*శ్రీదేవీభాగవతము - 44*

P Madhav Kumar


*చతుర్థ స్కంధము - 04*

                       

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 44*


*నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా!*

*నిర్గుణా నిష్కలా శాంతా నిష్కామా నిరుపప్లవా!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 

 

*"నరనారాయణుల తపస్సు"*

*'అప్సరసలకు గర్వ భంగము:'* చదువుకున్నాము.


*అమ్మ దయతో......*  ఈ రోజు  

*అహంకారం సృష్టిబీజం*

చదువుకుందాం.

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


*జనమేజయా!* అప్సరల గురించి నరుడు ఇలా ఉపదేశించే సరికి నారాయణుడు తేరుకున్నాడు. క్రోధం జోలికి పోకూడదంటే పోకూడదు అని నిశ్చయించుకున్నాడు.


🌈 *అహంకారం సృష్టిబీజం* 


ఇక్కడ వ్యాసుడి ప్రసంగప్రవాహానికి జనమేజయుడు మళ్ళీ అడ్డుకట్ట వేశాడు. *ప్రహ్లాదుడితో వీరికి యుద్ధం జరిగిందా? ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది?* ముందుగా ఆ కథ చెప్పు.


చాలా కుతూహలంగా ఉంది. 


నరనారాయణులు మహాతపస్వులు. శాంతచిత్తులు. ప్రహ్లాదుడేమో అతి ధర్మాత్ముడు. విష్ణుభక్తుడు. మహాజ్ఞాని. వీరికి పరస్పరం శత్రుత్వం ఎలా ఏర్పడింది? క్రోధమే వైరకారణమైతే ఇక జపాలేమిటి? తపాలేమిటి? శ్రమ ఏవ హి కేవలమ్! అహంకార సముద్భవమైన క్రోధాన్ని వారే జయించలేకపోతే ఇక మాబోంట్లమాట చెప్పేదేమిటి! 


అహంకారబీజం లేనిదే క్రోధమూ లేదు, మాత్సర్యమూ లేదు. అహంకారం అంకురించిందంటే, కోటి సంవత్సరాలు చేసినా తపస్సులన్నీ నిష్ఫలం. సూర్యుడు ఉదయిస్తే చీకటి నిలవనట్టే, అహంకారం అంకురిస్తే పుణ్యం నిలవదు. అవునుకదా! అసలు నాకు తెలియక అడుగుతాను మహర్షీ! ఈ ముల్లోకాలలోనూ ఏకాలంలోనైనా అహంకారాన్ని జయించినవాడు ఒక్కడంటే ఒక్కడు మచ్చుకైనా ఉన్నాడంటావా? పోనీ భవిష్యత్తులో ఉంటాడంటావా ? ఇనుప సంకెళ్ళను తెంపుకోవచ్చు, కొయ్య గుదిబండలను వదిలించుకోవచ్చు, అహంకార బంధనాన్ని మాత్రం ఎవడూ విడిపించుకోలేడు.


స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తు అంతా అహంకారావృతమే. బ్రహ్మజ్ఞాని కూడా మలమూత్ర పరిదూషితమైన ఈ సంసారంలో పరిభ్రమిస్తున్నాడంటే అహంకారమే కారణం అంటున్న మీమాంసకుల సిద్ధాంతం నిజమే అనిపిస్తోంది. 


సత్తెకాలం నాటి (సత్యయుగం) మహాత్ములు ప్రహ్లాద నరనారయణులే అహంకార కామక్రోధాదులకు లొంగిపోయారంటే, ఈ కలికాలంలో నావంటి సామాన్యుల సంగతి వేరే చెప్పాలా, మహానుభావా!


*జనమేజయా!* కారణంకంటే కార్యం భిన్నమెలా అవుతుంది? ఉంగరమైనా కడియమైనా బంగారంతో చేసింది బంగారమేకదా? ఈ సృష్టి అహంకారోద్భవం. అందుచేత అహంకారభిన్నం కానేరదు. దారపు పోగులతో నేస్తే ఏర్పడుతున్న వస్త్రం, పోగులు తీసేస్తే ఉంటుందా? సత్త్వరజస్తమో రూపమైన మాయా గుణాలు మూడింటితో నిర్మింపబడినది ఈ స్థావరజంగమాత్మకమైన విశ్వం. అందుకని, బ్రహ్మమొదలుకొని తృణస్తంబ పర్యంతమూ (గడ్డిపోచ) ఎక్కడ వెదికినా ఇవే కనపడతాయి. త్రిమూర్తులకే దిక్కులేదు.


వారూ అహంకారమోహితులే. వసిష్ఠ నారదాది మహాజ్ఞానులున్నారు. వారూ ఈ అగాధమైన సంసారంలో పడి పరిభ్రమిస్తూనే ఉన్నారు. సందేహమెందుకు, దేహధారిగా జన్మించి ఈ మాయాగుణాలకు అతీతంగా శాంతుడై ఆత్మానందంలో స్థిరపడినవాడు ఒక్కడంటే ఒక్కడు ఈ ముల్లోకాలలోనూ లేడంటే లేడు.


అహంకారం నుంచి ఆవిర్భవించే కామక్రోధాలూ లోభమోహాలూ శరీరం ఉన్నంతవరకు మానవుణ్ణి వదిలి పెట్టవు. వేదశాస్త్రాలు అభ్యసిస్తున్నాడు, పురాణాలు అవలోకనం చేస్తున్నాడు. తీర్థయాత్రలకు వెడుతున్నాడు. దానాలూ ధ్యానాలూ నిర్వహిస్తున్నాడు. ఇదంతా విషయాసక్తుడై చేస్తున్నాడు. దొంగలాగా చేస్తున్నాడు. కృత త్రేతా ద్వాపరయుగాలనాటికే పరిస్థితి ఇలా ఉంది. ఇంక ధర్మం బద్దలైపోయిన . కలియుగంలో కథ ఏమని చెప్పమంటావ్? 


స్పర్థ, ద్రోహం, లోభం, అమర్ష (ఈర్ష్య) ఇవ్వే సర్వదా సర్వత్రా రాజ్యమేలుతున్నాయి. నిజమే, ప్రపంచం ఇలాగే ఉంది. అయినా విచారించవలసిన పని లేదు. 


క్రోధ మద మాత్పర్యాలను జయించిన సాధుసజ్జనులు చెదురుమదురుగానైనా ఒకరో ఇద్దరో ఈ భూగోళం మీద లేకపోలేదు. ఉన్నారు. దృష్టాంతంకోసం ఉన్నారు.


*వ్యాసమహర్షి!* నిజంగా ఉన్నారంటావా? ఉంటే ముమ్మాటికీ వారు ధన్యులు. ముల్లోకాలూ వారికి దాసోహమంటాయి. మా తండ్రిగారు చేసిన మహాపాతకం ఇప్పటికీ నా మనస్సును కాల్చివేస్తోంది. అహంకరించి మృతసర్పాన్ని ఒక తపస్వి మెడలో వేశాడు. ఎంత ఘోరం! ఎంత పాపం! ప్రతిక్రియ ఏమిటో తెలియడం లేదు. నిజంగా బుద్ధి సమ్మోహం ఎంతటి అకృత్యాన్నైనా చేయిస్తుంది. తేనెకోసం ఆశపడి చిటారు కొమ్మకి ఎగబాకుతాడే తప్ప పడిపోతానన్న సంగతి గుర్తించడు. మహాపాపాలు చేస్తాడు, నరకం ఒకటి ఉందని భయపడడు. 


సరే. ఇంతకీ నరనారాయణులకు ప్రహ్లాదుడితో యుద్ధం ఎందుకు సంభవించింది? ఈ ప్రశ్న నన్ను దొలిచేస్తోంది. ఎక్కడో పాతాళలోకంలో ఉండే ప్రహ్లాదుడూ, సారస్వత తీర్థంలో పవిత్ర బదరికాశ్రమంలో ముక్కుమూసుకుని తావళం తిప్పుకునే నరనారాయణలూ - పరస్పరం ఎలా తారసపడ్డారు? వీరి వైరానికి కారణమేమిటి?


కాంతాకనకాలు గదా వైరతరువుకి విత్తనాలు! ముగ్గురూ ఈషణారహితులే (కోరికలు లేనివారు). ధర్మాత్ములే. జ్ఞానులే. వీరికి యుద్ధమేమిటి? చాలా వింతగా ఉంది. ఈ ఉత్కంఠను తట్టుకోలేను. వెంటనే తెరతొలగించు మహర్షీ!, ఛేదించు.


*(అధ్యాయం -7, శ్లోకాలు- 55)*


*శౌనకాది మహామునులారా!* గమనించారుగదా,  జనమేజయుడి మనస్సు పరమనిర్వేదంతో పరితపిస్తోంది. తన తండ్రి పరీక్షిత్తు చేసిన మహాపాపం, దానికి ఫలితంగా స్నానదానాదిరహితమై పొందిన దుర్మరణం - ఇవి అనుక్షణమూ అతడిని వేధిస్తున్నాయి. పున్నామనరకం నుంచి తప్పించడమెలాగా అని మనసు కలతపడుతోంది. అందరూ అహంకృతులే అనుకోవడంలో ఒక ఊరట లభిస్తోంది. అంతలో పరితపిస్తోంది. భయవిహ్వలుడు అవుతున్నాడు. ఆ చిత్త సంక్షోభం నుంచి విడుమరగా కోరికోరి పుణ్యకథాశ్రవణం చేస్తున్నాడు. వ్యాసుడూ అందుకే వినిపిస్తున్నాడు. అనంతర కథ ఎలా నడిచిందంటే -


*(రేపు.... "ప్రహ్లాద - చ్యవన సంవాదం" )*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏


  

🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏


🙏 శ్రీ మాత్రే నమః 🙏



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat