అర్జునా! వినుము. సర్వోత్తమము (అన్నింటికన్నా ఉత్తమమైనది), నాశరహితము (నాశనము లేనిది), శాశ్వతమైనది అగు ఆత్మనే బ్రహ్మమని అందురు. ఆత్మ తత్వము (స్వభావము)ను అధ్యాత్మము అని పిలుతురు. సకల చరాచర భూతజాలములను ఉత్పత్తిచేయు కార్యమే పరమాత్ముని కర్మ.
నశించే స్వభావము కలిగిన ఉపాధులు(పదార్ధములు) అధిభూతము. దీనినే అపరప్రకృతి అని అంటారు. పరప్రకృతి అయిన పురుషుడే అధిదైవము. సకల దేహములందు అంతర్యామిగా ఉండే పరమాత్మే అధియజ్ఞము. అన్ని యజ్ఞములందు ఆరాధింప బడేది ఇదే.
సర్వము నెఱింగినవాడు, సనాతనుడు, అన్నింటిని శాసించువాడు, అతి సూక్ష్మమైనవాడు, కోటి సూర్యుల కాంతి కలవాడు, విశ్వమంతటికి ఆధారభూతుడు, ఆలోచింప శక్యంకాని రూపమును కలవాడు, అజ్ఞానానికి అతీతుడు అయినా పరమాత్మను, మరణసమయంలో ఎవరైతే స్మరిస్తారో అతడు నా స్వరూపాన్నే పొందుతాడు. ఇందులో సందేహంలేదు.
మరణసమయంలో ఇది సాధ్యపడాలంటే, ప్రతినిమిషం ఆత్మనిష్ఠలో వుండాలి. అంటే అన్నింటా, అన్ని ఉపాధులందు ఆత్మను దర్శించాలి. పరమాత్మయందే విశ్వమంతా వున్నది. అంటే విశ్వమంతా పరమాత్మ వ్యాపించియున్నాడు. ఆత్మజ్ఞానముతో అతనిని పొందవచ్చును.
వేదములందు, యజ్ఞములందు, తపస్సులందు, దానములందు ఎటువంటి పుణ్యఫలము చెప్పబడినదో దానినంతటిని అతిక్రమించిన పుణ్యమును కేవలము నన్ను తెలుసుకొనుటద్వారా పొందవచ్చును. అంటే ఆ సాధకుడు పరమాత్మను పొందుతాడు.
పుట్టినవానికి మృత్యువు తప్పదు. అది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలీదు. అది రాకముందే దానిని నివారించే మార్గము కనుక్కోవాలి. అక్షరమైనదానిని(నాశనము లేనిదానిని) పొందాలి.
అందుకోసము నిష్కామముతో జీవుడు తాను నిర్వహించవలసిన విధులు నిర్వహిస్తూ, సర్వకాల సర్వావస్తలయందు పరమాత్మయందు అర్పితమైన మనస్సు, బుద్ధి కలవాడైయుండాలి. అందుకు ఏమాత్రము ఆలస్యము చేయకుండా సాధనచెయ్యాలి.
కావునా అర్జునా! నీ విధిని నీవు నిర్వహిస్తూ, నశించిపోయే ఈ శరీరమందు అంతర్యామిగానున్న పరమాత్మను, నీవు ఆత్మజ్ఞానముతో తెలుసుకొని, శాశ్వతమైన బ్రహ్మమును పొందుము.
మనుజునికి ఇది సాధ్యమే. ఎందుచేతనంటే ప్రతిజీవి పరిశుద్ధమగు ఆత్మస్వరూపమే. శరీరము కేవలం ఉపాధి మాత్రమే. పంచభూతములతో కూడిన ఈ దేహమునకు-నీకును నిజంగా ఎటువంటి సంబంధము లేదు. అటువంటి బుద్ధితో సాధన చేయుము. సాధన చేయుట జీవుని ధర్మము, సాయము చేయుట పరమాత్మ ధర్మమని కర్తవ్యమును బోధించాడు శ్రీకృష్ణుడు.
తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము...🪷 🪷⚛️✡️🕉️🌹