శ్రీ లలితా పరాభట్టారిక - 28 ‘నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ’

P Madhav Kumar

 

‘నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ’


ఈ నామము పైకి చూడడానికి అమ్మవారి గాత్ర మాధుర్యమునకు ఇవ్వబడిన కితాబులా అనిపిస్తుంది. తనదైన సల్లాప మాధుర్యము చేత సరస్వతీదేవి వీణ అయిన ‘కచ్ఛపి’ ఆలాపన తిరస్కరించిన వాగ్వైభవము కలిగిన తల్లి అని ఈ నామమునకు అర్థము. ఈ నామములోని లోతులను పరిశీలిస్తే దాని వైభవము వేరుగా ఉంటుంది. పాలలోనే ఉన్న నెయ్యి దొరకాలి అంటే కొంత పరిశ్రమ చెయ్యాలి. పాలు కాయాలి చల్లారాక తోడు పెట్టాలి. అది పెరుగు అయ్యాక కవ్వముతో చిలికితే వెన్న వస్తుంది దాన్ని చక్కగా నిప్పులమీద కాస్తే చక్కటి నెయ్యి వస్తుంది. లలితా సహస్రనామమునకు ఉన్న గొప్పతనము నామముగా కనపడినా దానిలో ఉన్న వైభవము అందడానికి కొంత అంతర్మథనము చెయ్యాలి. ఈ నామములో అమ్మవారు చేసిన సల్లాప మాధుర్యము చేత సరస్వతీదేవి వీణ తిరస్కరింపబడినదని చెప్పటం జరిగింది. వీణ ఎక్కడైనా ఒక్కలాగానే ఉంటుంది. ఎవరు వాయించినా పలుకుతుంది. ఎంత సరస్వతీదేవి వీణయినా తనంత తను మ్రోగదు. అమ్మవారు చాలా సంతోషముగా ఉన్నదని నిజసల్లాప అన్నమాట అన్నారు. ఆవిడ చాలా హాయిగా కూర్చుని తాంబూల చర్వణము చేస్తూ వీణానాదము ఆస్వాదిస్తున్న స్వరూపము కనపడాలి. ఆవిడ ‘ఆహ్’ అనగానే  తన వీణ మాధుర్యము కన్నా నీ మాట మాధుర్యము చాలా గొప్పగా ఉన్నది కాబట్టి కచేరీ ఎందుకని కచ్ఛపి ఆపేసింది. మంచిపాట కూర్చి, పాడుతూ,  వీణ బాగా వాయించావని అమ్మవారు కితాబు ఇచ్చింది. కితాబు సరస్వతీదేవిది అయితే ఆవిడ మీదకి దోషము రాకుండా కచ్ఛపి మీదకు ఎలా వచ్చింది? కచేరీ ఆపేస్తే అమ్మవారు ఏమీ అనుకోరా? వశిన్యాది దేవతలు ఇలా ఎందుకు పెట్టారు?  ఈ నామము పదహారు అక్షరములతో ఎలా వచ్చింది? దీనికి సమాధానము చెప్పకలిగినవారు ప్రజ్ఞావంతులు శంకరాచార్యులు. నామము బాగా అర్థము అయ్యేట్లుగా శ్లోకము తీసుకుని వస్తారు. అది వారి ప్రజ్ఞ. 

విపంఞ్చ్యా గాయన్తీ  వివిధమపదానం పురరిపో

       స్త్వయారభ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే, |

      తదీయై ర్మాధుర్యై  రపలపిత తన్త్రీకలరవాం

      నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతమ్ || 

           లలితా సహస్రములో ఏమున్నదో ఖచ్చితముగా దానినే ఇక్కడ తీసుకుని వస్తున్నారు. శంకరాచార్యులవారు కొత్తగా ఏ సూచనలు చేస్తున్న వాటిని పట్టుకోవాలి. విపంచి అంటే వీణ. ఇక్కడ సరస్వతీదేవి వీణను వాయిస్తున్నది అంటే అది కచ్ఛపి అయి ఉంటుంది. ఎక్కడ కచ్ఛపి దగ్గర అనుమానము ఆగిందో దానిని తీర్చడానికి వీణను ముందుకు తీసుకుని వచ్చారు. వీణ వాయిస్తూ ఆవిడ పాట కూడా పాడుతున్నది అంటే కవిత్వం కూడా అల్లుతుందని గ్రహించాలి. 

  ఇంతకు ముందు లేని కొత్త విషయమును ఒకదానిని శంకరులు చెపుతున్నారు. సరస్వతీదేవి పురరిపునికి సంబంధించిన కీర్తనలు పాడింది అన్నారు శివుడివి అని ఆయన చెప్పలేదు. ఆయన శివ సంబంధము చెప్పలేదు. శివ అంటే మంగళం పొరపాటున శివా అని దీర్ఘము తీస్తే పార్వతీదేవి అవుతుంది. పురరిపుడు అంటే శివుడు ఒక్కడే. త్రిపురసంహారము చేసినవాడు బహులీలలు చేసి ఉన్నాడు. పురరిపుడు అమ్మవారి భర్త. ఇక్కడ కొంచము జాగ్రత్తగా పట్టుకుంటే పురరిపుడు అయినవాడు ప్రభువు. ఈవిడ ఆయనకు భార్య మహాపతివ్రత. ఇక్కడ అన్వయము కొంచము జాగ్రత్తగా తీసుకోవాలి. అమ్మవారు వింటున్నది తనగురించి కాదు మహారాజ్ఞిగా ఆవిడను కవులు స్తోత్త్రము చేస్తే అవి తన మీద కనక ఆవిడ శిరః కంపనము చేయదు.  ఆమె మహాపతివ్రత ముందు భర్తను స్తోత్త్రము చేస్తే ఆమె ప్రీతిపొందుతుంది. చాలా సంతోషముతో పొంగిపోయి తల ఊపుతుంది. ఈ విషయము సర్వజ్ఞ అయిన సరస్వతీదేవికి తెలుసు. లలితాదేవి హృదయము తెలుసు. అమ్మవారి మీద కీర్తన చేస్తే పెద్ద శ్రద్ధతో వినకపోవచ్చు. శివుని మీద కీర్తన చేస్తే విని ఆనందాన్ని అనుభవిస్తుంది.  

  కీర్తనను వింటున్న అమ్మవారు ధ్యానములో ఎలా కనపడాలి అంటే సౌందర్యలహరిలో శివానందలహరి ప్రవేశించింది. పరమశివుని కూర్చి వినడములో ఆనందముతో కన్నులు మూతపడి తలను ఊపుతున్నది. ఆమె తాటంకములు అటూ ఇటూ ఊగుతున్నాయి. సభలో కూర్చున్న అమ్మవారు సౌందర్యలహరి ఆవిడలో శివానందలహరి. ఆరెండూ కలసిపోయిన నామము.  

 ఆనందములో సౌందర్యలహరిలో శివానందలహరి మమైకమయిపోతే ఇంక వాక్యనిర్మాణము ఉండదు. ఆ ఆనందములో అమ్మవారు ‘ఆహ్’ అంటూ పొంగిపోతున్నది. శంకరుని స్తోత్త్రము చేసిన చోట ఆవిడ ప్రసన్నురాలు అవుతుంది. శివనింద జరిగినచోట శిక్ష కూడా వేయిస్తుంది. 

                శివుని మీద కీర్తినలు వింటూ పొంగిపోతున్న అమ్మవారు ‘ఆహ్’ అని అనడము సరస్వతీదేకి సంతోషకారకమే!  అమ్మవారు ఆహ్ అనగానే సరస్వతీదేవి పాట ఆపివేసింది. పాట ఆపివేయడానికి ముందు సాహిత్యము ఆగిపోయింది. ఎందుకు ఆపివేసింది? అంటే ఆవిడ ఒక కృతనిశ్చయానికి వచ్చింది ‘నేను కచేరీ చేసి అమ్మవారిని సంతోష పెట్టాలని అనుకుంటే నన్ను సంతోషపెట్టాలని ఆవిడ ఆహ్  అన్న ఒక్క మాటముందు నా కచేరీకానీ, వీణకానీ, సాహిత్యముకానీ సరిపోవు. అయినా ఆనందము అనుభవించింది అంటే శివుని కీర్తనలు పాడటము వలన విన్నది నావల్లనే పొంగిపోతున్నది అనుకున్న నేను ఆమె గొప్పతనము తెలుసుకున్న తరవాత కూడా పాడటమేనా? అని  ఆవిడకు నమస్కారము చేసి అమ్మా! ఆ మాటకే ఇంత మాధుర్యము ఉంటే నా కచేరీకి ఇంకా మాధుర్యము ఉండేట్లు అనుగ్రహించని అమ్మవారి కాళ్ళ మీద పడాలి. ఇంకా పాడుతూ ఉండకూడదని ఆపింది. కనక సరస్వతీదేవి కచేరీ ఆపడములో దోషము లేదు పరమవినయము ఉన్నది. దోషాన్ని సరస్వతీదేవి మీద చెప్పకుండా కచ్ఛపి మీద ఎందుకు చెప్పారు? 

   శంకరులు కచ్ఛపికి గలీబు తొడిగింది సరస్వతీదేవి అంటున్నారు. వీణ వాయిస్తున్నప్పుడు తీగను మీటితే శబ్ద తరంగములు వస్తాయి. అలా రావడము, వినడము సంగీతములో ‘అనురాననం’ అంటారు. అమ్మవారి గొప్పదనమును సరస్వతీదేవి గ్రహించింది. అమ్మకు నమస్కారము చేసి ఇంకా బాగా గొప్పగా పాడేట్లుగా కోరుకోవాలి కానీ ఆహ్ అన్నదని ఇంకా పాడేస్తే అంత సమర్థత కలిగిన తల్లి ముందు ఈ అనుకూల స్థితిలోనే ఆమె మెచ్చుకున్నప్పుడే అమ్మ అనుగ్రహం పొందాలి. కాళ్ళమీదపడి నమస్కరించి తనకు ఇంకా మాధుర్యము పెరిగేట్లుగా అనుగ్రహించ వలసిందని స్తోత్రము చేసుకోవాలని వినయముగా సరస్వతీదేవి వీణ ఆపింది. కానీ వీణతీగ ఆగలేదు అందులోనుంచి శబ్దము వస్తున్నది. అమ్మవారి గొప్పతనము కచ్ఛపి గుర్తించలేదు. వీణ ఇంకా అనురాననంతో కుయ్ మంటున్నది. కచ్చపిని ఆపి అమ్మవారి కంఠమాధుర్యము ముందు నువ్వు పాడతావా! అని గలీబు తొడిగేసింది. ఎందుకు తొడగవలసి వచ్చింది అనగా ఎవరైనా ముఖాన్ని ఎవరికీ చూపించలేకపోతే నెత్తిమీద బట్ట వేసుకుంటే వారు సిగ్గుచేటు అయినపని చేసినట్లు గుర్తు. బట్ట కచ్ఛపికి పడింది. సరస్వతీదేవి అమ్మవారి గొప్పతనము తెలుసుకుని వినయముతో ప్రవర్తించింది. పాటను ఆపి చేతులు జోడించిన సరస్వతీదేవి ఆనాటి నుంచి ఈనాటివరకు చదువుల రాణిగా నిలబడింది. పరిశీలనము చేసుకుని  అహంకారమును పరిత్యాగము చేస్తే సరస్వతీదేవి కటాక్షము లభిస్తుంది. ఏ మార్గము కావాలన్నది నిర్ణయించుకోవాలి. వినయము కావాలనుకున్నవారు, ఇంకా ఇంకా అమ్మవారి అనుగ్రహము కావాలనుకున్నవారు ఎప్పుడూ భగవంతుడి వంకే చూస్తుండాలి. వినయము లేనినాడు సరస్వతి ఎందుకూ కొరగాదు. వినయము లేని విద్య అహంకారానికి దారితీస్తుంది. ‘నిజసల్లాపమాధుర్యవినిర్భర్స్తిత కచ్ఛపి’ అంటే అర్థము కాదేమో అని శంకరులు - 

‘విపంఞ్చ్యా గాయన్తీ  వివిధమపదానం పురరిపో’ అన్న అద్భుతమైన శ్లోకము ఇచ్చారు. 

మనసులో ప్రేమ ఉంటే అది అభివ్యక్తమవుతుంది. అలా కాకుండా ఆపలేరు. ఆపవలసిన అవసరము కూడా లేదు. శంకరులు అవతార పరి సమాప్తి చేస్తూ వేదము చెప్పిన దానిని పాటించడము నేర్చుకుంటే వృద్ధిలోకి వస్తారని చెప్పారు. ప్రతివ్యక్తి లో ఉండవలసినది వినయం. లోకములో పెద్దలైనవారు ఈశ్వరా! నాకు వినయము ఇవ్వు. నీ నామము ఇవ్వు అని కోరుకుంటారు. 

నీపాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాం 

తపార భూతదయయును తాపసమందార నాకు దయసేయఁ గదే |  

పోతనగారు భాగవతములో అంటారు. చేతివేళ్ళ చేత పెనగి మోగినా అమ్మవారి దగ్గర ఆగకుండా కుయ్ అన్నందుకు కచ్ఛపి తలకు గలీబు కప్పారు. ఈ నామమును ఎవరు పూనికతో దీన్ని వింటారో, చదువుతారో వాళ్ళ రోగములు ఉపశనము పొందుతాయి. అంత  గొప్ప నామము. పైకి ఏమీ తెలియదు. లోపలికి వెడితే అంత  గొప్పస్థితిని ఇవ్వగలదు.🙏


🙏 శ్రీ మాత్రే నమః🙏



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat