*శ్రీదేవీభాగవతము - 36*

P Madhav Kumar

తృతీయ స్కంధము - 15*

                       

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 36*


*మూలమంత్రాత్మికా మూలకూటత్రయకళేబరా!*

*కులామృతైకరసికా కులసంకేతపాలినీ!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 


*శశికళా మాతాపితృ సంవాదము*

*శశికళాసుదర్శనుల వివాహము* చదువుకున్నాము.


*అమ్మ దయతో......*

ఈ రోజు  తృతీయ స్కంధములోని

*సుదర్శన - యుధాజిత్తుల యుద్ధం*

*సుబాహు, సుదర్శన కృత దేవీస్తుతి* 

 *సుదర్శనుడు చెప్పిన దేవీ మహిమ*

 చదువుకుందాం......

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


ఆ ముచ్చటా ఈ ముచ్చటా పేరు చెప్పి ఆరు రోజులపాటు శశికళా సుదర్శనులను రాజధానిలోనే (కాశి) ఉంచేశాడు సుబాహుడు. అప్పటికి చారుల ద్వారా యుధాజిత్ర్పభృతుల పన్నుగడ తెలిసింది. చతురంగ బలాలను తోడు ఇచ్చి శశికళా సుదర్శనులనూ మనోరమాదేవినీ సాగనంపాడు. వెనకగా తానూ మరింత సైన్యంతో కదిలాడు.


🌈 *సుదర్శన - యుధాజిత్తుల యుద్ధం* 🌈


సుదర్శనుడి రథం వేగంగా పరుగులు తీస్తోంది. కొంతదూరం వెళ్ళేసరికి శత్రు సైన్యాలు అడ్డగించాయి. ఆర్ధవర్తులాకారంలో ఎదురునిలిచాయి. శత్రుజిత్తు ముందుగా సోదరుడి పైకి బాణాలు వేశాడు. సుదర్శనుడు వాటిని మధ్యలోనే ముక్కలు చేశాడు. యుధాజిత్తు విజృంభించాడు. ధనుస్సు నుంచి పుంఖానుపుంఖంగా బాణాలు కురిపిస్తున్నాడు. సుదర్శనుడు తగిన రీతిలో సమ ఉజ్జీగా సమాధానం చెబుతున్నాడు.


అంతలోకీ కాశీ నరేశ్వరుడు (సుబాహుడు) వచ్చి చేరుకున్నాడు. యుద్ధానికి దిగబోయాడు. సుదర్శనుడు వారించాడు. ప్రధానంగా యుద్ధం శత్రుజిద్యుధాజిత్తులకూ సుదర్శనుడికీ జరుగుతోంది. మిగతావారంతా ప్రేక్షకపాత్ర వహించారు. సంగ్రామం తీవ్రస్థాయికి చేరుకుంది. దారుణంగా జరుగుతోంది. హఠాత్తుగా దేవి ప్రత్యక్షమయ్యింది. అల్లంత ఎత్తున ఆకాశంలో అందరికీ కనిపించింది. 


*సింహవాహనసమారూఢ,  వరాభూషణ భూషిత, నానాదివ్యాయుధధర. దివ్యాంబర పరీధాన. మందార సుమమాలికా విరాజమాన.* 


రాజులంతా ఆశ్చర్యచకితులయ్యారు. సైనికులు నిశ్చేష్టులయ్యారు. ఎవరు ఈ సింహవాహన? కన్నది కాదు, విన్నదికాదు. ఏమిటి ఈ వింత అనుకున్నారు.


శశికళా సుదర్శనులూ మనోరమదేవికి భక్తి ప్రపత్తులతో నమస్కరించారు. జగన్మాత అనుగ్రహించి ప్రత్యక్షమయ్యింది చూడమని సుబాహుడితో నమస్కరింపజేశారు. మహారాజా! నేను నిర్భయుణ్ణి. ఇప్పుడు ఇంకా నిర్భయుణ్ణి.


జగదంబికా దివ్యదర్శనం లభించింది - అంటూ సుదర్శనుడు మరొకసారి ఆదిపరాశక్తికి శిరస్సువంచి నమస్కరించాడు. కామరాజ మహాబీజాక్షరాన్ని జపించాడు. అమ్మవారి సింహం ఒక్కసారి గర్జించింది. శత్రు సైన్యంలో ఏనుగులూ గుర్రాలూ కకావికలై పరుగులు తీశాయి. ఒక్కసారిగా ఝంఝామారుతం వీచి శత్రు సైనికుల కళ్ళల్లో దుమ్ముకొట్టింది.


