*భగవద్గీత - అంతరార్ధ విశ్లేషణ*" - 2వ భాగము.

P Madhav Kumar


పార్థునిలో నున్న సామర్ధ్యం కృష్ణునికి తెలుసు. అర్జునుడు ద్రోణాచార్య, కృపాచార్యుల నుండి ఏమి నేర్చుకున్నాడో గోపాలునికి తెలుసు. వాళ్ళు కేవలం ప్రాపంచిక విద్యలను మాత్రమే నేర్పేరు. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలాగ, ఏమి చెయ్యాలో బోధించారు. కానీ వారు "నేను చేయగలను" అనే మనోధైర్యాన్ని పార్థునికి కలిగించలేరు. ఆ శక్తిని ప్రసాదించే సామర్ధ్యం ఒక్క సద్గురువుకి మాత్రమే ఉంటుంది. 


మానవులందరి ప్రతినిధియైన పార్ధునికి "మనోధైర్యాన్ని" కలిగించి, వాస్తవాన్ని తెలియజెప్పి, అంతిమ లక్ష్యాన్ని ఎలా సాధించాలో చెప్పాలని నడుంబిగించాడు జగద్గురువు. మౌనంగా అన్నీ వింటున్న శ్రీకృష్ణుడు చాలాసేపటి తరువాత నోరుతెరిచాడు. తనను ఆత్మీయునిగా తలచి, అతనికున్న సందేహాలు అడిగాడు కాబట్టీ, ముందుగా జీవితానికి సంబంధించిన కొన్ని ప్రాధమిక విషయాలు చెప్పాలని అభిప్రాయపడ్డాడు.


అర్జునిని ఉద్దేశిస్తూ, పార్ధా! మాయావశుడవై అన్నీ తెలిసిన వానిగా మాట్లాడుతున్నావు. శాశ్వతమైనదానిని విడచిపెట్టి, అశాశ్వతమైనదాని గురించి ఎక్కువుగా బాధపడుతున్నావు. ఇది విజ్ఞులు పనికాదు. 


ఆచరణలో లేని వేదాంతము మెట్టవేదాంతము. అది ఎందుకూ ఉపయోగపడదు. అది అజ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ కనబడే ప్రపంచంలో నిన్న వుంది, నేడు లేదు అన్న ప్రసక్తి ఉండదు. ఈ దృశ్య ప్రపంచంలో ప్రతి జడ, జీవ పదార్ధాలు మార్పు చెంది కొత్తవాటిగా రూపుదిద్దుకుంటాయి. దేనికీ నాశనము వుండదు కేవలం మార్పు వుంటుంది.


నువ్వు, నేను, మన బంధువులు ఆత్మస్వరూపంతో ఎల్లప్పుడూ ఉన్నవారమే. ఆత్మకి మార్పు లేదు. ఆత్మ నిత్యము, శాశ్వతము. మనుజులు పుట్టిన పిమ్మట బాలునిగా, యువకునిగా, వృద్ధునిగా ఎట్లు మార్పుజెందుతున్నాడో, మాసిన బట్టలు విడచి కొత్త బట్టలు ఎట్లు కట్టుకుంటున్నాడో, అట్లే ఓక శరీరము విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని ధరిస్తాడు జీవుడు. అప్పుడు కూడా ఆత్మకు మార్పులేదు. పుట్టుట, నశించుట అనేవి ఈ అఖండ జీవితానికి ఆద్యంతములు గావు. అది సహజము. దానిని తెలుసుకున్నవాడే జ్ఞాని.


లేనిదానికి ఉనికిలేదు, ఉన్నది లేకుండా పోదు. ప్రతి కార్యమునకు కారణము ఉంటుంది. కారణము మూలము, కార్యము దాని వికారము. కారణము నిత్యమైనది, దానినే "సత్" అంటారు. కార్యము అనిత్యమైనది, దానినే "అసత్" అంటారు. అంటే ఈ సృష్టికి మూలకారణం "సత్యము". దాని వికారమైన ఈ ప్రపంచము "అసత్యము". ఆత్మ సత్యము. శరీరము అసత్యము. దీనిని సమగ్రంగా తెలుసుకున్నవాడే ఆత్మజ్ఞాని. 


ప్రకృతిలో నున్న వివిధ వస్తువులపై, మానవ శరీరంలో నున్న ఇంద్రియముల ప్రభావంతో జీవునిలో రాగద్వేషాలూ, సుఖదుఃఖములు కలుగుతుంటాయి. ఇవి శాశ్వతము కావు, ఎందుచేతనంటే కాలానుగుణంగా మొహం, కోరికలు మారుతూవుంటాయి. కాబట్టీ వాటి ఫలితాలు కూడా తాత్కాలికములే. 


వీటి నుండీ తప్పించుకొనుట ఎవ్వరికీ సాధ్యపడదు. అందుచేత వాటిని సహిస్తూ జీవించాలి. ఎవరైతే ఈ సుఖదుఃఖములను ఒకేలా స్వీకరిస్తూ, స్థిరచిత్తము కలిగివుంటాడో అతడు ఆత్మజ్ఞానము పొందుటకు అధికారము కలవాడు. అటువంటి నిత్యమైన, శాశ్వతమైన ఆత్మను అధ్యయనం చేయడమే ఆధ్యాత్మికమని బోధించేడు జగద్గురువు.

✍️శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి

తదుపరి భాగంలో ఆత్మవిశిష్ఠతను తెలుసుకుందాము... 🌹                                                      🪷⚛️✡️🕉️🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat