శ్రీ వేంకటేశ్వర వైభవం - 28

P Madhav Kumar


*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*


*🌻16. ఆణివర ఆస్థానోత్సవము🌻*


🍃🌹అఖిల బ్రహ్మాండ నాయకుడై అపార కారుణ్య సాగరుడై (తిరుమల) శేషాచలమునందు ఆశ్రిత రక్షణార్థమై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి సంవత్సరము దక్షిణాయన ప్రారంభ దినమున ఆనివర ఆస్థానము అను పేరుతో ఒక మహత్తరమగు ఆస్థానోత్సవము జరుగును.


🍃🌹ఆ పర్వదినమునందు శ్రీ స్వామివారికి విశ్వరూపము, తోమాల సేవ జరిగిన వెంటనే ఉత్సవమూర్తులగు శ్రీమలయప్పస్వాముల వారికి వారి పట్టమహిషులగు శ్రీ భూదేవులకూ సేనాధి పతియగు విష్వక్సేనుల వారికి ఏకాన్తముగా అభిషేకము (తిరుమంజనము) జరుగును. తరువాత శ్రీ స్వామివారికి అర్చనము జరిగి కొలువు లేకనే (నివేదనము) మొదటి ఘంట జరుగును. వెంటనే శ్రీమలయప్పస్వామివారు శ్రీ భూదేవులతో సువర్ణ ద్వారము ముందుగల ఆస్థాన మండపమునందు అమర్చియున్న బంగారు సర్వభూపాల వాహనమందు వేంచేయుదురు. వారలకు వజ్రకవచాద్యాభరణములతో అతిమనోహరముగా అలంకారము సమర్పింపబడును. 


🍃🌹సేనాపతివారు శ్రీవారి పార్శ్వమునందు వేరొక పీఠము మీద దక్షిణాభిముఖముగా వేంచేయుదురు. వారికీని తిరువా భరణములు సమర్పింపబడును. శ్రీవార్లకు అతివైభవముగా పుష్పమాలలతో అలంకారము సమర్పింపబడును. తరువాత శ్రీవారి సన్నిధానము లోను, ఆస్థానములోను రెండవ అర్చనము అయిన పిమ్మట పేష్కార్లు, పారుపత్య దార్లు, ఇతర ఉద్యోగస్థులు పెద్దజియ్యంగార్లు, చిన్నజియ్యంగార్లు, ఏకాంగులు, ఆచార్యపురుషులు వెంటరాగా మంగళ వాద్యములు, శ్వేతచ్ఛత్రములు, చామరములు వగైరా మర్యాదలతో శ్రీస్వామివారి ప్రసాదములను గమేకార్లు విమాన ప్రదక్షిణముగా ధ్వజప్రదక్షిణము చేయించి తెచ్చి శ్రీవారి సన్నిధానమున, ఆస్థానము నందును ఉంచెదరు. వెంటనే శ్రీవార్లకు ఆరగింపు రెండవమంట సన్నిధి లోను, ఆస్థానములోను జరుగును.


🍃🌹తరువాత శ్రీవారికి నూతన వస్త్రములను ఆరింటిని వెండితట్ట యందుంచుకొని జియ్యంగార్లు శిరస్సునవహించి మంగళవాద్యములు, శ్వేతచ్ఛత్రములు వగైరా మర్యాదలతో దేవస్థానం అధి కార్లు అందరు వెంటరాగా విమాన ప్రదక్షిణముగా శ్రీస్వామివారి సన్నిధి లోనికి వచ్చెదరు. అర్చకులు ఆతట్టలోని ఆరు వస్త్రములలో నాలుగు వస్త్రములను శ్రీస్వామివారికి సమర్పించెదరు. వెంటనే శ్రీవారికి హారతి జరిగి గోష్ఠికి మామూలు ప్రకారం తీర్థం, ఆలవట్టం, చందనం, శఠారి, మడుపు వినియోగం జరుగును. తరువాత జియ్యంగార్లు మిగిలిన రెండు వస్త్రములుగల తట్టను శిరస్సుయందుంచుకొని ఆస్థాన మండపమునగల శ్రీమలయప్పస్వామివార్ల సన్నిధికి వచ్చెదరు. అర్చకులు ఆ రెండువస్త్రములలో ఒక వస్త్రమును శ్రీమలయప్పస్వామివారికి మరియొక వస్త్రమును శ్రీసేనాధి పతివారికి సమర్పించెదరు. 


🍃🌹అర్చకులు శ్రీ సేనాధిపతివారికి శ్రీపాదవస్త్రముతో పరివట్టం కట్టి శ్రీ శ్రీ మలయప్పస్వామి వారికి అక్షతారోపణము చేసి సేనాధిపతివారికి శఠారిసాయించి పరివట్టంబిచ్చెదరు. అర్చకులకు శఠారి మర్యాదలు జరుగును. తరువాత ఆస్థానము (కొలువు) అయి హారతి జరుగును. వెంటనే పెద్దజియ్యంగారు వారికి పరిపట్టముకట్టి శ్రీవారి పాదారవింద ముల యందుంచబడిన వారి స్వంత మొహరును వారిచేతికి యిచ్చి దేవస్థానంలచ్చన అనుబీగాల గుత్తిని వారి చేతికి తగిలించి చందన తాంబూలాది మర్యాదలు చేసెదరు. తరువాత ఆ లచ్చన అను బీగాలగుత్తిని శ్రీస్వామివారి పాదారవిందములయందుంచెదరు. 


🍃🌹చిన్న జియ్యంగారువారికి వారిస్వంత మొహరును వారిచేతికి యిచ్చి పై విధముగా వారికిని మర్యాదలు జరుగును. తరువాత ఏకాంగి వారికి, తరువాత దేవస్థానం కమిటీవారి తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వారికి యావత్తు మర్యాదలు జరుగును. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరువారికి మాత్రము శ్రీవారి పాదములయందుంచబడిన సర్కారు మొహరు ఇవ్వబడును. తరువాత ఆస్థానములో నజరానాకానుకలను ఏకాంగివారు వసూలుపరిచి సర్కారు వారి వశంచేసెదరు. వారు చిట్టాను జమకట్టెదరు. తరువాత ట్రస్టీలు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, పేష్కారు, పారు పత్యదారు, మైసూరురాజా, తాళ్ళపాకంవారు, తరిగొండవారు వీరి యొక్క హారతులు చేయబడును. తరువాత ట్రస్టుఫండు హారతులు రూపాయ హారతులు జరుగును. 


🍃🌹తరువాత జియ్యంగారు వారికి, ట్రస్టీలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వారికి మర్యాదలు జరుగును. పిమ్మట శ్రీ స్వామివారికి నివేదింపబడిన చందన, తాంబూల ప్రసాదములు గోష్ఠి మర్యాద ప్రకారముగాను, ఇష్టవినియోగ ప్రకారముగాను జరుగును. తరువాత యాత్రికులకు ప్రసాదవినియోగము వగైరాలు జరుగును. శ్రీస్వామివారు. శ్రీభూదేవులతో, శ్రీ సేనాధి పతివారితోను ఆస్థానము నుండి సన్నిధి కి వేంచేయుదురు. ఇదియే ఆణివర ఆస్థానోత్సవము.


  *🙏ఓం నమో వేంకటేశాయ🙏*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat