🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️
అది పవిత్రమైన పంబా నదీ తీరం ! పందల రాజ్యం సమీపంలోని దట్టమైన అరణ్యాల మధ్యగా ప్రవహిస్తుండే పంబా నదీ జలాలు ఆ ప్రాంత వాసులకు జీవనాధారాలు ! ఒడ్డున పచ్చని పచ్చిక ఆకులు పచ్చని తివాచీ పరిచినట్లు ఎవరి రాకకోసమో ఎదురుచూస్తున్నట్లున్నది. చల్లటిగాలి , గలగలమని పారుతున్న నదీ జలాలు , పూవులు జలజలమని రాలుస్తున్న వృక్షాలు - ప్రకృతి శోభాయమానంగా ముస్తాబై ఎవరికో స్వాగతం చెప్పడానికి ఆత్రుత పడుతున్నట్లుగా వున్నది. ఆ నిరీక్షణ ఫలించినట్లు ఆకాశం నుండి జ్వాజ్వలమానంగా వెలుగుతున్న జ్యోతి పుంజం సాక్షాత్కరించింది నదీ తీరాన ! అందులోనుండి హరిహరులు వారి మధ్యగా భూతనాథుడు ప్రకటితమైనారు !
హరిహరులు భూతనాథునివైపు ప్రసన్నంగా చూస్తూ *‘‘కుమారా ! నీవు మానవ రూపంతో భూమిమీద కావించవలసిన దుష్టశిక్షణకు నాంది పలకవలసిన శుభ సమయం ఆసన్నమైంది. ఇక్కడికి మరికొద్దిసేపట్లో మా భక్తుడైన పందల రాజు రాగలడు ! నీవాయనకు పుత్రుడివై ఆయన చిరకాల వాంఛితాన్ని నెరవేర్చు!’’* అన్నారు.
*‘‘మీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను!’’* అంటూ కళ్లు మూసుకుని ధ్యానించాడు భూతనాథుడు. మరుక్షణమే పొత్తిళ్లలో పాపడుగా మారి పచ్చికమీద సాక్షాత్కరించి కెవ్వుమన్నాడు !
హరిహరులు శిశువు తలమీద నిమిరి దీవించారు ! మహావిష్ణువు మెడలో మణిహారంతో ప్రకాశిస్తున్న శిశువువైపు ఆప్యాయంగా చూస్తూ *‘‘ఇకపై మణికంఠుడనే పేరుతో ప్రవర్థమానుడై ఈ ప్రాంత వాసులను తన లీలలతో ధన్యులను కావిస్తాడు భూతనాథుడు’’* అన్నాడు.
*‘‘అవును ! మహిషిని సంహరించి ధర్మ సంస్థాపన కావిస్తాడు ధర్మశాస్తా !’’* పరమేశ్వరుడు ప్రసన్నంగా చూస్తూ అన్నాడు.
దూరం నుండి కలకలం వినరావడంతో అంతర్థానం చెందారిద్దరూ!
*‘‘సారథి ! ఆగు !’’* రథాన్ని ఆపించి దిగి చుట్టూ చూసాడు రాజశేఖరుడు ! చెవి వొగ్గి జాగ్రత్తగా విని *‘‘ఎవరో పసిపాపడి ఏడుపు వినిపిస్తున్నది ఆ ప్రక్కనుండి ! అటువైపు పోనివ్వు!’’* అంటూ ఎక్కి కూర్చున్నాడు.
రథం పంబానది ఒడ్డుకు చేరింది ! దిగి చుట్టూ చూసిన రాజుకు పచ్చికమీద పొత్తిళ్లలో పడుకుని కెవ్వుమని ఏడుస్తున్న పసిపాపడు కనిపించడంతో గబగబా అటువైపు వెళ్లాడు !
అంతవరకు పడగ ఎత్తి పట్టి బాలుడి మీద ఎండ పడకుండా చూస్తున్న పాము రాజు వస్తుండటం చూసి చర్రున ప్రక్కకి జారిపోయింది.
‘‘ఆహా ! ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు ! మెడలో ఆ మణిహారం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది ! ఎవరీ బాలుడు ? ఎవరీ విధంగా విడిచి వెళ్లుంటారు ! పాము పడగ ఎత్తి పట్టి కాపాడుతూ వుండిందంటే ఈ బాలుడెవరో మహత్తర జాతకుడై వుంటాడు ! ఈ చుట్టుప్రక్కల మనుష్య సంచారం లేదు ! ఆ పరమేశ్వరుడు తన కోసమే ఈ శిశువునిక్కడ వుంచి వుంటాడా ? సందేహం లేదు ! నారద మహర్షి చెప్పినట్లు తన కోసమే ఈ శిశువును అనుగ్రహించి వుంటాడు ఆ పరమేశ్వరుడు అన్న ఆలోచన రాగానే మనస్సులో ఆ బాలుని మీద పుత్ర వాత్సల్యం పొంగి వచ్చింది రాజశేఖరునిలో !
జాగ్రత్తగా రెండు చేతులలో ఎత్తుకుని రథంమీద ఒడిలో పరుండబెట్టుకుని కూర్చున్నాడు ! ఏడుపు మాని నవ్వుతున్నట్లు తనవైపే చూస్తున్న బాలుడి ముఖంలోకి తదేకంగా చూస్తూ ఈ చిన్నారి మోము మునుపెప్పుడో చూసినట్లనిపిస్తున్నది ! ఎక్కడ చూసి వుంటాను ?’
అనుకున్నాడు.
నామకరణ మహోత్సవం
చేతుల్లో పసివాడితో అంతఃపురంలో అడుగుపెట్టిన భర్తకు సంభ్రమానందాలతో ఎదురువచ్చింది రాణి !
భర్త చెప్పింది వింటూ పిల్లాడిని తన ఒడిలోకి తీసుకుంది. *‘‘మనం ఇంతకాలంగా ఎదురుచూసిన వరపుత్రుడు ఈనాటికి మన ఒడిని చేరాడు ! భగవంతుడు మనమీద కృపాదృష్టిని కురిపించాడు ! ఈ పసివాడినే మన పుత్రునిగా స్వీకరిద్దాము !’’* అన్నది పసివాడిని ముద్దులాడుతూ ! మెడలో మణిహారాన్ని ఆశ్చర్యంగా చూస్తూ *‘‘ఈ హారాన్ని మీరు అలంకరించారా?’’* అడిగింది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