‘కర్పూరవీటికామోదాసమాకర్షద్దిగంతరా’
వశిన్యాది దేవతలు అమ్మవారి నోటిని స్తోత్రము చేస్తున్నారు. ఆవిడ కర్పూరతాంబూలము వేసుకుని నములుతున్నది. తాంబూలములో ప్రధానమైన వస్తువు తమలపాకు. అది పువ్వు పూయదు కాయ కాయదు. లోకములో అటువంటిది తమలపాకు తీగ ఒక్కటే. తాంబూలములో ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరము, కస్తూరి, నాగకేసరములు, జాజికాయలు, పోకచెక్కలు, కొబ్బరి, మిరియాలు, శొంఠి, సున్నము,కవిరి అన్నీ ఉంటాయి. అందులోనుంచి వచ్చిన సువాసనకు దశదిశలలో ఉన్నవారు కూడా ఆ నోటివంక చూసి ఆ వాసన పీల్చి తృప్తి పడుతున్నారు. తమలపాకు బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. దేవేంద్రుడు ఎక్కితిరిగే ఐరావతమును కట్టేసే స్తంభమునకు పుట్టింది. తమలపాకు చర్వణము చేస్తే అది సుమంగళి సూచన. నోటికి సంబంధించిన రోగములు పోతాయి.
తమలపాకు విషయములో ఒక మర్యాద ఉంటుంది అన్ని ఆకులకు ఉండదు. లోకములో రెండు ఆకులను చాలా గౌరవిస్తారు. తమలపాకు నోట్లో వేసుకుంటే నోరు పండింది అంటారు. నోరు ఎర్రబడింది అనరు. గోరింటాకు చేతికి పెట్టుకుంటే పండింది అంటారు చెయ్యి ఎర్రబడింది అనరు.
పదిదిక్కులలో వాళ్ళు అమ్మ నోటివంక అలా చూస్తున్నారు అంటే వాళ్ళందరూ అమ్మ దగ్గర పిల్లలే. వాళ్ళందరి ముందు ఈవిడ జగన్మాతగా నిలబడింది. అమ్మ తింటుంటే పిల్లవాడు చూసి అడిగితే మాత్రము అమ్మతనము అయినప్పుడు పెట్టకుండా ఎలా ఉంటుంది? పెట్టేస్తుంది. మిగిలిన పదార్థములను చేతిలో పెడుతుందేమో కానీ తాంబూలము మాత్రము నోటిలోనుంచి నోటిలోకి పెడుతుంది. అలా చూడడము వస్తే అమ్మవారి తాంబూలము మన నోట్లోకికూడా రావడము ఖాయము. బిడ్డడిగా చూడడము వస్తే దానివలన కలిగే ప్రయోజనమును అనుభవిస్తారు. ఆమోద అంటే అంగీకరించుట అని అర్థము. అమ్మవారు తాంబూలము వేసుకోవడానికి ఒకరి అనుమతి అక్కరలేదు. ఆవిడ జన్మసిద్ధముగా మహాపతివ్రత. తాంబూల చర్వణము సుమంగళి హక్కు. ఇక్కడ ఆమోద అంటే పరిమళించుట అని అర్థము. ఆ శక్తి అమ్మవారి నోటి తాంబూలమునకు మాత్రమే ఉన్నది. లోకములో అటువంటి తాంబూలము ఎవరూ వేసుకోలేదు. పరిమళము మనసును ఆకర్షిస్తే సమాకర్షి అంటారు. ముక్కుకి మాత్రమే సుఖమును ఇస్తే దానిని సురభి అంటారు. ఈ నామమును విని కన్నులు మూసుకుని అమ్మవారు తాంబూల చర్వణము చేస్తున్న నోటిని ధ్యానము చెయ్యడము రావాలి. ధ్యానము చెయ్యడము ప్రారంభించగానే అక్కడ ఆవిడ తప్పకుండా ఉంటుంది. తాంబూల వాసనలు ముక్కుకి తగులుతాయి. కళ్ళు తెరవకుండా ఆ వాసనను ఆఘ్రాణించాలి. రెండవ స్థాయిలోమనసు కూడా ఆకర్షింపబడిపోయింది. అంతర్నేత్రముతో సువాసన చూడగానే ముక్కు పని చేసింది. ఆవిడ తాంబూలము నములుతుంటే తెల్లటి పలువరస, ఎర్రటి పెదవులు, ఎర్రటి నాలుక, దవడలు, ఎర్రటి బుగ్గల భాగము తమలపాకు పిడచలు, ఇంకా బాగా నమలకుండా ఉన్న వక్క పలుకులు, తెల్లటి కర్పూర కళికలు కనపడిన ఉత్తరక్షణములో ఆ నామప్రయోజనమును అక్కడే అప్పుడే పొందడము జరుగుతుంది. అది ఏ కోరిక అయినా తీరుస్తుంది. నిరక్షరకుక్షి మహాకవి అయిపోతాడు. మనస్సులో ఉన్న ధర్మబద్ధమైన కోరికలు అన్నీ తీరుతాయి.
శంకరభగవత్పాదులు తాంబూల చర్వణము చేస్తున్న అమ్మవారిని చూపిస్తే చూసినా, విన్నా తరిస్తారనుకుని ఒక గొప్ప నాటకీయ సన్నివేశమునకు రూపకల్పన చేసారు.
రణే జిత్వా దైత్యా నపహృతశిర స్ర్తైః కవచిభిః
నివృత్తై శ్చణ్డాంశత్రిపురహర నిర్మాల్య విముఖైః ।
విశాఖేన్ద్రో పేన్ద్రై శ్శశివిశద కర్పూరశకలా
విలీయన్తే మాత స్తవ వదన తాంబూల కబళాః ॥
సౌందర్యలహరిలో ఈ శ్లోకము మన మనసుని బాగా హత్తుకుని మన కళ్ళ ముందు ఒక చిన్ననాటకము నడుస్తుంది. ప్రత్యేకముగా నాటకీయ సన్నివేశమును చూపించారు అంటే అది మనసుమీద ముద్ర పడవలసిన విషయము అని గుర్తు. ఏది దర్శనము అవ్వాలో అది చదివినా, విన్నా దర్శనము అవుతుంది. అయినందువలన దాని ఫలితము వచ్చేస్తుంది.
మొదటి పాదములో వర్ణిస్తూ రాక్షసులను యుద్ధమునందు జయించి పరుగు పరుగున వచ్చారు అన్నారు. మూడో పాదములో విశాఖుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు అంటూ ముగ్గురి పేర్లు చెప్పారు. విశాఖుడు అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ముగ్గురూ యుద్ధములో రాక్షసులను గెలిచి వచ్చారు. ఇంద్రో అనగా ఇంద్రుడు. ఉపేంద్రుడు అనగా ఇంద్రుడి తమ్ముడు.
త్రిమూర్తులలో ఉన్న విష్ణువు అనుగ్రహముతో కదా ఇంద్రుడు నిలబడేది. లౌకికమర్యాదలతో బంధువుల వరసలో చూసినప్పుడు విశాఖుడు శ్రీమహావిష్ణువునకు మేనల్లుడు. నారాయణ ‘ పుం’ శబ్దము పురుషుడు. నారాయణి ఆడది. నారాయణ శ్రీమహావిష్ణువు, నారాయణి పార్వతీదేవి. అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ నల్లగా ఉంటారు అలంకార ప్రియులు. కనక పార్వతీదేవి యొక్క కుమారుడైన సుబ్రహ్మణ్యుడు శ్రీమహావిష్ణువుకి మేనల్లుడు. మురుగన్ అంటే సుబ్రహ్మణ్యుడు మరుమగన్ అంటే మేనల్లుడు. నారాయణుని కుమార్తె అయిన వల్లిని ఆయన చేసుకున్నాడు అల్లుడే మేనల్లుడు. సుబ్రహ్మణ్యునికి మేనమామ, ఇంద్రుడికి రాజ్యమును ఇవ్వగల విష్ణువు పేరు ముందు చెప్పాలి కదా! అంతటి మహానుభావుడు, మాహాజ్ఞాని శంకరాచార్యులవారు అలా ఎందుకు ఇచ్చినట్లు? ధర్మము ఎప్పుడూ దేశము, కాలము, వర్ణము, ఆశ్రమములను పట్టి ఆధారపడుతుంది. ఆ సమయములో ఏది చెపుతున్నారో దాని బట్టి పెద్దరికము. సందర్భమును పట్టి ధర్మము ఉంటుంది.
ఇక్కడ సందర్భము వాళ్ళు యుద్దమును గెలిచివచ్చారు. యుద్ధమునకు వెళ్ళినప్పుడు సైన్యాధిపతి దేవసేనను నడిపించినవాడు సుబ్రహ్మణ్యుడు. యుద్ధము ఎవరు చేసి గెలిచినా, అభినందనలు సైన్యమును నడిపించిన వారికి ఇస్తారు. యుద్ధమున సైన్యమును నడిపించిన ఆయనను మొదట చెప్పాలి. దేవసేనాధిపతి సుబ్రహ్మణ్యుడు అందుకని విశాఖ అన్నది మొదటిమాట. ఇంద్రుడు రెండవస్తానములో ఇచ్చారు. ఆయన దేవలోకములకు అధిపతి. ఉపేంద్రో అనగా ఇంద్రుడి తరవాత పుట్టినవాడని అర్ధము. అన్నగారిది పెద్దస్తానము. విష్ణువు ఒక అవతారములో ఇంద్రునికి అన్న. వామనమూర్తిగా వచ్చినప్పుడు అదితి కడుపున పుడతానని కోరి కోరి తానే అడిగి ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు. ఆయన సమస్త బ్రహ్మాండములకు అధిపతి ఇంద్రుడికి తమ్ముడిగా, వామనమూర్తిగా పుట్టి రాజ్యమును పుచ్చుకుని ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ ఉపకారబుద్ధిని, ప్రేమ చూపించడానికి ఉపేంద్ర అన్నశబ్దము వేసారు. ఇంద్రుడి తరవాత స్థానము ఉపేంద్రుడిది కనక మూడవస్తానములో వేసారు. వీళ్ళు ముగ్గురూ కలసి రాక్షసుల మీద యుద్దమును గెలిచి వచ్చారు వారిని పతకములను ఇచ్చి గౌరవించేవారు ఒకరు ఉండాలి లేదా వాళ్ళు కృతజ్ఞత చెప్పడానికి వస్తే ఇంటి యజమాని పరమశివుడు దగ్గరకి వెళ్ళి శివా! మీ అనుగ్రహముతో గెలిచామని చెప్పాలి. కానీ వాళ్ళు పరిగెత్తుకుంటూ అమ్మవారి దగ్గరకు వెడుతున్నారు. వారు పరదేవత దగ్గరకు ఎందుకు పరిగెత్తుకుని వచ్చారు? అనగా సుబ్రహ్మణ్యుడు రాక్షసులను గెలవడానికి కారణము ఆయన చేతిలోని శూలము. పరదేవతయే శూలముగా మారి సుబ్రహ్మణ్యుడు చేతిలోకి వెళ్ళింది. శక్తిస్వరూపిణి అమ్మ శూలముగా నా చేతిలో ఉన్న కారణము చేత రాక్షససైన్యమును చంపగలిగాను. ఈ శక్తి అంతా మా అమ్మది. అమ్మకు కృతజ్ఞత చెప్పాలని పరుగెడుతున్నాడు. తండ్రి తనలో తను కూర్చుని రమిస్తూ ఉంటాడు. ‘జ్ఞానదాతా మహేశ్వరః’ యుద్ధములో గెలిచారు కనక శక్తికి నమస్కారము చెయ్యాలిఆవిడ సమయానికి స్ఫురణను ఇచ్చి యుద్దమును కదిపి శతృవుని చంపేటట్లు చేసిన తల్లి పరదేవత. ఇంద్రుడు వెనకాల ఎందుకు పరిగెడుతున్నాడు? అనగా దీని గురించి కఠోపనిషత్తులో చెపుతారు.
ఒకప్పుడు ఇంద్రుడు రాక్షసులను సంహారము చేసి వచ్చి ఒకచోట కూర్చుని మనమే గెలిచామని విజయోత్సవము చేసుకుంటున్నాడు. పరదేవత ఒక భూత స్వరూపమును పొంది ఒక గడ్డి పరకను తెచ్చి వాళ్ళ మధ్యలో పడవేసి ఆ గడ్డిపరకను కదపండి అని ఒక పెద్ద అరుపు అరచింది. ఇంద్రుడు నేను గడ్డిపరకను కదపడము ఏమిటి? అని ఓ అగ్నీ! దానిని కాల్చేయ్యి అన్నాడు. అగ్నిహోత్రుడు వెళ్లి దాని మీద చాలాసేపు నిలబడ్డాడు అది అలాగే ఉన్నది. పచ్చి గడ్డిపరక దానిని నేను కాల్చలేక పోయానని చిన్న పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ప్రభంజనుడు ఏదైనా విరిచేసే వాయువుని పిలిచి దానిని తొలగదొయ్యి అన్నాడు. గాలి తన వేగము అంతా పెట్టి వీచినా గడ్డిపరక కదలలేదు. ఇంద్రుడే వెళ్ళి ఎత్తినా ఎత్తలేక పోయాడు. ఆయనకు అనుమానము వచ్చింది ఎదురుగా కనపడుతున్న భూతము శక్తి స్వరూపిణి పరదేవత. ఆవిడ అనుగ్రహిస్తే మనము గెలిచాము. ఆ గెలుపునకు కారణమయిన తల్లికి నమస్కరించకుండా మాది గొప్పతనము అంటే కృతఘ్నత కనక ఆ తల్లికి నమస్కరించాడు. అప్పుడు ఆ తల్లి బ్రహ్మవిద్య నేర్పింది. ఆ బ్రహ్మవిద్య నేర్పిన క్షేత్రము, కఠోపనిషత్తు జరిగిన క్షేత్రము శ్రీ కాళహస్తి. ఇంద్రుడు ఎప్పుడు గెలిచినా అమ్మవారిని జ్ఞాపకము తెచ్చుకుంటాడు. అందుకని పరుగెత్తుకుని వచ్చాడు. విష్ణువుకి ఒకరు చెప్పనక్కరలేదు. స్త్రీ స్వరూపములో ఉంటే అమ్మవారు పుం స్వరూపములో ఉంటే విష్ణుమూర్తి. ఇద్దరూ అలంకార ప్రియులు. ఇద్దరూ రాక్షససంహారము చేస్తారు.
వీళ్ళు ముగ్గురూ ఏ కదలికల యందు విజయము సాధించినా అమ్మవారిని స్మరించి పరుగెత్తారని శంకరాచార్యుల వారు శ్లోకములో చెప్పలేదు. మనము జాగ్రత్తగా ఎందుకు ఈ వరస క్రమములో వచ్చారన్నది ఆలోచించడములో అంతర్లీనముగా పరదేవత పట్ల భక్తిని మనకు ఇనుమడింప చేస్తారు.
వాళ్ళు ముగ్గురూ పరుగెత్తుకుని వస్తున్నారు అలా వచ్చేటప్పుడు ఒక మర్యాద ఉన్నది. పూజ్యభావన ఉంటే మనసులో ఉండే ఆర్తి ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది. మనము శత్రువులను గెలవడానికి కారణము ఆవిడ కృప. అమ్మ అనుగ్రహము లేకపోతే గెలవలేము. ఆ విషయము గబగబా వెళ్లి చెప్పాలి. అమ్మవారి దగ్గరకు వెడుతున్నాము కనక కవచము కట్టుకుని శిరస్త్రాణము పెట్టుకుని అమ్మ దగ్గరకు ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ‘గురుమండల రూపిణీ’ ఆవిడ సమస్త గురువుల యొక్క స్వరూపము. అందుకని వాళ్ళు పెట్టుకున్న శిరస్త్రాణములను తీసివేసి పక్కన పెట్టారు. పాదరక్షలను విప్పి వేసారు. కవచములను విప్పలేదు. వాళ్ళ మనసులో గబగబా అమ్మ దగ్గరకు వెళ్ళి దర్శనము చేసుకుని ఆమె పాదముల మీద పడిపోవాలని, నీ అనుగ్రహము చేత గెలిచామని చెప్పాలని ఎంతో ఆర్తి ఉన్నది తప్ప ఆచారము పాటించకూడదు అన్న నిరసన భావము కాదు. అపచారము విశేషభక్తి వలన ఉపచారము అయింది. చింతామణి గృహము ముందు ఆగారు.
కవచములతో లోపలకు వెళ్ళారు. అలా వాళ్ళు వెడుతుండగా మొదట తండ్రి కూర్చునే గది ఉంటుంది. ఆమె పతివ్రతా స్వరూపిణి భర్తకు గౌరవము ఇస్తుంది. భర్తగారు ముందు కూర్చుని ఉండి వచ్చిన వారిని కలుస్తాడు. ఆయన భోజనము చేసిన పాత్రలు అవీ అక్కడ ఉంటాయి. ఆమె పతివ్రత ఆమె నేను సదాశివుని ఇల్లాలిని అంటుంది. నా అంతటిదానను నేను అనదు. ఆ పాతివ్రత్యము సౌందర్యము. ముందు ఆవిడ భోజనము చేసినదా? ఆయన భోజనము చేసాడా? అన్నది శంకరులు తీర్పు చెప్పకుండా అందమైన ఒక నాటకములా చూపించారు.
వాళ్ళు అలా వెళుతుండగా పరమశివుడు భోజనము చెయ్యగా మిగిలిన పదార్ధములతో కూడిన విస్తరి కనపడింది. శివ ఉచ్ఛిష్ఠమో తేలికగా దొరకదు. యుద్ధము చేసి వచ్చిన వారికి ఆకలి వేస్తుంది. తండ్రిగారి విస్తరిలో వదలిన పదార్దములను పుచ్చుకోవచ్చు దాని వంక చూసారు కానీ పుచ్చుకోలేదు. వాళ్ళు తల తిప్పుకుని వెళ్ళిపోయారు ఎందుకనగా అది చండుడికి చెందాలి. ఆయన పరమశివుని కుటుంబములో ఐదవవాడు. శివుడు ఒక మర్త్యునకు అనగా శరీరముతో పుట్టి శరీరము విడచిపెట్టే ఒక సాధారణమైన మనుష్యునకు శివ కుటుంబమునందు స్తానము ఇచ్చాడు. ఏ ఇంట్లో అయినా యజమాని తినగా మిగిలిన పదార్ధమును తినడానికి సహజమైన హక్కు భార్యది. ఒక్క భార్యకి మాత్రము భర్త తిన్న విస్తరి పరమేశ్వర ఉచ్ఛిష్ఠము. అది ఎంగిలన్న ఆడది సువాసినీ పూజకు అర్హురాలు కాదు. ఏ వ్రతము చేసినా భర్తకి అన్నము పెట్టి ఆ విస్తరిలో భార్య భోజనము చెయ్యాలి. దానివలన లక్ష్మీదేవి యొక్క కృప కలుగుతుంది. లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదముల దగ్గర కూర్చుని ఆయన పాదములు వత్తితే తనను అంతగా అనుగమించే ఆమెను గుండెల్లో పెట్టుకున్నాడు. ఆడదానికి భర్త పరమేశ్వరుడు.
పరమశివుడు తినగా మిగిలిన పదార్ధమును యథార్థముగా పార్వతీదేవి తినాలి. అది ఆవిడ యొక్క సహజమైన హక్కు కానీ పరమశివుడు చాలా విచిత్రమైన వరము చండీశ్వరునికి అయిదవ స్థానం ఇచ్చాడు. ఈశ్వర ప్రసాదము చండీశ్వరుని అనుమతితో తెచ్చుకోవాలి తప్ప శివ ప్రసాదము ఇంటికి తెచ్చుకోకూడదని అనకూడదు. భోజనపాత్రలో మిగిలిన పదార్థములు చండీశ్వరుడు తినాలి. చూసినా తినేసినట్లే అవుతుంది. శివుడు ఇచ్చిన వరమును ఉల్లంఘించినట్లు అవుతుందని చూడరు. మేము మా అదృష్టము వలన పార్వతీ పరమేశ్వరులకు కొడుకుని అని సుబ్రహ్మణ్యుడు, పరదేవత అనుగ్రహము చేత చింతామణి గృహములోకి వెళ్ళగలిగిన అదృష్టవంతుడినని ఇంద్రుడు, ఆమెకీ నాకూ తేడాలేని వాడినని విష్ణువు అనుకున్నారు. ఆ అదృష్టము పొందినవాడు చండీశ్వరుడు. పొందిన వారికి పొందిన అదృష్టము వదలి పెట్టకుండా పుచ్చుకుంటే స్వతంత్రత చూపించినట్లు అవుతుంది. పరమేశ్వరుని భోజనము అయిపోయింది. మిగిలినది చండీశ్వరుడు తినాలి. ఆయన భోజనము అయింది అంటే లోపల ఉన్న ఇల్లాలు భర్తకు పెట్టి తను తింటుంది. అన్నము పెట్టే అమ్మ తను ముందు తినేయ్యకూడదా! శివుడు నువ్వు తినేసావా? అనడు కానీ ఆమె తినదు. ఏ తల్లి కన్ను తెరిస్తే సృష్టి, కన్ను మూస్తే లయము అవుతాయో అటువంటి తల్లి తనకు తాను వేసుకున్న కట్టుబాటు. పరమశివుడు తినకుండా తాను తినదు. అది ఆవిడ పాతివ్రత్యము. ఆయనకు పెట్టిన తరవాత ఆవిడ తిన్నదనే గుర్తు. ఈ విషయములను శంకరులు ఎక్కడా చెప్పలేదు. నాటకీయత అనగా చెప్పకుండా మనకి చూపించడము ధర్మమును నేర్పడము. శంకరుడు ఏమీ పట్టించుకోడు. ఆయనకు పట్టించు కోవలసినంత సమయము ఉండదు. మహాజ్ఞాని అయిన వాడికి పక్కనే ఉండవలసిన లక్షణము శాంతము. ఒకవేళ ఆవిడ ముందు తింటున్నా, అదేమిటి నువ్వు తినేస్తున్నావు? నాకు పెట్టలేదు అని ఏమీ అడగడు. భర్తకు పెట్టడమే పరమేశ్వరునకు పెట్టడము. ఆ తల్లి అన్నము పెట్టింది కాబట్టి లోపల ఉన్నది.
శ్లోకములో అమ్మవారు లోపల తాంబూలచర్వణము చేస్తున్నది. అమ్మవారి దగ్గర ఈ ముగ్గురూ పిల్లలే. సుబ్రహ్మణ్యుడు ఆమె కుమారుడు. అందువలన పుత్రభావముతో వచ్చి అమ్మ నోటివంక చూస్తాడు. రెండవ ఆయన విష్ణువు. ఆయన కొడుకు ఎలా అవుతాడు? నారాయణా - నారాయణి అన్నాచెల్లెళ్ళు అని కదా అంటే ‘కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతి:’ అని లలితా సహస్రములో ఒక నామము. అమ్మవారి వేళ్ళ చివరల నుంచి దశావతారములు పైకి వచ్చాయి. ఆ పది అవతారములు అమ్మవారికి కొడుకులే కాబట్టి విష్ణువు కొడుకు. ఇంద్రుడు భార్య శచీదేవి పూజచేస్తే కొడుకు కాబట్టి అమ్మవారు ఐశ్వర్యమును ఇచ్చింది. ముగ్గురూ కొడుకులు కాబట్టి ఆవిడ జగజ్జనని. వాళ్ళు ఆమెను చూసేటప్పటికి చిన్న పిల్లలయిపోతారు. ఆమె చుట్టూ కూర్చుని అమ్మ నోటివంక చూసారు. అమ్మ నోరు ఎర్రగా ఉన్నది. చంద్రుడు చిన్న ముక్కలు అయినట్లుగా కర్పూర కళికలు తెల్లగా నోట్లో ఉన్నాయి. అమ్మ ఎప్పుడు తాంబూలము వేసుకున్నా -
‘కర్పూరవీటికామోదసమకర్షద్దిగంతరా’ అని నామము. ముగ్గురూ అమ్మ నోరు ఎర్రగా ఉన్నది ఏదో నములుతున్నది నోటిలోని తాంబూలమును చూసారు. అమ్మా ఏమిటమ్మా? అన్నారు. అనగా ఆమెదగ్గర వాళ్ళు అంత చిన్నపిల్లలు. అమ్మ నవ్వి ఆమె నములుతున్న తాంబూలమును పై దవడకేసి నొక్కి పిప్పిలా ముద్దలా ఉన్నదానిని నాలుకతో ముందుకు పెట్టి ఆ తాంబూలపు పిడచను అమ్మవారు వీళ్ళ ముగ్గురికీ పెట్టింది. లౌకికముగా కూడా అమ్మ తాంబూలము పిల్లలకు నోట్లో పెట్టదు. పరమప్రేమతో పిల్లవాడిని దగ్గరకు తీసుకుని నోరు తెరవమని తన నోట్లోనుంచి నాలుకతో పిల్లవాడి నోట్లోకి తోస్తుంది అది అమ్మప్రేమ. అమ్మవారి తాంబూలపు పిడచలను తిన్నవారికి ఏమైనది? అన్న విషయము శంకరాచార్యులవారు నేను చెప్పలేను అన్నారు. ఆ తాంబూలము సుబ్రహ్మణ్యుడు తిన్నాడు కనక స్వామిమలైలో గోచీ పెట్టుకుని బ్రహ్మజ్ఞానిగా నిలబడ్డాడు. దేవసైన్యమునకు అధిపతి అయ్యాడు. నిత్య యవ్వనుడయి వల్లీ, దేవసేనా సమేతుడై లోకము అంతటి చేత పూజింపబడుతున్నాడు. ఇంద్రుడు స్వర్గలోక వైభవమును అనుభవిస్తున్నాడు. విష్ణువు శ్రీమహాలక్ష్మికి భర్త అయి లక్ష్మీ నారాయణుడు అనిపించుకున్నాడు. ఎందరో రాక్షసులను నిగ్రహించి దశావతారములను ఎత్తి ధర్మ సంస్థాపన చెయ్యకలిగాడు అంటే అమ్మ నోటి తాంబూలపు పిడచ మహిమ.
https://chat.whatsapp.com/Ej9npbCk63WHwcGnD0tr7X
అమ్మవారి తాంబూల పిడచ మహిమ వలన జన్మతః మూగివారు అయిన శంకరులు అనర్గళముగా ఐదువందల శ్లోకములు చెప్పారు. అమ్మవారే అనుగ్రహించి చెప్పించినది. అమ్మవారు సంతోషించి ఏమి కావాలని అడిగితే తన వాక్కు తీసివేయమని అడిగారు. ఎందువలన అనగా తనకు పుట్టుకతో వాక్కులేదు అనుగ్రహించి ఐదువందల శ్లోకములు చెప్పే శక్తిని ఇచ్చి మళ్ళీ ఆ వాక్కును ఉంచితే పనికిరాని మాటలు మట్లాడవలసి వస్తుంది. అందుచేత వాక్కు వద్దు అన్నారు.
ఆ నోటివంక ఒక్కసారి ధ్యానములో చూడకలిగితే చాలు భర్తకు వస్తున్న గండము తొలగిపోతుంది. ఆ శ్లోకము రోజూ చదివి పరదేవత దగ్గర అమ్మవారి నోటిని దర్శనము చేసి తాంబూలము వేసుకుంటే సువాసినీత్వము నిలబడుతుంది. బిడ్డలు కలుగుతారు. ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. సువాసినీ పూజ చేయించుకునే అర్హత కలుగుతుంది. పార్వతీదేవి కొడుకులు ఇద్దరూ ఎంత గొప్పవాళ్ళో అంత గొప్ప సంసారము అవుతుంది. ఆ తల్లి తాంబూలపు పిడచలు తిన్న వారు ముగ్గురూ ఎంత శక్తిని పొందారో తాంబూలము చర్వణము చేస్తున్న నోరు, ఆ పిడచ ఏమి చెయ్యగలదో నేను చెప్పలేనమ్మా అంత గొప్పది కాబట్టి నేను ఫలశృతి చెప్పను అన్నారు.🙏
🙏 శ్రీ మాత్రే నమః🙏
J N RAO 🙏🙏🙏