‘ముఖచన్ద్రకళంకాభమృగనాభివిశేషికా’
ఈ నామములో అమ్మవారు మృగనాభితో పెట్టుకునే బొట్టు గురించి చెపుతున్నారు. కస్తూరిమృగము నాభి దగ్గరనుంచి ఊరిన ద్రవము కనక మృగనాభి అని పేరు. అ సువాసన దానిదే అని కస్తూరిమృగమునకు తెలియదు. అమ్మవారి ముఖములో బొట్టు చంద్రబింబములోని మచ్చలా చాలా సహజముగా ఉంటుంది. బొట్టు కనుబొమల మధ్యలో ఆజ్ఞా చక్రము మీద పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకుంటే ఆజ్ఞాచక్రమునకు రక్షణ కలుగుతుంది. మనిషి ఆలోచనలు ఆజ్ఞాచక్రము మీదే ఉంటాయి. ఆజ్ఞాచక్రము బొట్టు చేత ఆచ్ఛాదన చేయబడితే దృష్టి దోషము ఉండదు. కొన్ని వేలమంది దృష్టి ఒక్కముఖము మీద నిలబడుతుంటే ఆ వ్యక్తికి ఉపాసన చేత కలిగిన ధృతి క్షీణిస్తుంది. ఈ ధృతి క్షీణించకుండా ఉండాలి అంటే ఆజ్ఞాచక్రం మీద అమ్మవారి రక్ష పెట్టుకుంటే దృష్టి దోషము విరిగిపోతుంది. లలాటము మీద మూడు విభూతి రేఖలు ఉండటము వలన ఈశ్వరరక్ష కలుగుతుందన్నది అన్నిటికంటే గొప్ప విషయము.
హరినాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి |
లలాట లిఖితా రేఖా పరిమాస్తు న శక్యతే ||
లలాటము మీద వ్రాసిన గీత మారదు. ప్రతిరోజూ విభూతి చేత ఆచ్ఛాదింపబడి బొట్టు పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహము వలన సరైన నిర్ణయాలు తీసుకుని మంచివైపు నడవడము జరుగుతుంది. బొట్టు లేకపోతే అశౌచముతో ఉన్నారని గుర్తు. బొట్టు సువాసినీత్వమునకు సూచన. ఎప్పుడూ బొట్టుతో కనపడుతూ ఉండాలి. సుగంధ భరితములైన వాటితో చేసిన బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఒక ఇంటి యొక్కమంగళము అంతా స్త్రీయొక్క బొట్టులోనే ఉన్నది. బొట్టు పెట్టుకున్న లలాటము ఆ కుటుంబవృద్ధికి సూచన. ప్రతి ఇల్లాలు తనభర్త పక్కన లక్ష్మీప్రదయై ఇంటిని నిర్వహించగలిగిన శక్తి సువాసినీత్వమునకు గుర్తయిన బొట్టులోనుంచి వస్తున్నది. ఈ బొట్టు లోనికి శక్తి అమ్మవారి బొట్టునుంచి వస్తున్నది. స్త్రీ ఎక్కడకయినా వెడితే ‘ఉండమ్మా బొట్టు పెడతా’ అంటారు. ఆ బొట్టు అంత పరమపవిత్రం. అమ్మవారి బొట్టులో నుంచి ఇన్ని బొట్టులు ప్రకాశిస్తున్నాయని, దానిని చూస్తున్న వారు అద్భుతమైన శక్తిని పొందుతారని, ఆ బొట్టు దర్శనము చేత సర్వమంగళములు పొందుతారని వేదము చెప్పిన దానిని నమ్మాలి.🙏
🙏 శ్రీ మాత్రే నమః 🙏