సుదర్శనుడు సేనాపతిని పిలిచి చెప్పాడు. జగన్మాత మనకు రక్షగా నిలిచింది. ఈ శత్రురాజులు అలా బొమ్మల్లా నిలబడి చూస్తూనే ఉంటారు. ఇదే మార్గాన నిర్భయంగా మన ప్రయాణం సాగించండి. నిరాటంకంగా గమ్యం చేరుకుందాం - అన్నాడు. యథావిధిగా రథాలు కదిలాయి.


యుధాజిత్తు అక్కసుతో మండిపడ్డాడు. తోటిరాజులను ఉసికొల్పాడు. ఏమిటిలా బొమ్మల్లా నిలబడి ఏదో వింత చూస్తున్నారు. చంపండి, వరకండి, సుదర్శనుణ్ణి నరికిపోగులు పెట్టండి. ఇంతమంది బలాఢ్యులను అవమానించి ఒక బలహీనుడు కన్యను తీసుకుపోతూంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? సింహం మీద కూర్చున్నంతమాత్రాన ఒక ఆడదానికి భయపడుతున్నారా? *(కిం భీతా: కామినీం వీక్ష్య సింహోపరిసునంస్థితామ్)* ఏమిటీ పిరికిదనం? ధైర్యసాహసాలే మన ఊపిరి. లేవండి. విజృంభించండి. ఉపేక్షించకండి. వీణ్ణి చంపి కన్యను అపహరించాలి. పింహానికి దక్కవలసింది నక్కకు చిక్కడానికి వీలులేదు. 


ఇలా హెచ్చరిస్తూనే యుధాజిత్తు సుదర్శనుడి పై శరవృష్టి కురిపించాడు. సుదర్శనుడు తన ధనుర్విద్యా వైభవాన్ని ప్రదర్శిస్తూ , అంతకు రెండింతలుగా బాణాలను ప్రయోగించాడు. ధనుస్సు నిరంతరం మండలాకారంలో కనిపిస్తోంది. బాణాలను ఎక్కు పెట్టి విడుస్తున్న కుడిచెయ్యి నిరంతరం కుడిచెవ్వి దగ్గరే కనిపిస్తోంది. అంబుల పొదినుంచి ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎప్పుడు తొడుగుతున్నాడో ఎప్పుడు లాగుతున్నాడో ఎప్పుడు వదులుతున్నాడో - ఇవి ఏవీ ఎవరికీ కనిపించడంలేదు. బాణాలు మాత్రం శరపరంపరగా వచ్చి పడుతున్నాయి. ఏదో ఒక కొత్త యంత్రంలోనుంచి వస్తున్నట్టుగా వచ్చిపడుతున్నాయి.


జగదంబిక చిద్విలాసం తిలకిస్తోంది. ఉన్నట్టుండి కేవలం రెండు బాణాలు విడిచి పెట్టింది. శత్రుజిద్యుధాజిత్తులు మరణించారు. రథాలనుంచి నేలకు ఒరిగిపోయారు. మహా మహా రాజులంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సైనికులయితే ఆయుధాలు చేజార్చి ఎక్కడివాళ్ళు అక్కడే బిగిసిపోయారు.


       ꧁┉┅━❀🔯❀━┅┉꧂


🌈 *సుబాహు, సుదర్శన కృత దేవీస్తుతి* 🌈


సుబాహుడు చాలా సంతోషించాడు. *"హే దుర్గతినాశిని దుర్గే"* అంటూ చేతులు జోడించాడు. జగన్మాతను స్తుతించాడు.


*నమో దేవ్యై జగద్ధాత్ర్యై శివాయై సతతం నమః!*

*దుర్గాయై భగవత్యై తే కామదాయై నమో నమః!!* 

*నమశ్శివాయై శాంత్యై తే విద్యాయై మోక్షదే నమః!*

*విశ్వవ్యా ప్యై జగన్మాత: జగద్ధాత్ర్యై నమశ్శివే!!* 


*అమ్మా!* నీవు నిర్గుణవు. నేను సగుణుడను. బుద్ధితో ఎంత ఆలోచించినా నిన్ను తెలుసుకోలేను. భక్తుల ఆర్తిని తొలగించే పరాశక్తివి నువ్వు. నీ ప్రభావం ఇంత స్పష్టంగా ప్రకటమవుతూంటే ఏమని స్తుతించను, ఎలా స్తుతించను! వాగ్గేవతవు నువ్వు. సర్వత్రా నువ్వే. బుద్ధి, విద్య, మతి, గతి అన్నీ అందరికీ నువ్వే. ఆత్మరూపవు. పర్వమనోనియంత్రివి. నిన్ను స్తుతించడమైనా నీ అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. నీ గుణాలను బ్రహ్మాది దేవతలు నిరంతరం స్తుతిస్తున్నారే కానీ ఇప్పటికీ పారం ముట్టలేకపోతున్నారు. ఇక నేననగా ఏపాటి! ఇంతకాలమూ సజ్జన సాంగత్యం లేక, చిత్తశుద్ధిలేక నిన్ను స్తుతించలేకపోయాను. ప్రాసంగికంగానైనా ప్రస్తావించలేకపోయాను. ఇప్పుడు సుదర్శనుడు అల్లుడు కావడంతో అద్భుతమైన నీ దివ్యరూప సందర్శన మహాభాగ్యం లభించింది. ధన్యుణ్ని దేవీ! ధన్యుణ్ణి. బ్రహ్మాది సకలదేవతలూ మహర్షులూ మహా యోగులూ విరంతరం కాంక్షించే నీ దివ్యదర్శనం ఎవరికీ దక్కనిది నాకు శమదమాదులు ఏమీ లేకండా సులభంగా దక్కింది. ఇది కేవలం నీ దయ. నువ్వు నిజంగా భక్తానుకంపనపరాయణవు. ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి?


కష్టాలలో ఉన్న సుదర్శనుణ్ణి రక్షించావు. అతడి శత్రువులను క్షణకాలంలో సంహరించావు. పరమపవిత్రమైన నీ భక్త రక్షణ చరిత్రకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఒక రకంగా చూస్తే ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నీ భక్తుణ్ని నీ సేవకుణ్ని నీవు కాపాడటం, అతడి యశస్సును దశదిశలకూ వ్యాపింపజెయ్యడం - ఇది నీకు సహజగుణం.


జననమరణాది భయాలను తొలగించే దివ్యశక్తివి. చరాచరజగత్తుకి ప్రాణప్రదవు. పాప పుణ్యాలకు అతీతవు. ఒక జపం కానీ ఒక సేవకానీ ఏమీ తెలియని అజ్ఞానిని నన్ను కరుణించావు. దివ్యదర్శనం అనుగ్రహించావు. నేను సుకృతిని, నేను కృతార్థుణ్ణి. నా జన్మ ధన్యమయ్యింది. నీ శక్తి నీ ప్రభావమూ నీ దయాగుణమూ అవగతమయ్యాయి.

 

కాశీ నరేశ్వరుడు సుబాహుడు అచంచల భక్తి విశ్వాసాలతో తన్మయుడై స్తుతించేసరికి జగజ్జనని ప్రసన్నవదన అయ్యింది. కావలసిన వరం కోరుకోమంది.


*(అధ్యాయం - 23, శ్లోకాలు - 55)*


*జగవ్మాతా!* ఏమి కోరుకోమంటావు ? దేవలోకంతోసహా సకల భూమండలాన్నీ ఒకవైపు ఉంచి నీ దివ్యదర్శనం మరొక వైపు ఉంచితే అవి రెండూ సమానం కావు. ముల్లోకాలలోనూ నీ దర్శనానికి సాటివచ్చేది లేదు. అలాంటి దర్శనాన్నే అనుగ్రహించి కృతార్థుణ్ణి చేశావు. ఇంతకన్నా వరం ఏమి కావాలి తల్లీ! అయినా కోరుకోమన్నాక కోరుకోవాలి కనక అభ్యర్థిస్తున్నాను. నీపట్ల నా భక్తి నిశ్చలంగా నిరంతరంగా ఉండేట్టు అనుగ్రహించు. మా నగరంలో నువ్వు ఎల్లప్పుడూ స్థిరనివాసం ఉండాలి. దుర్గాదేవి పేరుతోనిలిచి నన్నూ, వా వంశాన్ని, వా ప్రజలనూ, నా రాజ్యాన్ని సర్వదా సర్వధా సుదర్శనుడిని రక్షించినట్టే రక్షిస్తుండు తల్లీ ! కాశీపట్టణం ఉన్నంతకాలమూ నీ రక్షణ ఉండాలి. నువ్వు కాపురం ఉండాలి. ఇంతకన్నా నేనేమీ కోరుకోను. సకల శుభాలనూ కలిగించు. శత్రువులను సంహరించు. అభద్రతలను తొలగించు.


*జనమేజయా!* సుబాహుడి అభ్యర్ధనకు జగన్మాత సరే అంది. భూమండలం ఉన్నతవరకు, ముక్తి పట్టణం కాశీలో తాను స్థిర నివాసం ఉంటానంది. అపుడు సుదర్శనుడు కూడా సింహవాహనకు సాష్టాంగనమస్కారం చేసి భక్తితో స్తుతించాడు. 


*అమ్మా!* నీ దయకు అవధులు లేవుకదా! భక్తులు కాని వారిని కూడా కాపాడే ఏకైక కృపానిధివి. భక్తులను అనుగ్రహించే దేవతలు చాలామంది ఉన్నారు కానీ భక్తులు కాని వారిని కాపాడే తల్లివి నువ్వు మాత్రమే. అది నీ వ్రతం. నీ దీక్ష,  అటువంటిదానవు నన్ను కాపాడటంలో వింత ఏముంది తల్లీ! సకల ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు. పోషిస్తున్నావు. ప్రళయకాలంలో నువ్వే మళ్ళీ ఉపసంహరిస్తున్నావు.


*జగన్మాతా!* ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో చెప్పు. ఎక్కడికి వెళ్లమంటావు? నీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేస్తాను. నీ అనుజ్ఞ లేకండా నేను అడుగు కదపలేను. కదపను - అనేసరికి జగదంబ ప్రసన్నచిత్తంతో పలికింది.


*సుదర్శనా!* అయోధ్యకు వెళ్ళు. సింహాసనం అధిష్ఠించు. నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. నా అర్చన స్మరణ పూజనలు మర్చిపోకు. నీకూ నీ ప్రజలకూ సకలశుభాలూ కలిగిస్తాను. రక్షణగా నిలుస్తాను. అష్టమి నవమి చతుర్దశి తిథులలో నాకు విశేషార్చనలు బలిదాన విధానాలతో జరిపిస్తూండు. నీ నగరంలో ప్రజలంతా ముప్పొద్దులా నన్ను అర్చించాలి. శరత్కాలంలో నవరాత్ర దీక్షతో మహాపూజలు జరగాలి. చైత్ర ఆషాఢ ఆశ్వయుజ మాఘ మాసాలలో మహోత్సవాలు జరిపించు. ప్రతినెలా కృష్ణ చతుర్దశి నాకు చాలా ప్రీతిపాత్రమైన రోజు. ఆరోజు విశేషంగా అర్చనలు చేసినవారిని విశేషంగా అనుగ్రహిస్తాను.


       ꧁┉┅━❀🔯❀━┅┉꧂


🌈 *సుదర్శనుడు చెప్పిన దేవీ మహిమ* 🌈


సుదర్శనుడు మళ్ళీ స్తుతించేలోగా దుర్గాదేవి అంతర్హిత అయ్యింది. రాకుమారులందరూ తేరుకొని బిలబిలా వచ్చి సుదర్శనుడికి పాదాభివందనాలు చేశారు. సుబాహుడు కూడా నమస్కరించాడు. దేవతల మొక్కులందుకొంటున్న దేవేంద్రుడిలా భాసించాడు ఆ క్షణాన సుదర్శనుడు.


*అయోధ్యాధిపతీ!* నీకు మేమంతా ఈ రోజు నుంచీ సామంతులం. సేవకులం. నువ్వు మాకు ప్రభువువి.


శాసకుడివి. మమ్మల్ని పాలించు. నీ అనుగ్రహం వల్ల విశ్వేశ్వరీ దర్శనం లభించింది మాకు. ఆదిశక్తి, చతుర్వర్గ ఫలప్రద. నీతో పాటు మేమూ ధన్యులమయ్యాం. నీకోసం జగన్మాత అవతరించిందంటే ఈ భూలోకంలో నీ అంతటి పుణ్యాత్ముడు లేడు. ధన్యాత్ముడు లేడు. మాయామోహితులమై మేము తెలుసుకోలేకపోయాం. నువ్వు చెబుతూనే ఉన్నావు - ఆదిశక్తి ఆజ్ఞమేరకు స్వయంవరం చూసి వెళ్ళడానికి వచ్చాను అని.


కానీ మేము మూఢులం. నీ ప్రభావాన్నీ జగదంబిక ప్రభావాన్ని గ్రహించలేకపోయాం. మాకు ఎంత సేపూ సంసారచింతనలే. ధనమూ ధాన్యమూ భార్యలూ పిల్లలూ ఇవే చింతనలు. ఒకటే ధ్యాస. కామక్రోధాలనే తిమితిమింగలాలతో నిండిన ఘోరసంసార మహాసముద్రంలో నిండా మునిగిపోయి ఉన్నాం. మమ్మల్ని క్షమించు. మమ్మల్ని ఉద్ధరించు. నువ్వే మాకు నౌకవు. సర్వజ్ఞుడవు. దేవీ మాహాత్మ్యం తెలియజెప్పి మమ్మల్ని తరింపజెయ్యి. మా జీవనమార్గాలను సరిదిద్దు. 


