🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష - శాస్త్రీయ అవగాహన - 8*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
సిద్ధాంతరీత్యా కాని , ఆచరణలో కాని ఇలా సంపూర్ణ సమానత్వాన్ని పాటించే ఆలయంకాని , యాత్రా కేంద్రంగాని మరెక్కడా చూడలేము. ఇంతటి విశిష్టత కల్గిన ఈ స్వామి దీక్ష , మండల కాలములో ఆచరించే నియమాలలోని శాస్త్రీయతను దృష్టిలో పెట్టుకొని , ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన భౌతిక శరీరమును నియమ నిష్ఠలతో నియంత్రణ మొనర్చి , మనస్సును పరమార్ధిక చింతనవైపు మళ్ళించడం ద్వారా సమాజ శ్రేయస్సు , తద్వారా దేశ శ్రేయోపురోగతులు అభివృద్ధి చెందుతాయనటంలో సందేహంలేదు. సంపూర్ణ సమర్పణభావంతో , శరణాగత భావముతో పైన చెప్పిన నియమాలలోని శాస్త్రీయ అవగాహనను దృష్టిలో వుంచుకొని ఆచరించినపుడు మన దీక్ష , తద్వారా జన్మసాఫల్యమొందుననుటలో అణుమాత్రమైననూ సంశయము అక్కర్లేదు.
అందుకే అన్నిపూజలలో ఆత్మపూజకు సమమైన పూజలేదు. ఈ ఆత్మపూజకు అందరూ అర్హులే. ఆత్మపూజచే బ్రహ్మసాయుజ్యము పొందవచ్చును. అట్టి ఆత్మపూజకు కావలసినవి అష్టవిధపుష్పములు. అవి ఏమనగా...
*అహింసా ప్రథమం పుష్పం - పుష్పం ఇంద్రియనిగ్రహమ్ సర్వభూతదయ పుష్పం - క్షమాపుష్పం విశేషతః శాంతిపుష్పం, తపోపుష్పం - ధ్యానపుష్పం తదైవచ సత్యమష్ట విధపుష్పం - విష్ణోః ప్రీతికరంభవేత్ ॥*
అనగా (1) అహింస ,
(2) జితేంద్రియత్వము , (3) సర్వభూత దయ , (4) సహన శక్తి ,
(5) పరమ శాంతము , (6) తపసు ,
(7) పరమాత్మ యొక్క నిరంతర ధ్యానము ,
(8) సత్యము. ఇవియే దైవ ప్రీతికరములైన , ఆత్మపూజకు అవసరమైన అష్టవిధపుష్పరాజములు.
కుల , మత , వర్ణ , వర్గ రహిత సమాజ స్థాపనమే భారతీయుల ఆదర్శ ప్రభోధము. కులమేదైనా , భాషఏదైనా , ఏప్రాంతమయినా , ఏ మతమయినా మనందరము భారతీయులము. ఆత్మ ప్రకాశము నందు సమత , మమతలు విలసిల్లే సాంఘికసమజీవన వ్యవస్థయందు ఆసక్తిగలవారు భారతదేశములో నున్నంతమంది ప్రపంచమున మరే దేశమున లేరు. *“భారత"* శబ్దములోనే గొప్ప సంస్కారమున్నది. "భా" యన ప్రకాశము. "రత"యన ఆసక్తి. ప్రకాశమునందు ఎవరికి ఆసక్తియుండునో వాడే *"భారతుడు"* అగును. *"భారతీయుడు"* అగును. అందుకే సకల చరాచర సృష్టిలో గల జీవరాసులన్నింటిలో నుండు పరమాత్మ ఒక్కడే. *"సర్వం ఖల్విదం బ్రహ్మం"* అనే సమతావాద ఆదర్శభావముగలవారు భారతీయులు అని సగర్వంగా ప్రపంచ ప్రజలముందు చాటిచెప్పగలుగుచున్నాము.
ఎందరో మహానుభావులు ఎన్ని సందేశములందజేసినను , ఆదర్శములు నిరూపించినను అందుకోలేని ఆర్ధభావనా దరిద్రమైన ఆచరించలేని నైతిక చైతన్య దరిద్రాణమైన , అయోగ్య , అపూర్వ , దౌర్భాగ్య అధ్వాన్న స్థితిలోనున్న దేశము నేడు , అదీగాక ఈనాడు ఎప్పటికంటే బ్రతికి చెడిన దేశము చెడి బ్రతుకుచున్న దేశమైపోయినది. ఈ దేశమున కృతాదిగతయుగములయందు బ్రతికి , బ్రతికి వయసు మళ్ళిన ధర్మదేవత కాలధర్మము పొందిన ఈ కలికాలమున అందున అన్నివిధాలా బరితెగించిన ఈ కాలమున *"శ్రీ అయ్యప్ప స్వామి"* వారి దీక్ష , నామస్మరణమే శిరోధార్యమని నా అభిప్రాయము.
ప్రాపంచిక వ్యధలను తగ్గించుకొనుటకు మార్గము దీక్షా ధారణ ఒక్కటే. ఇందుకు అయ్యప్పస్వామి దీక్ష ఒక్కటే శరణ్యము , బ్రహ్మచర్యము , ప్రాణాయామము , కోరికలను , వ్యామోహమును తగ్గించుకొనుట , ఇంద్రియములను కట్టుబాటులో నుంచుకొనుట , ఏకాంతము , నిశ్శబ్దము , ఇంద్రియ సంయమనము , అరిషడ్వర్గము లను జయించుట , దుస్సాంగత్యము , దుర్యసనములను పరిత్యజించుట మొదలగున్నవన్నియు ధారణాశక్తిని పెంపొందించును.
జీవితమే ఒక యోగము. ఒడిదుడుకులు లేని , సమయాను కూలముగా సంతోషమునొనగూర్చు ప్రక్రియలన్నియ యోగములే , సమస్త చిత్తవృత్తులనడంచి , మానసిక సంకల్ప వికల్పములు లేక , నిశ్చలత్వము నొందుటయేనగును. ఏయే కర్మలను ఆచరింప వలయునో ఆ సూక్ష్మమునెరింగి ఆయా కర్మలను నిపుణత్వముతో ఆచరించుటయు , జయాపజయములు , మానవమానములు , శీతోష్ణాదిద్వంద్వములతో సమత్వభావన కలిగియుండుటయే నిజమైన యోగముగా పేర్కొనవచ్చును.
శబరిమల యాత్రలో సజ్జనులతో సాంగత్యము , దైవభక్తి , స్నేహశీలత , ఏకాగ్రత కలుగుననుటలో సందేహము లేదు. ఈనాడు అయ్యప్పస్వామి వారి దీక్షను స్వీకరించి , ఎన్నో సంవత్సరాలుగా శబరిమలకు వెళ్ళివస్తున్న భక్తులు ఎందరో ఎంతో దుర్గమమైన అరణ్య మార్గములగుండా కాలినడకన వెళ్ళేవారు మరెందరో! ఇందులో యువకులు , మధ్యవయస్కులేగాక , జీవితపు చరమదశలోనున్న వృద్ధులు , మహిళలు మరియు అంగవికలురు ఎందరో కలరు. అంతేగాదు చిదిమిన పాలుగారే చెక్కిళ్ళతో లేబ్రాయములోనున్న మరెందరో పసిబాలురు ఈ యాత్రలో మనకు దర్శనమిస్తారు. ఇందులో కోటికి పడగలెత్తిన ధనవంతులూ , నిత్యం శ్రమిస్తేగాని పూటగడవని గర్భదరిద్రులూ వున్నారు. సదాచారాలు కలిగి , సత్ ప్రవర్తన కలిగిన వ్యక్తులూ , వ్యసనాలకు బానిసలై దుర్వృత్తిలో వున్నవారూ వున్నారు.
వీరంతా దీన్ని ఆశించి ఈ కష్టభూయిష్టమైనయాత్ర కొనసాగిస్తున్నారు ? ఆలోచిస్తే నేటి ఆధునిక సమాజములో ప్రశాంతత కొరవడి , మనశ్శాంతిని కోల్పోయి , నిశ్చల మనఃప్రవృత్తిని కలిగివుండక పోవటం వలన తమ తమ దైనందిన కార్యక్రమాలలో అనుకున్న ప్రగతిని సాధించలేకపోతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. శరీరమే కాకుండా మనసుకూడా ఆరోగ్యముగానున్నపుడే దీక్షా దక్షతలతో పనులు కొనసాగించి సత్ఫలితాలను పొందగలుగుతారు. *"కృషితో నాస్తి దుర్భిక్షం"* అన్నారు. కృషిలేనిదే ఫలితము అంతంతమాత్రమే. ఈకృషికి మూలమైన ఏకాగ్రత మానవునికి చాలా అవసరము. దీనికి ధ్యానము సరియైన మార్గము. అయ్యప్పస్వామి దీక్షాకాలం , మండల రోజులలో అనుసరించే ఆహార నియమాలు , బ్రహ్మచర్య వ్రతము , సత్సాంగత్యము , భగవదారాధన , కులమత విచక్షణలేని సమత్వ భావన మనిషిలోని అహాన్ని తగ్గించి , సహనాన్ని పెంచి-, మానవత్వపు విలువలను పెంచటమే కాక వ్యక్తికి సంకల్ప బలాన్ని ప్రసాదిస్తుందనటంలో సందేహం లేదు.
మూగవానిని పలికించే గ్రుడ్డివానికి కనిపించే , కుంటివారిని నడిపించే , అందరికీ అభయమిచ్చి ఆదరించే కలియుగ దైవం శ్రీ అయ్యప్పస్వామి ధర్మము నాలుగు పాదముల నడవదనియు , మానవులు నీతి గతులుతప్పి , అజ్ఞానాంధకారమున మునిగి తేలుదురనియు , అందువలన భూభారము పెరుగుననియూ యెంచిన హరిహరులు తమ ఇచ్చా క్రియా శక్తులను మిళితముచేసి మానవులకు భక్తి , వైరాగ్యములద్వారా జ్ఞానశక్తిని శ్రీ అయ్యప్ప స్వామి రూపమున ప్రసాదించిరి. మనిషి జన్మించిన కారణము , మానవజీవిత లక్ష్యము కేవలం తిండి తిని , కోరికలు తీర్చుకొని , సంతానము కని , మట్టిలో కలిసిపోవడం కాదు. అనిత్యమైన , రక్తమాంసయుతమైన శరీరంలో నిత్యమైన భగవజ్యోతి ఒకటి వెలుగుచున్నదని తెలిసి , దానిని అన్వేషించడమే. ఈ వెలుగుబాటయే మానవ జీవిత లక్ష్యమని ఎరింగి అందుకొరకై భగవంతుడిలో భక్తుడు లీనమై శాశ్వితమైన సచ్చిదానందాన్ని అనుభవించడానికి చేసే అనుభవ ప్రయత్నము , అదే శబరిమల యాత్ర, అయ్యప్పస్వామి మండల కాల దీక్ష.
శబరిమల యాత్ర శరీర ఆరోగ్యానికి వ్యాయామంగానూ , వివిధ ప్రదేశాలను విభిన్న శిల్పశాస్త్ర సాంప్రదాయ రీతులను ప్రకృతి పరిశీలనను జరిపే విజ్ఞానదాయక విహారయాత్రగానూ పరిగణింప బడుతుంది. మరియు భక్తుడు భగవంతునిలో లీనమై శాశ్వితమైన సచ్చిదానందాన్ని అనుభవించడానికి చేసే ప్రయత్నము. శబరిమల యాత్రలో కులమత భేదాలు లేకుండా సర్వులకూ ప్రవేశం కల్పించబడింది. అందుకే యాత్రలో ఎన్నికష్టాలు వున్నప్పటికీ ఒకసారి శబరిమల యాత్ర చేసి వచ్చిన భక్తుడు మరలా మరలా యాత్ర కొనసాగించుచూ స్వామిదర్శనానికి తహతహలాడుట వలననే యాత్రీకుల సంఖ్య నానాటికీ ఎక్కువవుతున్నది.
సిద్దాంతరీత్యాకాని , ఆచరణలో కాని ఇలా సంపూర్ణ సమానత్వాన్ని పాటించే ఆలయంకాని , యాత్రా కేంద్రంగాని మరెక్కడా చూడలేము. ఇంతటి విశిష్టత కల్గిన ఈ స్వామిదీక్ష మండల కాలములో ఆచరించే నియమాలలోని శాస్త్రీయతను దృష్టిలో పెట్టుకొని ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన భౌతిక శరీరమును నియమ నిష్ఠలతో నియంత్రణ మొనర్చి , మనస్సును పారమార్ధిక చింతనవైపు మళ్ళించడం ద్వారా సమాజ శ్రేయస్సు , తద్వారా దేశ పురోగతులు అభివృద్ధి చెందుతాయనటంలో సందేహము లేదు. సంపూర్ణ సమర్పణభావముతో , శరణాగత భావంతో పైన చెప్పిన నియమముల లోని శాస్త్రీయ నిబద్ధతను దృష్టిలో వుంచుకొని ఆచరించినపుడు మన దీక్ష , తద్వారా జన్మ సాఫల్యమొందుననుటలో అణుమాత్రమైననూ సంశయము అక్కర్లేదు.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*