శ్రీ లలితా పరాభట్టారిక - 21

P Madhav Kumar

‘తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా’


వశిన్యాదిదేవతలు ముక్కుకి ఉండే ఆభరణమును స్తుతి చేస్తున్నారు. ముక్కు వేరు ముక్కుకి ఉండే ఆభరణము వేరు. అమ్మవారు ముక్కుకి పెట్టుకునే ఆభరణమునకు చాలా ప్రశస్తి ఉన్నది. దానిని అర్థము చేసుకుంటే అనన్య సామాన్యమైన ప్రయోజనము కలుగుతుంది. 

‘భా’ అంటే కాంతి. అమ్మవారు పెట్టుకున్న నాసాభరణ కాంతి తారలను తిరస్కరించేదిగా ఉన్నది. సామాన్యముగా తార అనగా నక్షత్రమని అర్థము. తారాకాంతితిరస్కార అనగా స్వయంప్రకాశము కల నక్షత్రముల కాంతిని తొలగతోయకలిగినదని సామాన్య అర్థము చెపుతారు. పెట్టుకున్న ఆభరణము వలన వ్యక్తి శోభ ఇనుమడించాలి. అమ్మవారి ముక్కుపుడకే అంత కాంతిగా ఉంటే అది ధరించిన ఆవిడ ముఖకాంతి ఎంతో గొప్పది అయి ఉండాలి. అది ధ్యానమునకు అవసరమైన వస్తువు. దానితో పోల్చడానికి ఇంక ఉపమానము లేదు. ఉపాసన చేసేటప్పుడు ఆ కాంతిని చూడడములోనే జన్మ సార్థకత అంతా ఉన్నది. ముక్కుపుడక చూస్తే ఒక గొప్ప ఆనందమును అనుభవించడము జరుగుతుంది. అది ధ్యానములోనే అనుభవైక వేద్యము అవుతుంది. అసలు మనసన్నది నిలబడితే ధ్యానం చేయడము కుదురుతుంది. తార అన్న మాటకి ‘తరంత్యనాయనావికా ఇతి తారా’ అనగా దీనిచేత నావికులు తరిస్తారని అర్థం. సముద్రములో వెళ్ళేప్పుడు నావికులు నక్షత్రమండలము వంక చూస్తారు. అంతరార్థముగా నావికులు - సముద్రము ఎవరో కాదు. అందరము తుఫానులో చిక్కుకున్న సంసార సముద్రములో ఉన్న నావికులము మార్గము తెలియదు. ఎటు వెడితే తరిస్తామో తెలియదు. ఇటువంటి సమయములో అమ్మవారి ముక్కుకి ఉన్న ఆభరణము దిక్కు తెలిపే తార. చుక్కాని లేక, మార్గము తెలియక, సుఖ దుఃఖములతో, కోరికలతో  వెంపర్లాడుతూ, మోక్షమార్గములేక, వైరాగ్యధోరణిరాక, సతమవుతున్న జీవకోటి అంతటినీ తరింపచేస్తున్నది. ఆ ఆభరణమునకు నమస్కరిస్తే అమ్మవారి దర్శనమే వేరుగా ఉంటుంది. పెద్దలు ఆభరణముల గురించి అంత స్థాయిలో మాట్లాడారు. నాసాభరణము ఒక్కటే ఎలా రక్షకత్వము వహించి కాపాడకలదు? అక్కడే రహస్యమును అంతటినీ దాచారు.


అమ్మవారి నాసాభరణములో రెండురాళ్ళు ఉంటాయి. ఒకవైపు ముత్యం ఉన్న మాణిక్యము నాసాభరణముగా ధరిస్తుంది. ఒక వైపు తెలుపు కాంతి, ఎరుపుకాంతి పైన ఉన్న తారకలతో పోటీ పడుతున్నది. ఆవిడలో ఉన్న ఎన్నో కాంతులను ధ్యానములో దర్శనము చెయ్యాలి. జీవితములో సుఖ దుఃఖములను నిర్ణయించే మనకు ఉన్న తొమ్మిది గ్రహములనుకూడా తారశబ్దముచే సంకేతిస్తారు. సుఖ దుఃఖములు అనేమాటను, అజ్ఞానము అన్నమాటను రెండుగ్రహములు ప్రధానముగా నిర్ణయిస్తు ఉంటారు. మొదటిది తెల్లగా ఉన్న శుక్రగ్రహం, రెండవది ఎర్రగా ఉన్నకుజగ్రహం. ఇక్కడ ఇంకొక రహస్యము ఉన్నది. గ్రహములలో శనైశ్చరగ్రహము ఆయుర్దాయములను నిర్ణయించగలది. అందుకే కార్తీకమాసములో నువ్వులనూనితో దీపము పెట్టమని చెపుతారు. 

భగవంతుని పాదములు గట్టిగా పట్టుకుని ఉండగా గ్రహములు చెణకలేవు. అమ్మవారి ముక్కుకి ఉన్నది తెలుపురాయి, ఎరుపు రాయని అనుకోకూడదు. అవి శుక్రగ్రహమును, కుజగ్రహమును శాసనము చెయ్యగలవు. సుఖ దుఃఖముల దగ్గరనుంచి సమస్త నవగ్రహములను వాటి కదలికలను, గోచారములను నియంత్రణ చేసి భక్తి వైరాగ్యములను ఇచ్చి మోక్షమువైపు అడుగులు వెయ్యకలిగిన స్థితినికూడా అమ్మవారి నాసాభరణము కలగచేస్తుంది.🙏



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat