ఇంకొన్ని విషయాలను ఈ "జ్ఞానషట్కము"లో మరొక్కసారి పరికిద్దాము.
వేదములందు, యజ్ఞములందు, తపస్సులందు, దానములందు ఎటువంటి పుణ్యఫలము చెప్పబడినదో దానినంతటిని అతిక్రమించిన పుణ్యమును కేవలము నన్ను తెలుసుకొనుటద్వారా పొందవచ్చునని తెలియజేసేడు జగద్గురువు శ్రీకృష్ణుడు.
పుట్టినవానికి మృత్యువు తప్పదు. అది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలీదు. అది రాకముందే దానిని నివారించే మార్గము కనుక్కోవాలి. అక్షరమైనదానిని (నాశనము లేనిదానిని) పొందాలి. అందుకోసము నిష్కామముతో జీవుడు తాను నిర్వహించవలసిన విధులు నిర్వహిస్తూ, సర్వకాలసర్వావస్తలయందు పరమాత్మయందు అర్పితమైన మనస్సు, బుద్ధి కలవాడైయుండాలి. అందుకు ఏమాత్రము ఆలస్యము చేయకుండా సాధనచెయ్యాలి.
అర్జునా! మనుజులకు ఇది సాధ్యమే. ఎందుచేతనంటే ప్రతిజీవి పరిశుద్ధమగు ఆత్మస్వరూపమే. శరీరము కేవలం ఉపాధి మాత్రమే. పంచభూతములతో కూడిన ఈ దేహమునకు-జీవునికి నిజంగా ఎటువంటి సంబంధము లేదు. అటువంటి బుద్ధితో సాధన చేయుము. సాధన చేయుట జీవుని ధర్మము, సాయము చేయుట పరమాత్మ ధర్మమని, పార్థునికి ధైర్యాన్ని ప్రసాదించేడు శ్రీకృష్ణుడు.
మానవుడు, తన తల్లితండ్రులను, బంధువులను, భార్యాబిడ్డలను, స్నేహితులను, శత్రువులను, తన స్థిరాస్తిని, చరాస్తిని, తన పరపతిని, తన పేరుప్రతిష్ఠలను తెలుసుకుంటున్నాడు గాని "అసలు తానెవ్వడో" తెలుసుకునే ప్రయత్నం మాత్రం చెయ్యడంలేదు.
అంతా సాఫీగా జరుగుతున్నంతసేపూ తననుతాను పొగుడుకుంటూ, కాస్త దుఃఖం ఎదురైనప్పుడు ఒక బాహ్య స్వరూపాన్ని భగవంతునిగా ఆరాధిస్తూ, ఇంకాస్త దుఃఖం వచ్చినప్పుడు అన్నింటిని భగవత్స్వరూపంగా భావిస్తూ, పూర్తి దుఃఖంలో వున్నప్పుడు మాత్రమే అంతర్విశ్లేషణ చేసుకుంటూ, పరిస్థితులు తిరిగి బాగుపడినప్పుడు మళ్ళీ తననుతాను కీర్తించుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నాడు. కానీ ఒక స్థిరమైన అభిప్రాయానికి మాత్రం రాలేకపోతున్నాడు. దానిమూలంగా తన నిజస్వరూపాన్ని గుర్తించలేకపోతున్నాడు. తుదకు తాను ఎంతో కృషితో సంపాదించిన ప్రతి వస్తువుని ఇక్కడే వదిలిపెట్టి ఈ దేహాన్ని త్యజిస్తున్నాడు.
ఇలాంటి మరణాలను తాను దగ్గరుండి ఎన్ని చూస్తున్నా, "స్మశాన వైరాగ్యం" అని భావిస్తూ, వాటిని అతి త్వరలోనే మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాడు గాని శాశ్వతపరిష్కారం గురించి ఆలోచించడు.
తదుపరి భాగంలో ఇంకొన్ని విషయాలను పరికిద్దాము...🪷 🪷⚛️✡️🕉️🌹