*భగవద్గీత - అంతరార్ధ విశ్లేషణ*" - 23వ భాగము.

P Madhav Kumar


ప్రతి జీవుడు ఆత్మస్వరూపుడు అయినప్పుడు ఇక చెట్లను, పుట్టలను, పటాలను, విగ్రహాలను పూజించడం దేనికి? ఈ బాహ్యవస్తువుల ఆరాధన వెనుకనున్న రహస్యమేంటి? అన్న ప్రశ్నలు చాలాకాలంగా, చాలామందిని వేధిస్తున్నాయి. ఆ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము!


ప్రతీ జడజీవ పదార్ధము పరమాత్మ స్వరూపమే, అందులో ఎటువంటి సంశయము లేదు, మనం దానిని అనుభవపూర్వకముగా గ్రహించాలి. అనుభవం లేని జ్ఞానం అజ్ఞానంతో సమానం కదా! 


అందుకే ప్రతి జడజీవపదార్ధము యొక్క బాహ్య స్వారూప్యముతో పాటూ అందులో అంతర్లీనంగా వున్న చైతన్యాన్ని కూడా తెలుసుకోవాలి. మనం చూసే ప్రతి జడజీవపదార్ధము ఒక ప్రత్యేకతను సంతరించుకొంది. ఉదాహరణకి కొన్నింటిని పరిశీలిస్తే, మామిడిపండులో తియ్యదనం, నిమ్మకాయలో పులుపుదనం, నీళ్లలో జీవశక్తి, పాలలో పౌష్టికశక్తి, పువ్వుల్లో అందం, ఇనుములో గట్టిదనం, తైలములో మండెగుణం, విప్పపువ్వులో మత్తెకించేగుణం, సింహంలో ధైర్యం, ఏనుగులో బలం, ఉడుముకి పట్టుగుణం, జలగకు పీల్చేగుణం, చేపలకు ఈదేగుణం, పక్షులకు ఎగిరేగుణం, మనిషికి సంపూర్ణ జ్ఞానం ఇలా ఎన్నో ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. ప్రతి పదార్ధం ఇంకొక పదార్థంతో ఏదోయొకవిధంగా ఒక క్రియాశీలక సంబంధం కలిగివుంటుంది. వీటి సంపర్కం మూలంగా ఒక క్రొత్త శక్తి ఉద్భవిస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. 


అయితే వీటికి ఆ గుణం ఎలా వచ్చింది? మానవులకు ఇంతటి జ్ఞానశక్తి ఎవరు ప్రసాదించేరు? ఆ లభించిన జ్ఞానంతో మనుజులు బాగా ఆలోచిస్తే ఎదో కనబడని చైతన్యం వీటన్నిటిలో అంతర్లీనంగా వుందన్న విషయం బోధపడుతుంది. ఇలా అన్ని జడజీవవస్తువులలో వ్యాపించివున్న చైతన్యాన్నే మనం పరమాత్మ స్వరూపంగా ఆరాధించడం జరుగుతోంది. 


ఎలాగైతే ఫొటోతో కూడిన Passport, Aadhaar Card, PAN Card ఆ వ్యక్తిని represent చేస్తున్నాయో, అలాగే తమలో నున్న చైతన్యాన్ని ఆయా పదార్ధాలు పరమాత్మ స్వరూపంగా represent చేస్తున్నాయి. అలాంటి పరమాత్మ విభూతిని అన్నిటియందు గుర్తించడమే మనుజుల జ్ఞానానికి నిదర్శనం. అలానే తనలో కూడా నెలకొనియున్న పరమాత్మను గ్రహించడం జీవుని విజ్ఞానానికి నిదర్శనం.


అంతేగాని పరమాత్మ ఎక్కడో, ఎవ్వరికి అంతుచిక్కని ప్రదేశంలో వున్నాడని, ఎవ్వరికి అతడు కనిపించడని, అతని దర్శనం దుర్లభమని, ఏ జడజీవపదార్ధం అతని స్వరూపం కాదని, అనుకుంటూ పొతే అది అజ్ఞానానికి నిదర్శనమే అవుతుంది. అన్నింటిని వాడుకుంటూ, వాటి శక్తిని గుర్తించకపోవడం, జీవుడు చేస్తున్న అన్యాయమే అవుతుంది.


విశ్వమంతా అతని సృష్టే అని భావించినప్పుడు, సృష్టిలోని ప్రతివస్తువు అతని అంశమే అని భావించి, ఆరాధించడంలో ఎంతో మాధర్యం వుంది. ఆ మాధుర్యాన్ని మనసారా గ్రోలినప్పుడే ఆ విశ్వచైతన్యం మనకు గోచరమౌతుంది. పరమాత్మ అంశయైన జీవుని ఆత్మ, మళ్ళీ తన నిజస్థానానికి చేరుకుంటుంది.


ఇటువంటి సాధనకు ప్రధానమైనది జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనుజులకు పరిపూర్ణంగా ప్రసాదించేడు పరమాత్మ. ఇక మనదే ఆలస్యం.


వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాము...🪷                                                     🪷⚛️✡️🕉️🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat