*శ్రీదేవీభాగవతము - 38*

P Madhav Kumar


*తృతీయ స్కంధము - 17*

                       

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 38*


*మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంథివిభేదినీ!*

*మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథివిభేదినీ!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 


*సుదర్శనుడు లీలావతిని ఓదార్చడం*

*కాశీ-అయోధ్యలలో దేవీ మందిర నిర్మాణాలు*

*దేవీనవరాత్రాలు*

*కుమారీపూజ* చదువుకున్నాము.


*అమ్మ దయతో......*

ఈ రోజు  తృతీయ స్కంధములోని

*సుశీలుని కథ*

 చదువుకుందాం......

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🌈 *సుశీలుడి కథ* 🌈


పూర్వకాలంలో ఒకప్పుడు కోసలదేశంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. సత్యసంధుడు. శాంతస్వభావుడు. దగాలూ మోసాలూ తెలియనివాడు. దానదయాధర్మశీలుడు. అసూయలేనివాడు. అందరూ ఇతడి గుణగణాలకు మెచ్చి సుశీలుడు అని పిలిచేవారు. గుణాలలో సంపన్నుడే కానీ ధనాలలో నిరుపేద.


దానికి తోడు అధిక సంతానం. అడవికి వెళ్ళి కాయలూ పళ్ళూ ఏరి సాయంత్రానికి ఇంటికి తెచ్చేవాడు. అందరూ తలా ఒకటి తిని ఇన్ని మంచినీళ్ళు తాగి పడుకునేవారు. పెద్దమ్మాయికి ఎలాగో కష్టపడి పెళ్ళి చేశాడేగానీ అల్లుడూ కూతురూ తన ఇంట్లోనే ఉంటున్నారు. వీరికి తోడు మనుమడు ఒకడు. ఎప్పుడూ ఇల్లంతా కేగల్లోమంటూ ఉండేది. మనుమడు ఆకలివేసి ఏడిస్తే కోరింది తెచ్చి ఇవ్వలేక, ఊరుకోబెట్టలేక సతమతమయ్యేవాడు. ఒకరోజున ఉక్రోషం పట్టలేక పసిబిడ్డణ్ణి కొట్టి ఏకాంతంలో ఎంతగానో దుఃఖించాడు. ఆ పసిబాలుడు ఎటు వెళ్ళిపోయాడో ఆచూకీ లేదు.


ఇదిలా ఉండగా రెండవ ఆడపిల్ల పెళ్ళికి ఎదిగింది. పదకొండో ఏడు వచ్చేసింది. అది దాటేలోగా పెళ్ళి చెయ్యకపోతే కవ్యాదాన ఫలం దక్కదని మరొక కొత్త దిగులు పట్టుకుంది - వైశ్యుడికి.


అతికష్టంగా ఈసురోమంటూ కాలం గడుస్తోంది. ఒకరోజున వీథివెంట వెడుతూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతణ్ణి చూడగానే ఎందుకోమరి సుశీలుడికి తన గోడు వెళ్ళబోసుకోవాలి అనిపించింది. వెళ్ళి నమస్కరించి అంతా వివరంగా చెప్పుకున్నాడు. మహానుభావా! నాకేమీ అత్యాశలు లేవు.


కోటానుకోట్ల రూపాయలు నాకు వద్దు. రత్నరాశులూ బంగారు కాసులూ కోరను, నాకూ నా వాళ్ళకు ఆకలిబాధ తీరితే చాలు. కనీసం రోజుకి ఒక పూట అయినా అయిదువేళ్ళు నోటిలోకి వెడితే చాలు. ఇంతకన్నా వేను కోరేది ఏమీలేదు. ఈ దారిద్ర్యం తీరే ఉపాయం ఏడయినా చెప్పు. మంత్రమో తంత్రమో జపమో తపమో నోమో వ్రతమో - ఏదోఒకటి ఉపదేశించు. శక్తిమేరకు భక్తి శ్రద్ధలతో చేస్తాను. తమరు వేదవేదాంతవేత్తలు. మహాతపస్వులు. మీకు చాలా విద్యలు తెలుసు. దయచేసి ఏదైనా ఒక దారి చూపించండి. ఇదిగో సాష్టాంగ పడుతున్నాను.


నుశీలుడు ఇలా ప్రార్థించేసరికి ఆ బ్రాహ్మణుడికి దయ కలిగింది. *దేవీ నవరాత్ర వ్రతం* చెయ్యమని ఉపదేశించాడు. పూజన భోజన హవన పారాయణలతో శ్రద్ధగా చెయ్యమన్నాడు. వేదపండితులను పిలవమన్నాడు. ఇంతకు మించిన వ్రతం భూగోళంలో లేదు, నీ దారిద్ర్యం తీరుతుంది. ఇది జ్ఞాన సుఖమోక్షప్రదమైన ఉత్తమ వ్రతం. తేలికగా చెయ్యవచ్చు. శత్రునాశకమూ మిత్రవర్ణకమూను. రాజ్యభ్రష్టుడై అడవులకు వచ్చిన రాముడు, సీతను రావణాసురుడు అపహరించుకుపోగా ప్రస్రవణాద్రి పై విరహవేదనతో వర్షర్తువును గడిపి శరదృతువుగానే ఈ నవరాత్ర వ్రతాన్ని శ్రద్ధగా చేశాడు. దాని ఫలితంగా సీతమ్మజాడ తెలిసింది, సేతువు నిర్మించాడు. రావణ కుంభకర్ణులను సంహరించి మళ్ళీ సీతాదేవినీ అయోధ్యా సామ్రాజ్యాన్ని పొందగలిగాడు. ఇంత దివ్యశక్తి కలిగినది ఈ వ్రతం. కాబట్టి వణిగ్వరా ! నువ్వు కూడా చెయ్యి. నువ్వూ నీ కుటుంబమూ సుఖసంతోషాలను పొందుతారు - అని వ్రతమాహాత్మ్యాన్ని క్లుప్తంగా చెప్పాడు ఆ బ్రాహ్మణుడు.


అయితే, *మహానుభావా !* మీరే నా గురువులు. అంబికా దివ్యమంత్రం ఉపదేశించండి. నా శక్తి మేరకు నవరాత్రోత్సవాలు చేస్తాను - అని సుశీలుడు ప్రాధేయపడ్డాడు. బ్రాహ్మణుడు ఉపదేశించిన మాయా బీజాఖ్యమైన దివ్యమంత్రాన్ని స్వీకరించి తదేకదీక్షతో జపిస్తూ, శక్తివంచన లేకుండా యథావిధిగా నవరాత్ర వ్రతం చేశాడు సుశీలుడు. క్రమం తప్పకుండా ఏటేటా చేస్తున్నాడు. తొమ్మిదవ సంవత్సరం నవరాత్రులు జరుపుతూండగా మహాష్టమినాటి అర్ధరాత్రి జగదీశ్వరి ఆ సుశీలుడికి స్వప్నంలో సాక్షాత్కరించింది. అనేకవరాలను ప్రసాదించి కృతకృత్యుణ్ణి చేసింది.


*(అధ్యాయం - 27 శ్లోకాలు - 57)*


*వ్యాసమహర్షీ!* ఈ వ్రతాన్ని శ్రీరామచంద్రుడు చేశాడని ఆ విప్రుడు చెప్పాడు కదా ! ఏ విధానంగా చేశాడు ? ఎందుకు చేశాడు ? రాజ్యభ్రష్టుడయ్యాడనీ సీతను ఎవరో అపహరించారనీ అతడు అన్నాడు. ఆ విశేషాలన్నీ వినాలని ఉంది. శ్రమ అనుకోక క్లుప్తంగానైనా చెప్పి పుణ్యం కట్టుకోవా !


జనమేజయుడు ఇలా ప్రశ్నిస్తాడని వ్యాసుడు ఊహించినట్టున్నాడు. ఒక చిరునవ్వు విసిరి రామకథను అందుకున్నాడు. శౌనకాది మహామునులారా ! వ్యాసుడు చెప్పిన రామకథ ఇది. శ్రద్ధగా ఆలకించండి.


*(రేపు రామ కథ)*


*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*


               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏



🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏


🙏 శ్రీ మాత్రే నమః 🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat