శ్రీ లలితా పరాభట్టారిక - 22


‘కదంబమంజరీక్లుప్తకర్ణ పూరమనోహరా’


లోకములో చాలా పవిత్రమైన వృక్షములు కొన్ని ఉంటాయి. అందులో మొదటిది కదంబవృక్షము. అది లోకమంతా ఎండచేత శోషింపబడిన తరవాత వాన పడితే పువ్వు పూస్తుంది. అవి ఎరుపు పసుపు, ఎరుపు రంగులలో మూడేసి పువ్వులు గుత్తులుగా పూస్తుంది. మంజరి అంటే గుత్తి. అందుకే మంజరి అన్న శబ్దము వేసారు. కదంబవనములో తిరుగుతున్న అమ్మవారు కడిమి పూలగుత్తులను ఆభరణముగా చెవిలో పెట్టుకుంటుంది. వీరపత్నులు చెవిలో పెట్టుకునేప్పుడు తొడిమ వెనకకు, పువ్వులు ముందుకి ఉండేట్లుగా పెట్టుకుంటారు. మహావీరుడైన వ్యక్తి వీరకాంతయిన తన భార్యను కౌగలించుకున్నప్పుడు ఉత్తరక్షణములో సేదతీరడానికి ఆవిడ చెవిలో పుష్పగుచ్ఛము పెట్టుకుని అలంకారము చేసుకుంటుంది.


శివుడు కూడా గజాసురసంహారము, వ్యాఘ్రాసురసంహారము, త్రిపురాసురసంహారము యుద్ధములు చేసాడు. మన్మధుని కాల్చాడు. ఆయన చేసిన సంహారములు, యుద్ధములు సామాన్యమైనవి కావు. అది చూసి మహాపురుషులైన వాళ్ళు నిలబడి స్తోత్రము చేసారు. అంత యుద్ధము చేసి ఇంటికి వచ్చి పార్వతీదేవిని కౌగలించుకున్నప్పుడు ఆవిడ చెవిలో ఉన్న మంజరి సువాసనల చేత ఆయన ప్రసన్నుడవుతాడు. ఆవిడ ఏ పువ్వులు పడితే ఆ పువ్వులు పెట్టుకోదు. 

అమ్మవారి పక్కన ఎప్పుడూ అయ్యవారు ఉంటారు. పెద్ద పువ్వులు ఉన్న ఒక తీగ చెట్టుకు అల్లుకుంటే ఆ పువ్వులు బలమైన చెట్టు కాండమునకు నొక్కుకుంటే ఎలా ఉంటుందో అలా అయ్యవారికి అమ్మవారి స్తనములు నొక్కుకుని ఉండగా చూసి దర్శనము అమ్మవారి అనుగ్రహము ఉత్తరక్షణములో కలుగుతుంది. తల్లి తండ్రులుగా వారిద్దరినీ చూసి దర్శనము చేయించడానికి ఈ నామము హేతువై ఉన్నది.


కదంబవృక్షమునకు సంస్కృతములో ‘నీప’ అనిపేరు. ‘నయతి ప్రాణినం సుఖం నీపః’-సమస్త ప్రాణులకు సుఖమును ఇచ్చేదానిని నీప అంటారు. సమస్త ప్రాణుల సుఖము నీటిలో ఉంటుంది. నీరు లేకపోతే ప్రాణం లేదు. ధర్మము లుప్తమై పోతుంది. లింగపురాణములో ఒక మాట చెపుతారు. ఈ లోకములన్నీ నీటి చేత రక్షించే ఈశ్వరుడి పేరు ‘భవ’ వానలుపడితే సంతోషించిన నీప లతలా కదంబవృక్షములా, పుష్పములా, లోకానికి శాంతి కల్పించడము కోసము రాక్షససంహారము చేసే శివుడు, ఆయనకు సంతోషము ఇవ్వగలిగిన అమ్మవారు సుఖములు ఇవ్వడము కొరకు ఉన్నారు. ఈ భావనతో వారికి నమస్కారము చెయ్యడము అలవాటు చేసుకోవాలి. శత్రుసంహారము చేసి వచ్చిన వీరుడైన పరమశివునికి ఆలింగనము చేసుకున్న అమ్మవారి చెవులలో అలంకరించుకున్న కదంబ పుష్పమంజరులనుంచి వస్తున్న సువాసనలు ఆఘ్రాణించి ఉపశాంతి పొందిన శివపార్వతుల పాదద్వందములు చూసి నమస్కరిస్తే సుఖములకు హేతువవుతున్నది. 

అమ్మవారి చెవి పెద్దదిగా, స్థిరత్వముతోకూడి, చక్కటి అమరికతో ఉన్నది కనక అంత పెద్ద కదంబమంజరి పూలగుత్తిని చెవిలో పెట్టుకోగలుగుతున్నది. ఆవిడ ఎక్కడ కూర్చున్నా వినే శక్తి గలిగిన చెవులు. మూకశంకరులకి అమ్మవారు ఎదురుగా నిలబడితే ఆవిడ చెవిలో పువ్వులు ఆయన చూసారు.  ‘అమ్మా! అని నిన్ను పిలిచిన వారి పిలుపులు వినగలిగిన చెవులు నీవి’ అన్నారు.  అమ్మ చెవిలో పువ్వులను ఊహించిన మాత్రము చేత చేసిన తప్పులను కటాక్షముతో క్షమించి దగ్గరకు తీసుకుంటుంది. పైకి నామముల వలె కనపడినా ఎంత అందముగా అమ్మవారి పాదములు పట్టుకుని రక్షణ పొందవచ్చునో ఉపదేశము చేసే అద్భుతమైన అమృతభాండములు.🙏


🙏 శ్రీ మాత్రే నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!