*భగవద్గీత - అంతరార్ధ విశ్లేషణ*" - 21వ భాగము.

P Madhav Kumar


మనుజుని శరీరమందు మూడు దేహములుంటాయన్నది శాస్త్రవచనము. వాటిని స్థూల, సూక్ష్మ, కారణ దేహాలుగా అభివర్ణించింది. కారణాదేహమందు అనేక జన్మార్జిత పాపపుణ్యముల వాసనలు బీజరూపంలో వుంటాయి. వాటిప్రభావము మానవుని ఆలోచన, స్వభావము పైన గట్టిగావుంటుంది. అవి తొలగాలంటే సూక్ష్మదేహంలో మార్పురావాలి, అందుకు స్థూలదేహంతో అభ్యాసం చేయాలి. బయట విషయాలపై తిరుగాడు మనస్సును అరికట్టి లోనికి చూచేలా చెయ్యాలి. దీనినే అంతర్ముఖం అంటారు. 


"నేను ఎవరు" అనే ఆలోచన నిరంతరం చేయమన్నారు రమణమహర్షి. ఈ ఆలోచన వలన మనలో వున్న అహంకారము నశించి, అందరిలోనున్న "నేను" తెలుస్తుంది. ఈ అభ్యాసముద్వారా క్రమంగా మనస్సు తేలికపడి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానంతో అనేక జన్మార్జిత వాసనలు నశిస్తాయి. ఆత్మానుభూతితో ఎలప్పుడూ బ్రహ్మానందంలో ఉంటాడు జీవుడు. ఈ ఆనందం శాశ్వతమైనది. ఇదే జీవుని అంతిమలక్ష్యం కావాలని, తాను అనుభవిస్తూ ఇతరులకు బోధించారు రమణమహర్షి.


వీటన్నింటికి మూలము భక్తి. పరమాత్మ సర్వత్రా వున్నాడన్న విశ్వాసము. దీనికి జంతు, జాతి, కుల, మత, వర్ణ, సాంప్రదాయ, ఆచారవ్యవహారాలతో ఏమాత్రం నిమిత్తంలేదు. ఎవరైనా భక్తివిశ్వాసాలను అలవరచుకోవచ్చును. 


ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, విభీషణుడు మొదలైనవారు రాక్షసులైననూ భక్తులు కాలేదా? గజేంద్రుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన జంతువులు భక్తులు కాలేదా? సంపాతి, జటాయువు పక్షిజాతికి చెందిన వారైనప్పటికీ భక్తులు కారా? గుహుడు, విదురుడు తక్కువజాతివారైనను భక్తులు కారా? కావునా భగవంతునికి కావలసింది భక్తిగాని కులధనవిద్యారూపములు కావు. ఇవి మానవుడు తనకుతాను సృష్టించుకున్న వివక్షలు. అందరూ పరమాత్మ సృష్టిలోని పాత్రధారులే కదా!


ఈ వివక్షత నుండి బయటపడితేగాని అనన్యభక్తి అలబడదు. లేకపోతె జీవుని భక్తి ఒక నటనగా వుంటుంది. జగన్నాటకసూత్రధారికి ఇది తెలియదా? జీవుని అంతరాత్మకు ఇది తెలియదా? ఈ ఆర్భాటం తనను తాను మోసంచేసుకుంటూ, ఇతరులను మోసంచేయడమే అవుతుంది. భగవద్భక్తి విషయంలో జీవునికి పూర్తి అవగాహనవుండాలి. అదే ఇక్కడ చెబుతాడు గీతాచార్యుడు. 


కావునా గృహస్థుడైనను, సన్యాసియైనను, బ్రహ్మచారియైనను ముందుగా తన హృదయమును శుద్ధి చూసుకుంటేగాని భక్తుడు కాలేడు. హృదయశుద్ధిలేక ఎన్ని పూజలు, పునస్కారాలు చేసిన వాటిని పరమాత్మ స్వీకరించడు. ముక్తిపొందాలంటే ముందుగా భక్తి కావాలి! దైవము తప్పా దేనియందును ప్రీతి లేనటువంటి "అనన్యభక్తిని" అలవరచుకోవాలి.

                                                    

🪷⚛️✡️🕉️🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat