*🌻1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము🌻*
*🌻అలంకారసమర్పణము🌻*
🍃🌹వెంటనే అర్చకులు శ్రీవారి ఊర్ధ్వపుండ్రమునకుగాను శ్రీజియ్యంగారు ఇచ్చిన పచ్చకర్పూర కస్తూరి పాత్రమును తీసుకొన గానే వారు ప్రబంధ తొడక్కంచేసి శేషపరిమళమును వారల యేర్పాటు ప్రకారము తీసుకుని అంతర్ద్వారము ముందు భాగమునకు వెళ్లెదరు. అంతట అర్చకులు అంతర్ద్వారము తలుపులు వేసి ఏకాంత ముగా శ్రీవారికి ఊర్ధ్వపుండ్ర వస్త్రాభరణాద్యలంకారములను సమర్పిం చెదరు. ఆ సమయమున శ్రీ జియ్యంగార్లు, అధ్యాపకులు, ఆచార్య పురుషులు అంతర్ద్వారము యొక్క ముందుభాగమున పంక్తులు తీరి పద్మాసనమున కూర్చుండి దివ్య ప్రబంధము నాచ్చియార్ తిరుమొళి (150) పాశురములను గానము చేయుచుందురు.
🍃🌹పిమ్మట అర్చకులు తగుయేర్పాట్లు చేసుకుని శ్రీవారికి పచ్చకర్పూరముతో మామూలు ప్రకారము ఊర్ధ్వపుండ్రమును మధ్య భాగమున కస్తూరితో తిలకపుండ్రమును అతిరమణీయముగా సమర్పించెదరు. దివ్య ప్రబంధగానము ఆగిపోవును.
🍃🌹శంఖచక్రోర్ధ్వ పుండ్రాదులచే చిత్రింపబడిన బంగారు సరిగ పట్టంచుతో కూడిన 24 మూర పొడవు 4 మూర వెడల్పు గల అమూల్యమైన బంగారుసరిగ పట్టుధోవతిని అతిసుందరముగా సమర్పించి, 12 మూర పొడవు 2 మూర వెడల్పు గల అమూల్యమైన సరిగపట్టంచుతో కూడిన పట్టు ఉత్తరీయమును వల్లెవాటుగా వేయుదురు.
🍃🌹హృదయ ప్రదేశమునందు కపాయిని (గాత్ర సంవరణ వస్త్ర విశేషమును) సమకూర్చి కఠారి వస్త్రమును సమర్పించెదరు. ఈ కఠారి వస్త్రముతో శ్రీవారి సూర్యకఠారియను ఖడ్గ సంబంధము కలిగి ప్రకాశించుచూ భక్తులకు దర్శనమిచ్చుచుండును.
🍃🌹పిమ్మట శ్రీవారికి ఆభరణములను సమర్పించుదురు.
సువర్ణపద్మపీఠము - శ్రీపాదముల క్రింద
సువర్ణపాదములు - శ్రీ పాదములకు
నూపురములు(చిరు గజ్జెలతో కూడుకున్నవి) - శ్రీపాదములకు పైన పాదాభరణములు
పాగడాల్ - నూపురములకు పైన పాదాభరణములు
కాంచీగుణము - మధ్యమాభరణము (మొలనూలు)
ఉదరబంధము (నాగఫణ యుతము) - మధ్యాభరణము (బెల్టు)
దశావతారరశనా చిరు గంటలతో కూడినది - దశావతారములు, పంచవ్యూహములు, శ్రీభూదేవులు, స్వామివారు, 18 విగ్రహములతో కూడిన చిరుగంటల మొలత్రాడు
చిన్నకంఠాభరణము - కంఠభూషణము
పెద్దకంఠాభరణము - వక్షస్థల పర్యన్తము
బంగారు పులిగోరుహారము - హృదయపర్యన్తము
గోపు హారము - నాభి పర్యన్తము అయిదు పేటల హారము
సువర్ణయజ్ఞోపవీతము - రత్న గ్రంథులుగల ఆరు పేటల ఉపవీతము
సాధారణ యజ్ఞోపవీతము - షణావతిచే తయారైన యజ్ఞోపవీతము
తులసీపత్రహారము - కటిహస్తపర్వన్తము 108 పత్రముల హారము
చతుర్భుజలక్ష్మీహారము - జానుపర్యన్తము 108 లక్ష్మీ ప్రతిమలతో కూడిన హారము
అష్టోత్తరశతనామహారము - జంఘాపర్యనము (108) అష్టోత్తర శతనామములుగల బిళ్లలతో కూడిన హారము
సహస్రనామ హారము - పాదపర్యన్తము (1000) వెయ్యి నామములుకల వెయ్యి బిళ్లలతో కూడిన ఐదువరుసల హారము
సూర్య కఠారి - నాభ్యాది పాదపర్యన్తము కఠారి వస్త్రమునకు సంబంధించినది
వైకుంఠ హస్తము - దక్షిణహస్తము
కటి హస్తము - వామహస్తము
కడియములు - కర భూషణములు
కడియములు - భుజదండ భూషణములు
నాగాభరణములు - భుజదండ ,భూషణములు
భుజకీర్తులు - భుజభూషణములు
కర్ణపత్రములు - కర్ణభూషణములు
చక్రశంఖములు - ఇతరహస్తములయందు
కిరీటము - శిరోభూషణము పరత్వ వ్యంజకము
ఈ ఆభరణములన్నియు సువర్ణాభరణములు. ప్రతి దినమందును సామాన్యముగా సమర్పించబడియుండును.
🍃🌹విశేషదినములయందు విశేషాభరణములు అనగా 1 రత్న కిరీటము, మేరుపచ్చ (గారుత్మతము), రత్నమయ చక్ర శంఖములు, రత్నమయకర్ణపత్రములు, రత్నమయ వైకుంఠహస్తము, రత్నమయ కటిహస్తము రత్నమయమగు మకరకంఠి (మూడుతరగతులుగా వుండును) సువర్ణ పీతాంబరము - ఈ పదిరత్నాభరణములు సమర్పించబడుచుండును.
🍃🌹కొన్ని కొన్ని దినములయందు వేరుగా సంరక్షింపబడి యున్న సువర్ణాభరణములు రత్నాభరణములు రత్నహారములు పలువిధములైనవి ఉత్సాహానుగుణముగా సమర్పించబడుచుండును.
🍃🌹ఇటుల శ్రీ స్వామివారికి అమూల్యములగు వస్త్రములచేతను, ఆభరణములచేతను హారములచేతను అతిరమణీయముగా వైభవాలంకారము పూర్తి అయిన పిమ్మట అంతర్ద్వారము తలుపులు తీసెదరు.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*