రాకుమారుల ఈ అభ్యర్ధనకు సుదర్శనుడు సంతోషించాడు. మనసులో మరొక్కసారి జగదీశ్వరిని ధ్యానించాడు. భూపతులారా! నేనుమాత్రం ఆ దేవీ మాహాత్మ్యాన్ని చెప్పగలనా? హరిహరాదులకే సాధ్యం కాదు. 


అన్నింటికీ మూలమైన ఆదిపరాశక్తి, సాత్త్వికగుణ ప్రధానంగా మహాలక్ష్మీరూపాన్ని ధరించి ఈ జగత్తును పరిపాలిస్తుంటుంది. రజోగుణ ప్రధానంగా మహాసరస్వతీ రూపంలో జగత్తును సృష్టిస్తుంది. మహాకాళీ రూపంలో తమోగుణ ప్రధానంగా ప్రళయకాలంలో ఉపసంహరిస్తుంది. ఇవి త్రిగుణ స్వరూపాలు. ఆదిపరాశక్తి మాత్రం గుణాతీత. త్రిమూర్తులకూ మూలకారణం. ఆ శక్తిని తెలుసుకోవడం యోగీశ్వరులకైనా అసాధ్యం. సగుణరూపమే మనకు సుఖ సేవ్యం. పరమ కారుణికురాలు. పరమదయామయి. నా ఉపాస్యదైవం - సాత్త్విక వైష్ణవీ రూప.


*సుదర్శనమహారాజా!* నువ్వు బాలుడుగా ఉండగానే అడవులకు వచ్చేశావుకదా, పరాశక్తిని ఎలా తెలుసుకున్నావు? ఎలా ఉపాసించావు? ఎవరు ఉపదేశించారు? నీ మీద ఆ తల్లికి ఎంత అనురాగం లేకపోతే ఇలా ప్రత్యక్షంగా వచ్చి సహాయపడుతుంది! ఆ విశేషాలన్నీ చెప్పు మిత్రమా! వినాలని చాలా కుతూహలంగా ఉంది.


*నృపతులారా!* బాల్యంలోనే నాకు మహాదేవీ మంత్ర బీజాక్షరం లభించింది. అది కామబీజాక్షరమని నాకు తెలియదు.


కానీ తదేక దీక్షతో నిరంతరం పదిపన్నెండు సంవత్సరాలపాటు జపించాను. ఎంతకాలం జపించానో ఎన్నికోట్లు జపించానో వాస్తవానికి నాకేమీ తెలియదు. భరద్వాజుని ఆశ్రమంలో ఋషీశ్వరులు చెప్పగా దేవీ మాహాత్మ్యం కొంత తెలుసుకున్నాను. సహజంగా ఆ జగన్మాత వాత్సల్యగుణ సంపూర్ణ కనక కష్టాలలో కనికరించి ఆదుకుంది. ఇందులో నా గొప్పదనం ఏమీలేదు. ఇంతకన్నా నేను చెప్పగలిగిందీ లేదు - అని సుదర్శనుడు క్లుప్తంగా ముగించాడు.


రాకుమారులు సంతోషించి పరాశక్తి దివ్యదర్శనానుభవాన్ని పదేపదే నెమరువేసుకుంటూ తమతమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుబాహుడు కాశీపట్టణం చేరుకున్నాడు. సుదర్శనుడు శశికళతో మాతృమూర్తి మవోరమతో అయోధ్యకు రథాలను నడిపించాడు. అప్పటికే శత్రుజిద్వధ - సుదర్శన విజయం కోపల ప్రజలకు తెలిసిపోయాయి. మంత్రులూ దండనాయకులూ సేనాపతులూ పౌరులూ కోలాహలంగా ఉపాయనాలతో (కానుకలు) ఎదురు వచ్చారు. సగౌరవంగా పురప్రవేశం చేయించారు. వందిమాగధులు స్తుతిస్తూండగా, మంత్రిసత్తములు నమస్కరిస్తూండగా, కన్యామణులు పువ్వులూ లాజలూ (పేలాలు) జిల్లుతూండగా మదర్శనుడు రాజప్రాసాదంలోకి అడుగు పెట్టాడు.


*(రేపు సుదర్శనుడు లీలావతిని ఓదార్చడం)*


*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*


               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏


🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏


🙏 శ్రీ మాత్రే నమః🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat