శాశ్వతమైనదాన్ని, ఆత్మస్వరూపంగా వెలుగొందుదానిని, చైతన్యవంతమైనదానిని, అన్నింటానెలకొని ప్రకాశించుదానిని, పరమానందాన్ని కలుగజేసేదానిని, పరమాత్మగా పిలవబడేదానిని గ్రహించడానికి, వర్ణించడానికి ఎంతోమంది మహనీయులు ఎన్నోసాధనలు చేసేరు. తుదకు దానిని వర్ణించడం అసాధ్యమని, అనుభూతి ద్వారా మాత్రమే ఆ పరమసత్యాన్ని గ్రహించగలమని తేల్చిచెప్పేసారు.
ఈ ఆత్మానుభూతి పొందడానికి కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు ప్రధానపాత్రపోషిస్తాయని, ఆ వివరాలను భగవద్గీతలో, కృష్ణార్జునసంవాద రూపంలో, వ్యాసమహర్షి ద్వారా, ఎంతో క్షణ్ణంగా మానవులందరికి అందించేడు జగద్గురువైన శ్రీకృష్ణుడు.
ఈ అనుభూతిని పొందడానికి వేషభాషలు, ఆడంబరత, పాండిత్యము, కులమతవర్ణభేదాలు, విశేష శాస్త్రపరిజ్ఞానం అవసరంలేదని, భగవంతుడు సహజంగా అందరి మానవులకు ప్రసాదించిన జ్ఞానం సరిపోతుందని కూడా బోధించేడు గీతాచార్యుడు. తమకున్న పరిమిత జ్ఞానంతో పశుపక్ష్యాదులు కూడా పరమాత్మ వైభవాన్ని గ్రహించగలవని కొన్ని ఉదాహరణలు, సంఘటనలను ద్వారా మనకు వివరించాడు కూడా. అందుకోసం చాలా సూచనలను, సలహాలను మనకు అందించేడు. వాటిని చిత్తశుద్ధితో సాధనచేసి భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడమే జీవుల కర్తవ్యం.
ఆ విషయాలను ఈ "జ్ఞానషట్కము"లో మరొక్కసారి పరికిద్దాము.
అర్జునా! వినుము. సర్వోత్తమము(అన్నింటికన్నా ఉత్తమమైనది), నాశరహితము(నాశనము లేనిది), శాశ్వతమైనది అగు ఆత్మనే బ్రహ్మమని అంటారు. ఆత్మతత్వము (ఆత్మస్వభావము) ను అధ్యాత్మము అని పిలుస్తారు. సకలచరాచర భూతజాలములను ఉత్పత్తిచేయు కార్యమే పరమాత్ముని కర్మ.
నశించే స్వభావము కలిగిన ఉపాధులు(పదార్ధములు) అధిభూతము. దీనినే అపరప్రకృతి అని అంటారు. పరప్రకృతి అయిన పురుషుడే అధిదైవము. సకల దేహములందు అంతర్యామిగా ఉండే పరమాత్మే అధియజ్ఞము. అన్ని యజ్ఞములందు ఆరాధింప బడేది ఇదే.
సర్వము నెఱింగినవాడు, సనాతనుడు, అన్నింటిని శాసించువాడు, అతి సూక్ష్మమైనవాడు, కోటి సూర్యుల కాంతి కలవాడు, విశ్వమంతటికి ఆధారభూతుడు, ఆలోచింప శక్యంకాని రూపమును కలవాడు, అజ్ఞానానికి అతీతుడైనవాడే పరమాత్మ. దానిని గ్రహించాలంటే ప్రతినిమిషం ఆత్మనిష్ఠలో వుండాలి. అన్నింటా, అన్ని ఉపాధులందు పరమాత్మను దర్శించాలి. పరమాత్మయందే విశ్వమంతా వున్నది. విశ్వమంతా పరమాత్మ వ్యాపించియున్నాడు. ఆత్మజ్ఞానముతో అతనిని పొందవచ్చును.
వచ్చే భాగంలో ఇంకొన్ని విషయాలను పరికిద్దాము...🪷 🪷⚛️✡️🕉️🌹