‘వదనస్మరమాంగల్య గృహతోరణచిల్లికా’
లలితాసహస్రనామ స్తోత్రములో ఉన్న ప్రతి నామము పవిత్రము. మనిషి పుట్టినదాదిగా జీవితాంతము నీడ ఎలా వెంటాడుతుందో అలా వెంటాడి సమస్త అజ్ఞానమునకు ఆలవాలమై, మనిషిని ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యనివ్వకుండా నాలుగు మెట్లు పైకి ఎక్కితే ఇరవై మెట్లు కిందకు దిగజార్చే దానిని శాస్త్రము ‘భయం’ అని పిలిచింది. ఎప్పుడూ నేను ఏమైపోతానో అనే భావన భయానికి కారణము. అలా బెంగ పెట్టుకున్నవాళ్ళు ఉండిపోలేదు. నాకేమీ అవదు అనుకున్న వాళ్ళుకూడా ఉండిపోలేదు. వెళ్ళిపోవడమన్నది నిజమయిన తరవాత ఇంక ఆ శరీరముతో, దానితో సంబంధము ఉన్న ఏ వస్తువుతో సంబంధము లేదు. ఎంత భయపడినా, భయము లేకుండా ఉన్నా శరీరము ఉండదు. ఎంత విన్నా, ఎన్ని చదివినా భయము వెంబడిస్తూనే ఉంటుంది.
ప్రధానముగా రెండుకారణములు మనిషిని వెంటాడుతూ ఉంటాయి. ఉన్నది ఉండకుండా పోతుందేమో అని ఒక కారణము. నావి అనుకున్నవి నాకు కాకుండా పోతాయేమో అని ఒక కారణము. నిజానికి బెంగ పెట్టుకోకపోతే ఇంకా కొద్దికాలము శరీరము ఉంటుందేమో ఎంత బెంగ పెట్టుకుంటే అంత తొందరగా వెళ్ళిపోతుంది. ఇటువంటి భయమును తొలగించడానికి ఏదైనా ఉన్నదా అంటే అమ్మవారి రూపము ఇందుకే వచ్చిందని శాస్త్రము చెప్పింది. రూపము లేని అమ్మవారు రూపమును దాల్చింది. ఆ రూపమును బట్టి నామములు. జీవితములో ఏదో ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంటే దానిని తొలగించుకోవడానికి ఆ అవయవమును ధ్యానము చేస్తే ఫలితమును పొందుతారు. ఆవిడ ప్రత్యేకమైన అవయవ దర్శనము ఇబ్బంది ఉన్నదానిని తొలగించి కాపాడుతుంది. ఒక్కక్క అవయవమునకు ఒక్కక్క ఫలితము ఉంటుంది. భయం ఏ ఒక్కరికో ఉండేది కాదు. సాధారణముగా అందరికీ ఉంటుంది.
