక్ష్యమును తెలిపే శాస్త్రమని, ప్రస్థానత్రయములో ఒకటిగా యోగులు గుర్తించారు. ఇందు కులమతముల ప్రస్తావన ఉండదు. అందరికి అంగీకారయోగ్యమైనట్టి అసలు సత్యమును తెలిపే గొప్ప విజ్ఞానశాస్త్రము గీత.
భగవంతుడు అంటే ఎవరు? అతని స్వరూపము ఏమిటి? అతనిని ఎలా చేరుకోవాలి? అన్న ప్రశ్న మానవులందరిలో ఏళ్ళ తరబడి, యుగాల తరబడి వేధిస్తున్న ప్రశ్న. ఎంత తెలివితేటలను సంపాదించిన, ఎంత శాస్త్రజ్ఞానమును పొందినా, మానవుడు ఎన్ని అద్భుతములను సృష్టిస్తున్నా, ఎంత సాంకేతికతను వినియోగిస్తున్నా ఈ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. దానికి కారణము, ఒకటీ భగవంతుని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నవారు చాల అరుదుగా వుండటము, రెండవది భగవంతుదంటే ఎవడో/ఏమిటో అస్సలు తెలియకుండా బోధించేవారు ఎక్కువుగా వుండటము, మూడవది భగవంతుడిని పూర్తిగా తెలుసుకుందామన్న జిజ్ఞాసగల మనుజులు తక్కువుగా వుండటము.
అసలు సమాధానము గీతలో లభిస్తుంది. దేవుడంటే ఎవరు? అన్న ప్రశ్నకు, "దేనికి నాశనము లేదో అదే దేవుడు!!" అని చాల సులభంగా సమాధానమిచ్చాడు జగద్గురువు.
దానిని కాస్త వివరంగా చెప్పమని అర్జునుడు కోరగా, శ్రీకృష్ణుడు "అక్షరపరబ్రహ్మయోగము" అనుపేర ఈ విధంగా చెప్పడము మొదలుపెట్టాడు -
అర్జునా! దేనికి క్షరము(నాశనము)లేదో దానినే "అక్షర" మని అంటారు. అట్టి అక్షరమైన పరబ్రహ్మను ఎట్లు పొందవలనో తెలిపే యోగమే "అక్షరపరబ్రహ్మయోగము". అట్టి యోగమును తెలిపే విద్యను "అక్షరవిద్య" లేక "బ్రహ్మవిద్య" అంటారు. దీనిని సంపూర్ణంగా గ్రహించిన జీవుడు అన్ని బంధముల నుండి విడిపడి పరమాత్మను పొందును. ఎన్నో విద్యలను అభ్యసించి, ఈ అక్షరవిద్యను అభ్యసించని వాడు అజ్ఞాని గానే పరిగణించబడతాడు. ఎటువంటి విద్యలను అభ్యసించక పోయిననూ, కేవలం అక్షరవిద్య సాధనచే, ఎవరి హృదయమందు బ్రహ్మము భాసించుచుండునో అతడు జ్ఞానిగా వర్ధిల్లుతాడు.
అసలైన "అక్షరాభ్యాసము" అంటే అక్షరవిద్యను అభ్యసించడమే. ప్రాపంచికవిద్యలతో పాటు బ్రహ్మవిద్యను కూడా అభ్యసిస్తూ అసలు సత్యమును తెలుసుకొనే సాధన చేయాలి. మహాత్ములు అనుసరించే పద్ధతి ఇదే! దానికోసమే వారు తమ సర్వశక్తులను ధారబోస్తారు.
ఈ అక్షరపరబ్రహ్మయోగము గురించి తదుపరి భాగంలో విపులంగా తెలుసుకుందాము... 🪷 🪷⚛️✡️🕉️🌹