ఈ నామములో మన్మధునికి చాలాకాలానికి మంచి ఇల్లు దొరికింది అన్నారు. ఇల్లు భయాన్ని పోగొడుతుంది. ఎవరైనా అమ్మయ్య ఇంటికి వచ్చేసామని అనుకుంటూ ఉంటారు. మనసిజుడు, పుష్పబాణుడు, అనంగుడు ఇలా ఎన్నో పేర్లుకల మన్మధుని ఇక్కడ స్మరుడు అన్నారు. స్మరుడు అందరిలో కోరికలు పెంచుతూ భయం కల్పిస్తున్నాడు. అటువంటి ఆయనకు భయం లేకుండా చేయకలిగిన ఇల్లు కావలసి వచ్చింది. ఆయనకు ఎందుకు భయం అనగా ఎవరితో తగువు పెట్టుకుంటే మనశ్శాంతి ఉండదో అటువంటి వారితో తగువు పెట్టుకున్నాడు. మనశ్శాంతికి హేతువైన దానితో తగువు పెట్టుకుంటే అశాంతికి లోనవుతారు. దోషం అని తెలిసి మరీ మన్మధుడు తన పరిధిని అతిక్రమించాడు. ఇంద్రుడి మెప్పుదల కోసము పరమశివుని మీద బాణము వేసాడు. శివుడు మూడవకన్ను తెరిచి కాల్చేస్తే బూది అయిపోయాడు. ఆయన ఒక్కడే బూది అవలేదు. తాను తోడు తెచ్చుకున్నకోయిలలు, కలహంసలు, పుష్ప బాణములు, తుమ్మెదలు తన పరివారము మొత్తముతో బూదిగా మారిపోయాడు. అన్ని జాతులు తామరతంపరగా పెరగాలి అంటే మన్మధుడు బాణములు వెయ్యాలి. పుష్పబాణములు వెయ్యకపోతే సృష్టి ఆగిపోతుంది. అంతర్లీనముగా ఆనందము ఉన్న ప్రజోత్పత్తి, సృష్టి ఆగిపోతుంది. ప్రకృతిని కాపాడే కారుణ్యము ఉన్న అమ్మవారు ముందుకు వచ్చి మన్మధుని పునర్జీవితుని చేసింది. మన్మధుడు మనసుని మధించేవాడు. రతి అంటే అనుభవము. ఎవరి కోరిక వారియొక్క అనుభవములో తెలుస్తుంది. రతీదేవికి ఒక్కదానికి మాత్రము కనపడతాడని అనడములోని రహస్యము. ప్రకృతిని కాపాడే కారుణ్యము ఉన్న అమ్మవారు ముందుకువచ్చి మన్మధుని పునర్జీవితుని చేసి ఇకనుంచి నువ్వు అనంగుడివై రతికి మాత్రమే కనపడతావు. పూర్వము ఏమిచేసావో అదే చేస్తూ ఉండమన్నది. ఒకసారి బాణము వేసి దెబ్బతిని ఉన్నవాడు ఎక్కడ, ఎవరి మీద బాణము వేస్తాడు? శివుడు సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాడు. ఒకసారి దెబ్బతిని ఉన్న మన్మధునికి భయము పట్టుకున్నది. ఒక భద్రమైన గృహము ఎంచుకోవాలి అనుకుంటే అమ్మవారి ముఖమే ఇల్లుగా దొరికింది.
కాముడు కాలిపోయిన తరవాత ఆమె మహాకామేశ్వరునికి ఇల్లాలు అయింది. కాముడు లేకపోయినా భార్య కాగలిగినది అంటే ఆ విల్లు బాణములు తాను పట్టుకున్నది. శివకామ సుందరి అయి పరమ జ్ఞాని అయిన శివుని సాకారుని చేసి తన పక్కన కూర్చోపెట్టుకున్నది. ఆవిడ ముఖము చూసేసరికి శివుడు సంతోషమును పొందుతాడు. మన్మధునికి చాలా భద్రమైనది అమ్మవారి ముఖము. అందులో వెళ్ళి కూర్చున్నాడు. రోజూ బాణములు వెయ్యాలి మళ్ళీ పరమశివుడు ఎక్కడ మూడో కన్ను తెరుస్తాడో అన్న భయము. ఎప్పుడూ ఇంటికి తోరణము ఉండాలనుకున్నాడు. ఇంట్లో శుభకార్యము జరుగుతుంటే లక్ష్మికమ్మికి మంగళతోరణము ఉంటుంది. మన్మధుడు తన ఇంటికి మంగళప్రద స్థానములైన అమ్మవారి కనుబొమలను మంగళతోరణముగా కట్టుకున్నాడు భయం పోయింది. వాటిశక్తి వలన ఆయన ఇంటికి అమంగళము లేదు. ఈ నామము స్మరుడి పాలిట మంగళప్రదమైన గృహముగా అమ్మవారి ముఖమై ఆమె కనుబొమలు ఆ ఇంటికి మంగళతోరణములని చెప్పడము. ఏ కోణములో చూసినా అమ్మవారి కనుబొమలు భయమును పోగొట్టకలిగిన శక్తికేంద్రములు.🙏
🙏 శ్రీ మాత్రే నమః 🙏